చంద్రబాబుపై ‘ఆత్మాహుతి’ దాడి హెచ్చరిక!

babu-new-latest-756-29-1464512470
ఎవోబిలో మావోయిస్టులపై ఎన్‌కౌంటర్‌ హత్యాకాండ తర్వాత వారినుంచి ప్రతీకార ప్రకటన వస్తుందనేది వూహించిన విషయమే గాని దాని తీరు కొంత కొత్తగా భిన్నంగా వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన, లోకేశ్‌పైన అవసరమైతే ఆత్మాహుతి దాడి చేస్తామని మావోయిస్టు పార్టీ ఎపి కమిటీ ప్రతినిధి శ్యాం ఒక లేఖలో హెచ్చరిక చేశారు. ఈ లేఖను మీడియాకు పంపించారు. గతంలో అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి నుంచి ఎలాగో బయిటపడినా ఈ సారి ఎవరూ కాపాడలేరని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఈ తరహా దాడులు చేయడం గాని చేస్తామని చెప్పడం గాని జరగలేదు గనక ఇదో కొత్త పరిణామం. మామూలుగా టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు. మావోయిస్టులను వామపక్ష తీవ్రవాదులుగా తప్ప టెర్రరిస్టులుగా వర్ణించడం జరగదు. మరి ఇలాటి నేపథ్యంలో ఆత్మాహుతి దాడి లేఖ తీవ్రత కోసం ఎంచుకున్నారా లేక పరిస్తితుల రీత్యా గత్యంతరం లేక అదే సాధ్యమనుకుని చెబుతున్నారా తెలియదు. ఇదే లేఖలో మావోయిస్టు ప్రతినిది ద్రోహులుగా మారిన ó మాజీలను కూడా ఇకపైన జాబితాలు తయారు చేసి తుదముట్టిస్తామని పేర్కొన్నారు. ఏమైనా వ్యక్తులపై హత్యా దాడులు అది కూడా టెర్రరిస్టు తరహాలో చేయాలనుకోవడం అవాంఛనీయం.
తమకు తగిలిన దెబ్బల్లో ఇది కొంచెం తీవ్రమైనదని ఆ లేఖలో వ్యాఖ్యానిస్తూనే మళ్లీ కోలుకుంటామనే విశ్వాసం వెలిబుచ్చారు.
ఇంతమందిని ఎలా చంపగలిగారనేదానిపై వివరణనిస్తూ ద్రోహుల ద్వారా విషం కలిపిన ఆహారం పంపించి వారు పడిపోయిన సమయంలో కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. ఈ రోజు కూడా మరో నలుగురు చనిపోయి మృతుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పోలీసులు ప్రభుత్వం తమ వైఖరిని పునరాలోచించుకోవాలి. కేవలం ఎన్‌కౌంటర్లతోనో నిషేదాజ్ఞలతోనో సమస్యను పరిష్కరిస్తామనే పొరబాటు ఆలోచనల నుంచి బయిటపడాలి. మావోయిస్టుల దాడి తర్వాతా చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు. అలాగే ఆయన ప్రభుత్వం ఎన్ని ఎన్‌కౌంటర్లు చేసినా వారూ ఏదో రూపంలో దాడులు చేస్తూనే వున్నారు. కనక సమస్యల పరిష్కారంతో సహా సాంఘిక చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అయితే ప్రజా ఉద్యమ స్రవంతిలో చేరి వాటిని మరింత బలోపేతం చేయడం మావోయిస్టులతో సహా అందరి కర్తవ్యం. అలాగాక ఆత్మాహుతి దాడుల వంటివి మొదలు పెడితే వారిపట్ల సానుభూతిగా వున్న ప్రజాభిప్రాయం కూడా మారే అవకాశం వుంటుంది. ప్రజల కోసం జరిగే పోరాటాలేవైనా ప్రజల నాయకత్వంలోనే జరగాలి గాని కొంతమంది వీరులు తుపాకి ధారులే అన్నీ చేయలేరన్నది చరిత్ర చెబుతున్నది.ఇప్పటి అనుభవమూ చెబుతున్నది.ప్రభుత్వ వైఖరిని మాలాటి వాళ్లం గట్టిగా ఖండిస్తూనే మావోయిస్టులు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *