సులభ వ్యాపార తెలుగు రాష్ట్రాలు

naidukcr_2478588f

ఎపి,తెలంగాణలు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటి స్థానంలో వచ్చాయని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. పైగా కవల పిల్లల్లా ఈ విషయంలో రెండురాష్ట్రాలకూ ఒకే మార్కు, ఒకే ర్యాంకు 97.7 ఇచ్చింది.అంటే వ్యాపారానుకూలత విషయంలో ఉభయ రాష్ట్రాలకూ పెద్ద తేడా లేదన్నమాట. గతంలో చంద్రబాబు నాయుడు ప్రపంచబ్యాంకు ప్రియనేతగా వుండేవారు. ప్రపంచ స్వప్న మంత్రివర్గంలోనూ ఆయనకు చోటు కల్పించారు. ఆ రోజుల్లో ప్రతిపక్షాలూ వామపక్షాలూ దీన్నే మరో రూపంలో నినాదమిచ్చేవి. అంత స్వప్న పాలకుడూ ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి చవిచూశారు. మరి ప్రజల జీవితానుభవం ఆయనను గెలిపించకుండా చేసిందన్నమాట. ఇప్పటికీ ఆ బ్యాంకు కితాబులకే మురిసిపోవడం కన్నా హాస్యాస్పదం ఏముంటుంది?భారత దేశం ఈ విషయంలో వెనకపట్టు పట్టినా ఈ రాష్ట్రాలు ముందుండటం మరో ప్రత్యేకతగా చెబుతున్నారు. ఇందులో విశేషం ఏమంటే కెసిఆర్‌ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒకే ర్యాంకులో వుండటం. విభజన తర్వాతా విధానాల్లో పెద్ద మార్పు లేదని నాలాటి వాళ్లం చేస్తున్న విమర్శలకు ఇదో ఉదాహరణ. మిగిలిన చాలామంది రాజకీయ వేత్తలు చేయలేని పని ప్రపంచబ్యాంకు అవలీలగా చేసేసింది. గుజరాత్‌ను మించిపోయి మన తెలుగు రాష్ట్రాలు వ్యాపారానుకూలతకు పేరు తెచ్చుకున్నాయి గాని సులభ జీవితం సంగతేమిటి? దటీజ్‌ ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌? అసలు సరళీకరణ అంటేనే సులభతరంకావడం. కాని మన పాలకుల సరళీకరణ ప్రజల పాలిట గరళీకరణ అవుతుందనేది అనుభవం. కాబట్టి ఈ కితాబులకు విలువనిచ్చి నెత్తిన పెట్టుకోవడం అంటే కొరివితో తలగోక్కోవడమే. వీటిని ప్రకటించింది కూడా ఎవరంటే ఇక్కడి నుంచి రాజ్యసభకు వెళ్లిన నేపథ్యం గల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ . మిగతా రాష్ట్రాలు కూడా ఇలా వేగం పుంజుకోనందుకు ఆమె చాలా విచారిస్తున్నారు. అలాగే భారత దేశం ఎంత చేసినా ఇంకా ర్యాంకు 132 నుంచి 131కి మాత్రమే వచ్చింది. దీనిపై మన పాలకులు ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేశారు గాని మరింత లొంగదీసుకోవాలనే కోణంలో ప్రపంచబ్యాంకు వత్తిడి చేస్తున్నట్టుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *