ఇదీ దేశభక్తి ఎన్కౌంటరేనా?
దేశంలో ఒకదాని తర్వాత ఒక అవాంఛనీయ ఘటనలే జరుగుతున్నాయి. గోరక్షణ పేర హత్యలు, విశ్వవిద్యాలయాలపై దాడుల తర్వాత యురీ ఘటన ఆ పైన సర్జికల్ స్ట్రయిక్స్ దేశభక్త ప్రచారం నడిచాయి. తర్వాత ఎవోబీలో మావోయిస్టుల ఎన్కౌంటర్ మరణాలు. వాటి సంగతి తేలకముందే ఇప్పుడు భోపాల్లో ఏకంగా ఎనిమిది మంది నిషిద్దసంస్థ సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ ఫెడరేషన ్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలను పోలీసులు ఎన్కౌంటర్ ముద్రతో కాల్చివేశారు. వారంతా జైలు నుంచి తప్పించుకున్నారని ఒక గార్డును చంపి పరారయ్యారని సోమవారం వార్తలు వచ్చాయి. తర్వాత వారొక కొండ ప్రాంతంలో వున్న్టట్టు సమాచారం అందడంతో వెళ్లగా ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగి అందరూ చనిపోయారని పోలీసు కథనం. దీనిపై సిపి
ఎం,కాంగ్రెస్,ఎంఐఎం,ఆప్ తదితర పార్టీలు అనేకఅనుమానాలు వ్యక్తం చేశాయి. సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారించాలని కోరాయి. వీరి సంగతి అటుంచి వార్త ఇచ్చిన హిందూస్థాన్ టైమ్స్ పత్రిక మాకు తెలిసింది, మాకు తెలియంది అంటూ ఒక శీర్షిక ప్రచురించింది. అందులో పోలీసులు చెబుతున్నదేమిటో తమకు అనుమానాస్పదంగా వున్నదేమిటో వివరంగా ఇచ్చింది. వారంతా పారిపోయి ఒకేచోట ఎందుకున్నారు? నిర్జనమైన ఆ ప్రదేశంలో వారున్నారని పోలీసులకు ఎవరు సమాచారమిచ్చారు? ఏకంగా ఒకే సారి అందరూ ఎలా కాల్చుల్లో చనిపోయారు? అంటూ పాయింట్ కౌంటర్ పాయింట్ ఇచ్చింది. న్యాయ విచారణ జరిపించాలని బృందాకరత్ కోరారు.ఈ ఎనిమిదిమందిపైన అనేక తీవ్ర నేరారోపణలు వున్నమాట నిజమే గాని వారు అత్యంత పటిష్టమైన భోపాల్ జైలునుంచి
తప్పించుకోవడం, తర్వాత మొత్తంగా హతం కావడం అనుమానాలను పెంచుతున్నది.అయితే వాటిని బయిటపెడితే వెంటనే దేశద్రోహ ముద్ర సిద్దంగా వుంటుంది మరి!