ఏవోబీ పరిణామాలు: ఎన్‌కౌంటర్‌పై విచారణ- పరిస్థితిపై సమీక్ష
సోమవారం నాడు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు(ఎవోబి)లో ఏకంగా 27 మంది మావోయిస్టుల మృతికి కారణమైన బూటకపు ఎన్‌కౌంటర్ పోలీసులు గ్రౌహౌండ్స్ దళాల పథకం మాత్రమేనని అందరికీ తెలుసు. మావోయిస్టు పార్టీ నిషేదంలో వుంది గనక రహస్యంగానే సమావేశాలు జరుపుకోవడం అనివార్యం. ఆ సమాచారం సేకరించి దాడి చేసేందుకు వెళ్లింది గ్రేహౌండ్స్. అలా వెళ్లినప్పుడు వారు ఏ స్థితిలో వున్నారనేది పోలీసులు చెప్పడం లేదు. సమయాన్ని బట్టి చూస్తే వారు నిద్రలో వుండే అవకాశం ఎక్కువ. ఒక వైపు నుంచి పోలీసులు పథకం ప్రకారం వెళ్లడం, అవతలివారు ఆదమరిచివుండటం గమనిస్తే ఇది దాడి తప్ప ఎన్‌కౌంటర్ అయ్యే అవకాశం లేదు. అలా అయ్యేట్టయితే వెళ్లిన అధునాతన దళాల ప్రజ్ఞ ఏమీ వుండదు. ఒడిసాలోని మల్కాన్‌గిరి జిల్లా జంత్రి పోలీసు స్టేషన్ పరిధిలో రామగఢ్-పనసపుట్ట మధ్య జరిగిన ఈ దాడిలో మృతుల సంఖ్య దేశంలో జరిగిన ఎన్‌కౌంటర్ల చరిత్రలోనే చాలా ఎక్కువ. సైద్ధాంతిక సంక్షోభం, అంతర్గత వివాదాలు, బలహీనమవుతున్న చేరికలు వీటిమధ్య పెనుగులాడుతున్న మావోయిస్టు శ్రేణుల నుంచి కొందరిని లొంగదీసుకుని ఆ సమాచారం ప్రకారం పకడ్బందీగానే దాడి నిర్వహించారు.చనిపోయిన వారిలో పలువురు ప్రముఖులు వున్నారంటూ పేర్లు వస్తున్నాయి. మిగిలిన వారితో పాటు రామకృష్ణ కుమారుడు మున్నా కూడా వున్నాడంటే ప్రాణాలకు తెగించిన పోరాటంలో పాలుపంచుకున్నాడన్నమాట. ఇది చెప్పుకోదగిన విషయమే. ఆర్కే తో సహా కొంతమంది తప్పించుకున్నా మరుసటి రోజు కూడా ఎన్‌కౌంటర్ జరిగినట్టు వచ్చిన సమాచారంపై భిన్న కథనాలు వున్నాయి. ఇప్పట్లో అక్కడ ప్రశాంతత వచ్చేట్టు లేదు.
ఎప్పుడైనా దొరికిన వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చాలి తప్ప సామూహికంగా కాల్చిచంపడం ప్రజాస్వామ్యం కాదు. దీన్ని సమర్థించుకోవానికి ఎన్‌కౌంట్‌ర్ కథలు అల్లినా అతకవు. గతంలోనూ మావోయిస్టులను చర్చలకు పిలిచి తర్వాత వారిలోనే ఒకరిని కాల్పిచంపడం చూశాం. పశ్చిమ బెంగాల్‌లో ఆనాటి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిషన్‌జీని మావోయిస్టులతో సహా ఉపయోగించుకున్న మమతాబెనర్జీ తర్వాత ఆయననే కాల్చి చంపించింది. తెలంగాణలో మావోయిస్టు ఎజెండా నాదన్న కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రుతి వినోద్ ల ఎన్‌కౌంటర్ జరిగింది. ఇవన్నీపాలకుల నిజస్వరూపాన్ని చెప్పే ఉదాహరణలే. అదే సమయంలో మావోయిస్టులు కూడా వీటినుంచి తీసుకోవలసిన గుణపాఠాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇంతమంది హతం అయ్యారంటే ఉద్యమం బలహీనపడలేదని కొందరు వింత భాష్యాలు చెబుతున్నారు. నిజానికి రిక్రూట్‌మెంట్లు, సంబంధాలు, విస్తరణ, సైద్ధాంతిక స్పష్టత తగ్గిన స్తితిలో మావోయిస్టు అగ్రనేతలే కొందరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.పలువురు లొంగిపోతున్నారు.టీవీలలోమాతోచర్చలకు వచ్చే వివిధ పాలక పార్టీల ప్రతినిధుల్లో మాజీ నగ్జలైట్టు పాతికశాతమైనా వుంటారు!సాంకేతిక పరిజ్ఞానం కూడా పోలీసులకు ఉపయోగపడుతున్నది.ఇలాటి సమయంలో మావోయిస్టులు కూడా తమ వర్తమానం భవిష్యత్తులను వాస్తవికంగా సమీక్షించుకోవాలి.ప్రజాస్వామ్య స్రవంతిలోకి రావాలని తరచూ అంటుంటారు గాని నిజానికి వారు ప్రజాఉద్యమాల స్రవంతిలోకి రావాలి. పోలీసుల కొరియర్లపేరిట, మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల పేరిట హతం చేస్తున్నది పేద దళిత గిరిజనులనే. వారిని ఎదుర్కొవడానికి ప్రభుత్వాలు పోలీసులు కూడా మళ్లీ ఆ గిరిజనులనే ఉపయోగిస్తారు. ఇది ప్రజలకు గోడదెబ్బ చెంపదెబ్బగా మారుతుంది. సాల్వాజుడుం వంటి చట్ల విరుద్ధ సంస్థలను కూడా పోలీసులు ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే వున్నాయి..ఒకసారి వారు ఒకసారి వీరు ఆధిక్యత సాధిస్తున్నారేమో గాని ఈ రావణ కాష్టం మాత్రం రగులుతూనే వుంది. తాజాగా చెప్పాలంటే బలిమెల హత్యాకాండకు ఇది ప్రతీకారం అని పోలీసులు చెబుతుంటే దీనికి ప్రతీకారం తప్పదని మావోయిస్టు జగన్ హెచ్చరిస్తున్నారు.ఇవన్నీ మావోయిస్టులకు పోలీసులకు మధ్య నిరంతర ఘర్షణగా కొనసాగుతున్నాయి.
ఒక విషయం స్పష్టం. వెనుకబాటు తనం సామాజిక ఉద్రిక్తతలు నిర్బంధం గర్భదరిద్రం నిర్మూలించకుండా మావోయిస్టులను లేదా మరేదైనా ఉద్రిక్తత కారణాన్ని తొలగించగలమనుకుంటే పొరబాటు. మావోయిస్టులను హింస వదలి ప్రజాస్వామ్యంలోకి రమ్మనే ప్రభుత్వాలు వారిపై ఎన్‌కౌంటర్ హత్యలు సాగించడం సరికాదు.
ఇక విస్త్రత ప్రజారాశుల పాత్ర లేకుండా కొద్దిమంది తుపాకులతో మాటు వేసి దాడులు చేసినంత మాత్రాన సమాజం మారదనే వాస్తవాన్ని తెలుసుకోకుండా మందుపాతరలు నచ్చని వారి కిడ్నాపులు హత్యలతో మావోయిస్టులు కూడా సాధించే పెద్ద మార్పేమీ వుండదు. చంద్రబాబుపై హత్యాప్రయత్నం విఫలమైంది కాని తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చారు.ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వున్నారు. మరి నాటి దాడితో ఏం సాధించినట్టు? ఇందిరాగాంధీని రాజీవ్‌గాంధీని ఎవరో టెర్రరిస్టులు హత్య చేసినా తర్వాత కూడా కాంగ్రెస్ కూడా బతికేవుంది కదా? నర్సిరెడ్డి ప్రాణాలు తీశారు గాని ఆయన కుమార్తె అరుణ తర్వాత మంత్రిఅయ్యారు కదా? కనక వ్యక్తుల హత్యతో లేక సామూహిక దాడులతో మాత్రమే వ్యవస్థ మారదు. వారిని అణచివేసే పేరిట ప్రజలపై నిర్బంధం పెంచడానికి మాత్రం కారణమవుతుంటారు.చట్టం పరిధిలో పోలీసులు సిద్ధాంతం పరిధిలో మావోయిస్టులు పునరాలోచన చేసుకోవాలి
ఇప్పుడు ఎవోబి ఎన్‌కౌంటర్‌పై సమగ్ర న్యాయ విచారణ జరిప సందేహాలకు అతీతంగా ి నిజానిజాలు పూర్తిగా వెల్లడించాలి. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారిని కుటుంబాలకు స్వాధీనం చేసి ప్రజాస్వామికంగా చట్టబద్దంగా వ్యవహరించాలి. ఇకముందైనా ఎన్‌కౌంటర్లనే ప్రధానవ్యూహంగా చేసుకునే ధోరణి మారాలి.