ఇక ఆర్నబ్‌ స్వంత ‘టైమ్‌’ సేవలు

arnab11మీడియాను మోడియాగా మార్చేయడంలో అగ్రభాగాన నిలిచిన టైమ్స్‌ నౌ చీఫ్‌ ఎడిటర్‌ ఆర్నబ్‌ గోస్వామి రాజీనామా వార్త పెద్ద సంచలనేమేమీ కాదు. ఎందుకంటే ఆయన ఈ రంగం నుంచి వెళ్లడం లేదు. స్వంతంగా ఒక మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకోబోతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి అది ఏ రూపంలో వచ్చి ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పనవసరం లేదు. తన వ్యక్తిగత ప్రచారం తారస్థాయిలో వున్నప్పుడు మోడీ ప్రభుత్వం కల్పించిన వై క్యాటగరీ భద్రత మధ్య ఆయన నిష్క్రమిస్తున్నారు. ఏ పాలనా వ్యవస్థ ఆయనకు ఇవన్నీ కల్పించిందో అదే తన భవిష్యత్తునూ కాపాడుకుంటుంది. అది దాని అవసరం. ఆర్నబ్‌ గోస్వామి విగ్రహం, స్వరం, పదును ఇవన్నీ చాలా ఆకర్షణీయమైనా అన్నిటికన్నా ఆయనకు ప్రచారం కల్పించింది రాజకీయ కోణమే. రాజకీయాల్లో మోడీ ఎలాటి పాత్ర నిర్వహించారో టీవీ మీడియాలో ఆయన అదే చేశారు. టీవీ స్టూడియోలో పరివార్‌ భావజాలానికి పట్టం కట్టడమే గాక అందుకోసం ఇతరులపై దాడి చేశారు. మామూలుగా మీడియా ప్రతికక్షి పాత్ర ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కాని ఆర్నబ్‌ చాలా వరకూ ప్రస్తుత పాలక పక్షం దృష్టి కోణాన్నే ప్రదర్శిస్తూ వచ్చారు. రాహుల్‌గాంధీని, నరేంద్ర మోడీని ఆయన ఇంటర్వ్యూ చేసిన తీరులోనే ఈ తేడా తెలుస్తుంది.
మీడియా చర్చల్లో ఎవరినైనా ఎంత నిశితంగానైనా ప్రశ్నించవచ్చు. కాని దానికి సమతుల్యత,సంయమనం అవసరం. ఆర్నబ్‌ దాన్ని పూర్తిగా వదిలేసి తను పిలిచిన అతిథులపై విరుచుకుపడేవారు. కేకలేయడమే గాక పోరాడుతున్నట్టు మాట్లాడేవారు. తెలియని వారికి ఇదంతా గొప్ప సాహసంలా కనిపించవచ్చునేమో గాని నాటకీయత తప్ప ప్రయోజనం లేని పని. ఆఖరుకు జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వంటివారితో పోట్టాడినంత పనిచేశాడు. దేశభక్తి తన గుత్తాధిపత్యమైనట్టు అతిశయం చూపారు. అయినా పాలనా వ్యవస్థకు అనుకూలం గనక ఆమోదం లభించింది. ఇప్పుడు పైకి కనిపించవకపోయినా ఆ పాలక శక్తులే ఆర్నబ్‌తో ఒక మీడియా సామ్రాజ్యం ఏర్పాటుచేయించవచ్చు. ఆయనే అధినేత గనక ఎన్నికల నాటికి ఆ శక్తులకు పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ కూడా మరింత సేవచేయొచ్చు. ఆ తమాషా ఎలా వుంటుందో చూడాలి. అయితే ఆయన ఒక్కరితోనే ఛానల్‌ నడవదు గనక ఇంకా ఎవరిని తోడు చేసుకుంటారో చూడాలి.పైగా ఆయన షోలు తప్ప టైమ్స్‌ నౌ బ్రహ్మాండమైన అభివృద్ది సాధించిందేమీ లేదు. మరి ఇప్పుడు ఏర్పరచే నూతన వ్యవస్థలో ఏమాత్రం సమగ్రత సమర్థత వుంటుందో కూడా చూడాల్సిందే.ఈ విషయమై ట్విట్టర్‌లోనూ సోషల్‌ మీడియాలోనూ చాలా చర్చ నడుస్తున్నది గాని అదంతా పెద్ద ఉపయోగం లేనిదే. ఎందుకంటే రాజీనామా చేసి స్వంతంగా సంస్థలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూనే వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *