సర్వే బహుతచ్ఛా.. సిఎం సార్ గుస్సా.. క్యూ?
టీవీ9 ద్వారా ప్రసారమైన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ వారి సర్వే జన రంజక పాలనకు జేజేలు పలికిందని నమస్తే తెలంగాణ పతాకశీర్షిక నిచ్చింది. ఆ వివరాలు కూడా విపులంగా ప్రచురించింది. ప్రతిపక్షాలు కూకటివేళ్లతో కూలిపోతున్నాయని, వామపక్షాలు టీడీపి వైసీపీ సోదిలో లేవని సంతోషం వ్యక్తం చేసింది. 109 పాలకపక్షానికి వస్తే దాని మిత్రపక్షం ఎంఐఎం7, కాంగ్రెస్ 2,బిజెపి 1 తెచ్చుకుంటాయని ఈ సర్వేసారాంశం. కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చెప్పినట్టు చెబుతున్న సర్వేలోనూ ప్రతిపక్షాలకు 8 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని కథనాలున్నాయి. కాబట్టి రెండింటి సారాంశం ఒకటే. ఏ పాలకపక్షానికైనా ఇంతకన్నా సంతోషం ఏముంటుంది?కాని ఎవరి మాటో అటుంచి స్వయానా ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో మంత్రులపై నారాజ్ అయ్యారని ఆంధ్రజ్యోతి కథనం. ఆ పత్రికలో అది అర్థపతాక శీర్షిక. ఈ రెండూ ఒకే రోజు రావడం ఒకింత వింత పరిస్థితే.
వచ్చే ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌కు అనుకూలత వుండొచ్చని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్న మాటే గనక పెద్ద ఆశ్చర్య పోవలసిందేమీ లేదు. అయితే ఈ సర్వేపై చర్చలో కూడా తెలంగాణ ప్రముఖులు కొందరు పేర్కొన్నట్టు దీన్ని ఇప్పటి నేపథ్యంలో చూసి భవిష్యత్‌లో మార్పులు చేర్పులు ఏముంటాయో గమనించాల్సి వుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పరిణామాలు తప్పిదాలు కూడా ప్రజ
లను ప్రభావితం చేసే కాలమిది.
ఇంత అనుకూలత అగుపిస్తుంటే ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు చెబుతున్న స్పందనలు ఎలా వున్నాయట?. సిపిఎం కాంగ్రెస్ బిజెపి వంటి పార్టీలూ కోదండరాం వంటి ఉద్యమ మాజీ సహచరులు చేస్తున్న విమర్శలను తమ మంత్రులు గట్టిగా ఎదుర్కొవడం లేదని ఆయన ఆగ్రహించారట. నిజంగా ప్రజల్లో పూర్తి అనుకూలత వుంటే విమర్శించే ప్రతిపక్షాలపై వారే విరుచుకుపడతారు గనక ప్రభుత్వానికే మంచిది. కేవలం ఈ యాత్రలతో మారే పరిస్థితి వుండదు. కాని మంత్రులు ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థించడం లేదంటే దానికి కారణాలేమై వుండాలి? అంతర్గత అసంతృప్తా? లేక పనితీరు సరిగ్గా లేదనే వాస్తవిక సంకోచమా? ఆలోచించాల్సిన సమస్యే. విమర్శలు చేయడం లోపాలు దృష్టికి తేవడం ప్రతిపక్షం ి బాధ్యత .అందులో హెచ్చుతగ్గులుండొచ్చు గాని ప్రతిపక్షాలు కూడా ప్రశంసలే చేయాలంటే కుదరని పని. కాని అమాత్యులే అంతగా వెనకేసుకురావడం లేదంటే లోపం ఎక్కడుందో అధినేత పరిశీలన కూడా చేసుకోవద్దా?వారిపై గుస్సాయిస్తే సరిపోతుందా?
