తమ్మినేనికి ఫోన్లెలా చేశారు? సాయమెలా కోరారు?

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలోని బృందం మహాజన పాదయాత్ర జయప్రదంగా వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మొదట్లో వ్యతిరేకించినా అడ్డుకోవాలనే పిలుపును వెనక్కు తీసుకున్నారో లేక ప్రజలు యాత్ర చేసే వారిని ప్రేమించారో గాని ప్రతిచోటా మంచి ఆదరణే లభిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ యాత్రలో వ్యక్తమయ్యే కొన్ని సమస్యలు చూస్తే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. రెండేళ్లపాలనలోనే టిఆర్ఎస్ను అన్నిటికీ తప్పు పట్టడం సరికాదు కాని కొన్ని తక్షణ సమస్యల విషయంలోనూ తగు స్పందనలేదని చెప్పకతప్పదు. కొన్ని ఇతర పార్టీలతో పోలిస్తే ఈ యాత్ర సందర్భంగా చేస్తున్న ప్రసంగాలలో వివాదాల కన్నా విధానపరమైన విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సరిగ్గా యాత్ర వంద కిలోమీటర్ల మైలురాయి దాటుతున్న రోజునే టిఆర్ఎస్ ఎంపి కవిత మీడియాతో మాట్లాడారు.సిపిఎం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమని మరోసారి పాత విమర్శనే వినిపించారు. రెండు ప్రాంతాల్లో ఒకే మాటకు కట్టుబడిన సిపిఎం తప్పు చేసినట్టు అక్కడ వ్యతిరేకం ఇక్కడ అనుకూలం అన్న కాంగ్రెస్ టిడిపి వంటి పార్టీలూ లేదంటే ఆ కాంగ్రెస్లో కలసిపోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నటిఆర్ఎస్ నేతలు పవిత్రులైనట్టు పదేపదే ఆరోపించడం అర్థరహితం. దీనిపై గతంలోచాలా చెప్పుకున్నాం గనక రిపిటీషన్ అవసరం లేదు.కాకపోతే కవిత మాత్రమే గాక టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా 2014 ఎన్నికల సమయంలో సిపిఎం మద్దతు కోరుతూ ఇదే తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసిన మాట యథార్థం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా వున్న నేత రాయబారం రావడం కూడా నిజం. కాంగ్రెస్ బిజెపిలను ఓడించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్న సిపిఎం నేతలు మాట్లాడివుండొచ్చు గాని ఇప్పుడింతగా వ్యతిరేక ముద్ర వేసి క్షమాపణలు అడుగుతున్న టిఆర్ఎస్ అధినేత,ఇతర నేతలు ఎలా సహాయం కోరారు?
నిజామాబాద్లో కవితకు సిపిఎం మద్దతు నిచ్చిన మాట నిజం. ఆ పార్టీ కీలక నేతలు చాలా మంది నిజామాబాద్ కరీం నగర్ వంటిచోట్ల సిపిఎం దానికి సంబంధించిన కార్యాలయాల్లో మీడియాతో మాట్లాడిన మాట కూడా నిజం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనమండలికి రాజ్యసభకు జరిగిన ఎన్నికల సమయంలోనూ సిపిఎం సహాయం కోరారు. అప్పుడెప్పుడూ లేని అభ్యంతరాలు ఆగ్రహావేశాలు ఇప్పుడెందుకు వస్తున్నాయో అర్థం కాని విషయం.
రెండుచోట్ల ఒక విధానానికి కట్టుబడిన పార్టీకి దాన్ని మొన్న చర్చలో కూడా అన్ని పార్టీలూ ప్రస్తావించాయి.టిఆర్ఎస్ కీలక నేతలు ు కూడా ఆ విధంగా మాట్లాడ్డం నాకు తెలుసు. నిజానికి మజ్లిస్ పార్టీ చాలా స్పష్టంగా ఆఖరి వరకూ తెలంగాణను నేరుగా వ్యతిరేకించింది. కాని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట కెటిఆర్ ఆ పార్టీ నేత అక్బరుద్దీన్నే కలిశారు.ఇప్పటికీ వారే ప్రధాన మిత్రులుగా వున్నారు. మరి మజ్లిస్పార్టీలో ఎలాటి వ్యతిరేకత టిఆర్ఎస్కు కనిపించదా? రాజకీయాల్లో తేడాలుంటాయి. చరిత్రలో ముగిసిపోయిన సమ్ణస్యలను తిరగదోడడం, స్వార్థవిన్యాసాలు చేయకుండా ప్రజలతో నడిచే వారిని శాపనార్తాలు పెట్టడం ఎప్పటికీ మంచిది కాదని అర్థం చేసుకోవడం అందరికి మంచిది.రేపైనా లౌకికతత్వం కోసం రాష్ట్రాల హక్కులకోసం నికరంగా నిలబడేది వామపక్షాలు తప్ప పార్టీలూ, రంగులు మార్చేవారు కాదు.