లోకేశ్‌ను రప్పించండి.. బాధలు చెప్పుకుంటాం..

 

లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడంలో జాప్యం ఎందుకుని తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తొందర చేస్తున్నారట. ఇలాటి విషయాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుని త్వరగా అమలు చేస్తే మంచిది.లేనిపోని సాగదీత ఎడతెగని తర్జనభర్జన వల్ల లేనిపోని సమస్యలు వుత్పన్నం కావచ్చని వారు భావిస్తున్నారు. లైవ్‌ మింట్‌ పత్రిక దీనిపై ఒక సమగ్ర కథనం ప్రచురించింది. మంత్రివర్గంలో చేరుతున్నారా అని ఆ పత్రిక ఢిల్లీలో ఎపి ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహనరావును అడిగినప్పుడు ‘ సందేహం ఏముంది?’ అని ఎదురు ప్రశ్న వేశారు. అయితే ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది మాత్రం ముఖ్యమంత్రి అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయిస్తారట. ఈ మధ్య తమ కుటుంబ ఆస్తివివరాలు విడుదల చేసిన సమయంలో లోకేశ్‌ కూడా తను పార్టీ చెబితే ఏ బాధ్యత తీసుకోవడానికైనా సిద్ధమేనని సూచనగా చెప్పారు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి కోశాధికారిగా వున్న లోకేష్‌ను ఇప్పటికిప్పుడే వైసీపీ అధినేత జగన్‌తో గాని, తెలంగాణ మంత్రి కెటిఆర్‌తో గాని పోల్చే పరిస్థితి వుండదని కూడా మింట్‌ రాసింది యథార్థమే. అయితే ఆయన కూడా 2009 ఎన్నికల నాటికే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని చెప్పాలి. అప్పటో నగదు బదిలీ పథకం ఆయన పేరిటే ప్రచారమైంది గాని ప్రచారంలో పాల్గొనలేదు. తర్వాత కొన్నాళ్లకు ్ల గాంధీ విగ్రహం దగ్గర ప్రతిజ్ఞ తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు మమ్మల్ను ఆహ్వానించారు. నేనైతే వెళ్లలేదు గాని కొందరు సీనియర్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు. అదే ఒక విధంగా లోకేశ్‌ రాజకీయ దర్శనం. తర్వాత తండ్రి నిరాహారదీక్ష ఏర్పాట్లను కూడాtdp-cadre-nara-lokesh చూశారు. నిమ్స్‌లో పరామర్శకోసం వెళ్లినప్పుడు తల్లితో కలసి సపర్యలు చేస్తున్నారు. 2010 ప్రాంతాల నుంచి లోకేశ్‌ ట్విట్లర్‌లో కెటిఆర్‌ హరీష్‌లపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. అవి పత్రికల్లో వచ్చేవి కూడా. అయితే అప్పటికే జగన్‌ పార్టీ పెట్టడం, కెటిఆర్‌ ఎంఎల్‌ఎ కావడం జరిగింది గనక లోకేష్‌ది పరోక్ష పాత్రనే చెప్పాలి. జిహెచ్‌ఎంసి ఎన్నికలే ఆయన తొలి ప్రయోగం, విఫలమైనా ఫోకస్‌లోకి తెచ్చింది. వారసత్వం అన్ని చోట్లా వున్నదే గనక అనివార్యం గనక ఆయనను మంత్రిని చేస్తే ప్రత్యేకంగా అనుకోవలసింది వుండదు. గతంలో ఎన్టీఆర్‌కు ఇద్దరు అల్లుళ్లు వున్నట్టు ఇప్పుడు చంద్రబాబుకు ఎవరూ తోడు లేకపోవడం కొరతగా వుందని ఆ పార్టీ నాయకుల్లో ఒక భావం బలంగా వుంది. లోకేష్‌కు రాజ్యాంగ పాత్ర కల్పిస్తే విమర్శలకు కూడా చెక్‌పెట్టొచ్చని వారంటారు. చంద్రబాబుకు సమయం లేకపోవడం, తమకు రెండు నిముషాలు కూడా ఇవ్వలేకపోవడం ఇబ్బంది గనక కనీసం లోకేశ్‌ దగ్గర మొరపెట్టుకుంటే తర్వాత జరిగేది జరుగుతుంది. ప్రభుత్వంలో ఎవరో ఒక నెంబర్‌ టూ వుండాలి అని కోరుతున్నారట. ఒకసారి లోకేశ్‌కు చోటు కల్పిస్తే ఇక ఎన్టీఆర్‌ కుటుంబంలోనూ బాలకృష్ణ, హరికృష్ణల ఆశలకూ జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించిన వూహలకూ స్వస్తి చెప్పినట్టువుతుందని ఈ విధేయుల వాదనగా వుంది. పరిణామాలూ ఆ దిశలోనే నడుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *