చంద్ర భజనలకు విరామం?
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడు విచిత్రమైన పరిస్తితి ఏర్పడింది. ముఖ్యమంత్రులపై ఏ మాత్రం విమర్శ చేసినా దానికి ముద్రలు అంటగట్టే ధోరణి పెరిగిపోయింది. తెలంగాణ సాధించుకున్నాము గనక కెసిఆర్ సర్కారును అప్పుడే ఏమీ అనకూడదని, ఎపి కష్టాల్లో వుంది గనక చంద్రబాబు ప్రభుత్వాన్ని బలపర్చడమే కర్తవ్యమని వాదించే ప్రబుద్ధులు పెరిగిపోతున్నారు. నిర్మాణాత్మకంగా ప్రజల కోణంలో మాట్లాడినా అదేదో మహాపాపమైనట్టు ఈ రాజును మించిన రాజభక్తులు విరుచుకుపడతారు. ఇందులోనూ తమాషా ఏమంటే మరో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని లేదా పాలక పక్షాన్ని అంటే సంతోషమే! ఎటొచ్చి తమ నేతలనే విమర్శించకూడదు. అప్పుడెప్పుడే ఎమర్జన్సీలో ‘ ఏమి చేయాలేమి చేయాలి.. ఇందిరమ్మకు భజన చేయాలి’ అంటూ అద్దేపల్లి రామమోహనరావు రాసిన పాట ఇలాటి వారికి బాగా సరిపోతుంది. విచిత్రమేమంటే పాలక పక్ష నేతలు ఎంఎల్‌ఎలు మంత్రుల కన్నా వారి ద్వారా ప్రయోజనాలు సాదించుకోవాలని చూసే బుద్ధిజీవులు పదవీ లాలసులు ఈ తరహాలో
ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రజా జీవితంలో వారు కొంతకాకుంటే కొంత విమర్శకు మానసికంగా సిద్దమై వుంటారు.కాని ఈ బాపతు వందిమాగధులే పల్లెత్తుమాట అనడం పాపమన్నట్టు చెలరేగిపోతున్నారు. చెప్పాలంటే విభజనానంతర రాష్ట్రాల అభివృద్ధికి పునాది పడేది ఇప్పుడే గనక ఈ దశలోనే విమర్శనాత్మక నిర్మాణాత్మక దృష్టికోణం చాలా అవసరం. వ్యక్తిగత నిందారోపణలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తప్పు గాని విధానపరమైన ప్రజా సంబంధమైన అంశాలు లేవనెత్తేవారిపై దాడి చేయడం తగనిపని. తమాషా ఏమంటే విప్లవ కారులుగానో విశుద్ధ వర్తనులుగానో ముద్రవేయించుకున్నవారే ఈ తరహా భజనానందంలో మునిగి తేలడం. ఇప్పుడు వారి పేర్లు ఇక్కడ పేర్కొనడం లేదు. కాని ఎవరెంత ఇబ్బంది పడినా ప్రజల జీవిత సమస్యలు ప్రతిధ్వనించడం వాటికి కారణమైన విధానాలను విమర్శించడం అనివార్యమే.
ఇప్పటి వరకూ మీడియాలోవిమర్శలపై కూడా పాలకులు అసహనానికి గురి కావడం, ఆంక్షలకు ఆటంకాలకు పాల్పడ్డం చూశాం. ఉభయ రాష్ట్రాల్లోనూ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతా చూశాం. తత్ఫలితంగా విమర్శలు దాదాపు మటుమాయమైనాయి. ఇప్పుడిప్పుడే ఈ వాతావరణం కొంత మారుతున్నది. నేరుగా సంపాదకులతో మాట్లాడ్డం, సంస్థల యజమానులతో సంప్రదించడం సత్పలితాలిస్తున్నది.పైగా ఎన్నికల పవనాలు మొదలవుతాయి గనక ముఖ్యమంత్రులు కూడా కొంత జాగ్రత్త తీసుకుంటారు. కోరి నెత్తినెత్తుకున్న మీడియా సంస్థలు సరే గాని మిగిలిన వాటిలో విమర్శలు రాబోతున్నాయి. కాబట్టి ఉభయ చంద్రుల భజన బృందాలు కూడా అత్యుత్సాహాలు తగ్గించుకుంటే మంచిది.
