రాజధాని ‘ఈవెంట్ 7’ పొగడ్తల వర్షం- విషయం శూన్యం
అమరావతిలో మరో శంకుస్థాపన పర్వం ముగింపులో వర్షం పడటం శుభసూచనగా నిర్వాహకులు వర్ణించారు. నిజానికి అప్పటికే సభికులు పొగడ్తల వానలో తడిసిముద్దయ్యారు. వెంకయ్య నాయుడు అరుణ్‌జైట్లీ చంద్రబాబు నాయుడు వరుసగా మాట్లాడి పొగడ్తలు తారాస్తాయికి చేరాయి.అందులోనూ ముగ్గురూ తక్కిన ఇద్దరినీ పొగడవలసి రావడం వల్ల సమయం కూడా పట్టింది. కొద్ది రోజుల కిందట నేను ఉటంకించిన ముళ్లపూడి స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా ప్రయోగం వేదికపై ప్రత్యక్షమైంది. పైగా అంతకు ముందు బిజెపి విడిగా జరిపిన సమావేశంలో అరుణ్‌జైట్లీ వెంకయ్య పరస్పరం పొగుడుకుని వచ్చారు. ఇక్కడకు వచ్చి చంద్రబాబునూ జోడించారు.
మోడీ బాబు జోడీ గురించి పాడీ పాడీ అలసిపోయారు వెంకయ్య నాయుడు. ఇకపోతే ప్రత్యేకహౌదాపై తన వాగ్దానభంగాన్ని మరోసారి సర్వశక్తులా సమర్థించుకోవడానికి తంటాలు పడ్డారు. ప్రత్యేక హౌదాను మించిన ప్యాకేజీ అనీ చెప్పనివి కూడా చాలా చేశామని గొప్పల జాబితా ఒకటి తనదగ్గర వుందని ప్రకటించారు. ఇకపోతే ప్రత్యేకహౌదా రానందుకు ఆవేదనో ఆగ్రహమో వెలిబుచ్చేవారిని అపహాస్యం చేశారు. కొంతమంది ఎప్పుడూ ఏడుస్తూనే వుంటారని మరికొంతమంది అనుమానాల్లోనే బతుకుతారని మరికొంతమంది ఇతరుల డబ్బుతో బతకాలనుకుంటారని ఎప్పుడో చిన్నయసూరి రాసిన పంచతంత్రం చదివి వినిపించి తన రాజకీయ తంత్రం ఉత్తుత్తి ప్యాకేజీ కుతంత్రం కప్పిపుచ్చుకున్నారు. నా వల్లనే ఆ రోజు అంతా జరిగిందని ఆత్మస్తుతి చేసుకున్నారు. అంటే హౌదా కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆరాటం ఏడుపుగొట్టు వ్యవహారంగా అసూయాపరుల ఆక్రోశంలాగా కనిపించిందా ఆయనకు?
ఇక అరుణ్‌జైట్లీ రైతులకు నమస్కార బాణం వేసి చంద్రబాబునూ పొగిడిన తర్వాత సుజనా చౌదరిని సిఎంరమేష్‌ను వెనకేసుకురావడం పనిగా పెట్టుకున్నారు. నిజానికి సరిగ్గా ఈ నలుగురే చంద్రబాబు దన్నుతో ప్రత్యేకహౌదా నిరాకరణకు ప్యాకేజీ ముసుగు రచించారని దేశమంతటికీ తెలుసు. సభలో ప్రసంగాలూ దానికి తగినట్టే నడిచాయి. అరుణ్‌జైట్లీ కూడా అయిదేళ్లలో గతంకన్నా మూడు రెట్లు ఎక్కువగా రెండులక్షల మూడు వేల కోట్లు ఎపికి ఇస్తున్నామంటూ మామూలు కేటాయింపులనే ఉదారసహాయంలాగా చాటుకున్నారు. ఇవి మామూలుగా ఇచ్చే కేటాయింపులు తప్ప కొత్తవి కావని, నిజానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన శాతం కన్నా ఇప్పుడు ఎపి తెలంగాణలకు కలిపి కూడా ఒకింత తక్కువగాన ఇస్తున్నారని తెలకపల్లిరవి.కామ్‌లో గతంలోనే చెప్పుకున్నాం. అయినా మోడీ అదే పల్లవి ఆలపించడం, చంద్రబాబు నాయుడు ఆహ్వానించి ఆనందించడం హాస్యాస్పదం.ఇందుకు ప్రతిగాఆయన కూడా చంద్రబాబు హైదరాబాదు అభివృద్ధి చేసినట్టే అమరావతిని కూడా గ్రేటర్ అమరావతిగా మార్చేస్తారని ప్రశంసించారు.
ఇక చంద్రబాబు అరుణ్‌జైట్లీ కారుణ్యా
నికి పరవశించిపోయినట్టు ఆకాశానికెత్తేశారు.( నిజానికి ఇం
త పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి, అనుభవజ్ఞుడు పదే పదే సర్ సర్ అంటూ పై అధికారులను ఉద్దేశించిమాట్లాడినట్టు మాట్లాడాల్సిన పనేలేదు.) కాంగ్రెస్ తప్పులను ఏకరువు పెట్టారు బాగానే వుంది గాని ఇది అధికార కార్యక్రమం తప్ప టిడిపి బిజెపి ఎన్నికల సభ కాదే?గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని తుచతప్పకుండా అమలు చేస్తామని జైట్లీ చెప్పారంటే అది బాగానే వుందని కదా! లేకుంటే మార్చేవారే కదా?పైగా ఇప్పుడు హౌదాకు ఎగనామం పెట్టిన బిజెపిని కీర్తిస్తూ దిగిపోయిన పార్టీని తిట్టి ప్రయోజనమేమిటి? ఏది ఏమైనా ఈ సభతో చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ప్రహసనాన్ని ప్రశంసించి ప్రత్యేక హౌదా కోర్కెను భూస్థాపితం చేశారు. ఇచ్చేదెంతో వచ్చేదేమిటో స్పష్టం కాకుండానే ఇది హౌదా కన్నా ఎక్కువ దబ్బులు తెస్తుందని ప్రకటించారు. అయితే దానికింద వచ్చేది ఎంతో ఇప్పుడు ఎంత ఎక్కువ వస్తుందో ఇంతవరకూ కేంద్రం గాని రాష్ట్రంగాని ప్రకటించలేదే? ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెబుతున్నారు? ప్రజలతో మింగించడానికా?
మళ్లీ మళ్లీ ఈ శంకుస్థాపన తతంగమేమిటని తీవ్ర విమర్శలు వచ్చాయి. నేను కూడా రాశాను చానళ్లలో చెప్పాను. ఈ సభలో ఆ సందేహాలకు కాస్తయినా సమాధానం లభించలేదు. ప్రధాని గతంలో రాజధానికి శంకుస్థాపన చేయడమంటే అందులో పాలనా భవనాలు లేకుండా రాజధాని ఎలా అవుతుంది? ఆయన అప్పుడు మట్టి నీళ్లయినా తెచ్చారు. ఇప్పుడీయన అదీ లేకుండా పాత మాటలతోనే సరిపెట్టారు. ఇంతా చేసి ఈ దశల వారి శంకుస్తాపనలు ప్రారంభోత్సవాల వివరాలేమిటో చెప్పింది లేదు. అంటే ఇది కేవలం అరుణ్‌జైట్లీ కోసం జరిపిన ఈవెంట్ అన్నమాట
చివరగా ఓ సందేహం ఏమంటే- ఈ పరిపాలనా భవనాల ప్లాను సిద్ధంగా లేదు. కట్టేవారెవరో తెలియదు.మాకు సింగపూర్ గుర్రాలు కావాలి కాని మన దేశపు గాడిదలు వద్దని హైకోర్టులో వాదించారు. మరి ఇప్పుడు గుర్రాలా గాడిదలా వేటిని ఎంచుకుంటున్నారు? మనవాళ్లు మురికివాడలు కడతారని లోగడ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు విదేశీయులతోనే కట్టిస్తారా?
వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ, చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి, సిఎంరమేష్ pancha kutantram.