సర్వేల సంబరంలో దాగని సత్యాలు

kcrpp111
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశంలోనే అత్యంత జనాదరణ కలిగి వున్నట్టు విడిఎఫ్‌ సర్వే తాజాగా ప్రకటించినందుకు టిఆర్‌ఎస్‌ భవనంలో సంబరాలు చేసుకోవడం సహజమే. దానికి ముందు టివి9 ప్రముఖంగా ప్రసారం చేసిన సెఫాలజీ సంస్థ సర్వే కూడా అదే చెప్పింది. ఇంకా ముందు ఆయనే స్వయంగా వరంగల్‌లో తము జరిపిన సర్వే గురించి చెప్పి ప్రతిపక్షాలకు 8 సీట్లు మాత్రమే వస్తాయన్నారని మీడియా కథనాలు వచ్చాయి. టిఆర్‌ఎస్‌ ఆధిక్యత విజయావకాశాలపై గాని కెసిఆర్‌ పాపులారిటీ పైన గాని సందేహాలు వుండకపోవచ్చు. దేశంలో ఆయనలా ఒక రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రం అధికారం కూడా సాధించుకున్న నేత ఇటీవలి దశాబ్దాలలో ఆయన ఒక్కరే కనిపిస్తారు. దీనికి దోహదం చేసిన శక్తులూ అంశాలు ఎన్ని వున్నా సూత్రధారిగా ఆయనే వుంటారు గనక ప్రజాదరణలోనూ ప్రథమ స్థానం వుంటుంది. పాలనా పరంగానూ చొరవతో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు భారీ పథకాలు ప్రకటించారు . ఆర్థిక పరిస్తితి కూడా చాలా వరకూ అనుకూలంగానే వుంది.
ఇదంతా నాణేనికి ఒక వైపు కాగా మరో కోణం కూడా కాదనలేనిది. అంత ఉద్యమ నాయకత్వం తర్వాత కూడా ఆయన పార్టీకి వచ్చింది అత్తెసరు మెజార్టి మాత్రమే. తక్కువ మెజార్టి కారణంగా ప్రభుత్వం అస్థిరంగా వుంటుందని ఆందోళన చెందిన కెసిఆర్‌ బాహాటంగానే విమర్శలు బేఖాతర్‌ చేసి ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఎన్నికల ఘన విజయాలూ సాధించారు. ఇన్నిటి తర్వాత ఆయన ఆత్మ విశ్వాసం పెరగాల్సింది పోయి అసహనానికి గురి కావడం ఆశ్చర్యకరం.పదేపదే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం, తమ వారితో వరుసగా మీడియాలో దాడులు చేయించడం తత్ఫలితమే. రాజకీయ అవినితిని అరికట్టామంటూనే నయీం కేసు వంటివాటిని సాగదీశారు.కార్పోరేషన్‌ అవినీతి లోతుల్లోకి పోకుండా దాటేశారు. లీకేజి వంటి సమస్యలను గాని ప్రైవేటు కాలేజీలు కార్పొరేట్‌ ఆస్పత్రులపై అధ్యయనం పలితాలను గాని అధికారికంగా ప్రజలతో పంచుకోలేదు. ఫలితంగా పారదర్శకత లోపించింది. రాజకీయ అవినీతి లేదంటూనే పాలనా పరమైన అవినీతిని ఆయన తరచూ ప్రస్తావిస్తున్నారు. వాస్తవం ఏమిటంట నూతన ే తెలంగాణలో రాజకీయ స్తిమితం సమతుల్యత రావడానికి గాక ఏకపక్ష ఏక వ్యక్తి కేంద్రిత రాజకీయం పెరుగుతున్నదని పాలక పక్షీయులే పదేపదే చెబుతున్నారు. అనేక పథకాలు మొదలే కాలేదని కెసిఆర్‌ స్వయంగా అంగీకరించిన సందర్బాలున్నాయి.వాటిని వదిలి భవనాల నిర్మాణం కోసం వందల కోట్ల వ్యయంతో హడావుడి చేయడాన్ని కూడా అత్యధికులు ఆమోదించడం లేదు.
ఇవన్నీ వున్నా ఇప్పుడు కెసిఆర్‌ ఎన్నికల మోడ్‌ లోకి తీసుకెళుతున్నారు. డిసెంబర్‌ 2న తలపెట్టిన సభతో ఆ క్రమం మొదలు కావచ్చు. ఆధిక్యతా స్తానం నుంచి ఆయన ఈ ప్రక్రియ ప్రారంభిస్తుండొచ్చు గాని అలక్ష్యం చేయడానికి వీల్లేని సమస్యలు సవాళ్లు వున్నాయి.సర్వేల పరంగా చూసినా ఇంత అనుకూలత వుందన్న టిఆర్‌ఎస్‌కు 51శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయంటే 49 శాతం మంది ఇంకా అసంతృప్తిగా వ్యతిరేకంగా వున్నారన్నమాటే కదా. 2016లోనూ ఇదే సంస్థ నిర్వహించిన సర్వేనాటికంటే కెసిఆర్‌ పాపులారిటీ శాతం ఒక్కశాతమే పెరిగింది. ఇలాటి సర్వేల పద్దతులూ పరిమితులూ గమనంలోకి తీసుకోవాలి. ఎన్నికలు చాలా కాలం వున్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అప్పటి వరకూ సక్రమంగా పరిపాలన నడవాలి. సమస్యలు పరిష్కరించాలి. అంతేతప్ప సంబరాలతో సరిపెట్టుకుంటే సరిపోదు. పాలనా నాణ్యత పెరగాలంటే పథకాలు అమలు కావడం, పలితాలు ప్రజలకు చేరడం కీలకం. ప్రతిపక్షాలపై లేదా విమర్శకులపై ఎదురుదాడి చేయడం గాక పొరబాట్లను గుర్తించి దిద్దుకోవడం ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *