యాదవ ‘ముసలం’ ముగింపేనా?
కుటుంబ రాజకీయాల్లో అధికారాలు అంతర్గత కలహాల గురించి మొన్న రాస్తూ ఇది సమాజ్‌వాది పార్టీలో చీలిక వరకూ వెళ్లకపోవచ్చని వ్యాఖ్యానించాను. కొంతమంది దీన్ని అతిగా అంచనా వేసిన వారున్నారు. లేదంటే చీలిపోతే బావుండునని ఆశించిన వారూ వున్నారు. ఈ మీడియా యుగంలో అది సహజమే. కాని రాజకీయాలు ఎంత నాటకీయంగా కనిపించినా కొన్ని మౌలిక సూత్రాలు వెనక వుంటాయి. అందులో కీలకమైంది అధికారం కాపాడుకోవాలనే తాపత్రయం ఆ కుటుంబాల్లోనూ రాజకీయ పార్టీల్లోనూ ప్రధానంగా పనిచేస్తుంటుంది. ఎస్పి సర్వాధినేత ములాయం సింగ్ యాదవ్ నిన్న కుమారుడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌నూ, తమ్ముడు రాష్ట్ర పార్టీ అద్యక్షుడు శివలాల్ యాదవ్‌ను ఒక చోట కూచోబెట్టి చివాట్లు పెట్టినప్పుడే రాజీకి రంగం సిద్ధమైంది. కాకపోతే ఒక్కసారిగా తగ్గినట్టు వుండకూడదు కాబట్టి మరో రోజు తగాదా వార్తలే వచ్చాయి. నాన్నేగురువు అంటూ రాజీనామాకైనా సిద్దమని అఖిలేష్ అనడం, తనకు అధికారం అప్పుడప్పుడూ తలకెక్కుతుందంటూనే నా మాట మీరడని ములాయం కితాబునివ్వడం వ్యూహాత్మక అడుగులే. అదే సమయంలో శివలాల్నూ అమర్సింగ్నూ ఏమీ అనొద్దని వారు తన ఆత్మీయులేగాక ఆత్మలన్నట్టు ఆయన చెప్పడం కూడా సమతుల్యత కోసం తంటాలుడపడటమే. అన్న మెల్లగా కొడుకు వైపు తిరిగిపోతున్నాడని గ్రహించిన శివలాల్ మాత్రం అఖిలేష్ పార్టీని చీలుస్తానని తనతో అన్నాడని ప్
రమాణం చేసి చెబుతానన్నారు. ఏమైతేనేం- కొడుకును తప్పించడం శిక్షించడం ఆత్మహత్యాసదృశ్యమని ములాయంకు బాగాతెలుసు. కాబట్టే అటూ ఇటూ మాట్టాడి చివరకు సర్దుబాటు చేసినట్టే కనిపిస్తుంది. రేపు వీరంతా చెట్టపట్టాలు వేసుకుని కనిపించినా ఆశ్చర్యం లేదు. . తండ్రీకొడుకులకు వుండే పట్టు ప్రాబల్యం ఇతరులకు ఎన్నటికీ రావు.కాకుంటే వారి మధ్య గండిని పెంచాలని చూసిన వారు ఇప్పుడు ఇబ్బందిలో పడొచ్చు. ఇదంతా ప్రచారం కోసమేనని అఖిలేష్ ఇమేజి పెంచడానికేనని అనేవారూ వున్నారు. అయితే నిజం చెప్పాలంటే అసలే ఓటమికి దగ్గరవుతున్న ఎస్పిని ఇది మరింత నష్టపరిచింది బిజెపికి మరింత మేలు చేసింది. ఎస్పి నిలబడొచ్చు గాని అధికారం నిలబడటం దాదాపు అసాధ్యమే.బిఎస్పి బిజెపి కలసి కూడా అధికారం చేపట్టవచ్చు. ఎందుకంటే యుపి రేపు మోడీ మరోసారి చేసే ఎన్నికల పోరాటానికి చాలా కీలకం.
