శంకుస్థాపనకు ఏడాదైనా.. ఏమీ తేలదు, అందదు…

ap6_2593719g
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన జరిపి ఈ రోజుకు ఏడాది పూర్తయింది. అప్పట్లో ఆయన మట్టి నీరు తప్ప మరేమీ తేకపోవడంపై దుమారం రేగింది. ఇప్పటికి అంతకన్నా పెద్దగా ఇచ్చిందేమీ లేదు.ఆ సంగతి అటుంచితే అమరావతిని ప్రపంచంలోని అయిదు నగరాల్లో ఒకటిగా చేస్తామనే అతిశయోక్తులు తప్పితే ఇంతవరకూ నిర్మాణానికి సంబంధించిన నిర్దిష్ట ప్రణాళికలేమీ తేలలేదు. వెలగపూడిలో కట్టిన సచివాలయం తాత్కాలికమో కాదో కూడా తెలియదు. కట్టాల్సిన హైకోర్టు శాసనసభ రాజ్‌భవన్‌ వంటివాటిపైనా స్పష్టత లేదు. ఉన్నా బయిటపెట్టలేదోమో తెలియదు. అంతా చూసుకుంటారన్న సింగపూర్‌ సింహాలేవీ ఇంకా సంచరించడం లేదు. ఆ రోజు చెప్పిన ప్రకారం ఈ ఏడాది మార్చినాటికే రైతులకు ప్లాట్ల పంపిణీ అయిపోయి వుండాలి.అదీ అరకొరగానే నడుస్తున్నది. కేంద్రం ఇచ్చిన 1800 కోట్లలోనూ వెయ్యికోట్లు విజయవాడ గుంటూరులకు పోతే 800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మరల్చినట్టు సమాచారం. పనులు కోల్పేయే వ్యవసాయ కార్మికుల్లోనూ దాదాపు మూడో వంతు మందికి మాత్రమే పెన్షన్లు మంజూరయ్యాయి. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, గృహ వసతి వంటివన్నీ ఇంకా వాగ్దానాలుగానే వున్నాయి. కోర్‌ కాపిటల్‌ సీడ్‌ క్యాపిటల్‌ వంటివన్నీ పదాలుగా మిగిలిపోగా ఇప్పుడు పరిపాలనా భవనాల నిర్మాణానికి మరో శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అది amrvthi111కూడా స్పష్టంగా చెప్పడం లేదు. మరో ఏడాదిలో ఎన్నికల జ్వరం వచ్చేస్తుంది. ఈలోగానే అన్నీ అయిపోతాయని ఎవరూ అనుకోలేదు గాని అసలు ఏం జరిగేది సూచనగా కూడా తెలియకపోవడం మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణమవుతున్నది. శంకుస్థాపనకు ఏడాది అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అక్టోబరు 28న ఆర్థిక పరిపాలనా భవనాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్టీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.ఏడాదిలో చాలా చేశామంటూనే ఇంకా చేయవలసింది వుందని, ఇదో నిరంతర ప్రక్రియ అని వివరించారు.
ఈ సందర్భంలో ప్రజాశక్తి ప్రత్యేక కథనాలు ప్రచురించడమే గాక పలు అభిప్రాయాలను ప్రచురించింది. రాజధాని గ్రామాల్లొ ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు ఇస్తామన్న వాగ్దానం అమలుకు ఇంతవరకూ స్థలం కూడా గుర్తించింది లేదు. మహిళలకు అల్లిక కుట్టుపనుల వూసే రాలేదు. కీలకమైన రోడ్ల నిర్మాణం మొదలు కాలేదు. ముంపును నివారించేందుకై భూమిని ఆరు అడుగులు ఎత్తుపెంచే పని చేస్తున్నారు గాని దీనివల్ల చాలామంది రైతుల ప్లాట్టు దిగువలో పడిపోనున్నాయి. పైగా రోజూ వేలాది లారీలు ఇసుక ఇతర వస్తువులతో తిరుగుతూ వుండటం వల్ల వున్న రోడ్డు కూడా దెబ్బతినిపోతున్నాయి. విజయవాడ వెలగపూడి రోడ్డు ఒక్కటే కాస్త బాగుందంటున్నారు. మిగిలినవన్నీ పాడైపోయిన పరిస్థితి.మొదట్లో రైతులను స్తానికులను మెప్పించడం కోసం పెన్షన్లు విస్త్రతంగా ఇచ్చిన అధికారులే ఇప్పుడు రకరకాల షరతులతో వున్నవి కోత కోస్తున్నారని గ్రామస్తులు గోడు వినిపిస్తున్నారు.పనులు కల్పించడానికి బదులు ప్రొక్లెయిన్లతో కానిచ్చేస్తున్నారు. పైగా రాజదాని గ్రామాలు స్మార్ట్‌ పట్టణాలంటూ గ్రామాల హౌదా మారి పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి పోయాయి. పంచాయితీ రాజ్‌ అధికారులు పట్టించుకోడం మానేయడంతో దగ్గరగా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
ఎంతో ఆశపెట్టిన ప్లాట్లు పరిహారాల విషయంలోనూ అన్యాయం జరుగుతున్నట్టు బాధితులు చెబుతున్నారు. వందేళ్ల కిందటి రికార్డులను సాకుగా చూపించి దేవాదాయ భూములను పాలకపక్షం పెద్దలకు కట్టబెట్టడం జరుగుతున్నది. ఇందుకు సంబంధించిన పలు కబ్జాలు కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాట్ట కేటాయింపులో లాటరీ అంటున్నా సరే లోపాయికారిగా మతలబులు జరుగుతున్నాయని తెలుగుదేశం అనుకూల గ్రామాల్లోనే అసంతృప్తి పెరుగుతున్నది. రాజధాని ప్రాంతంలో ప్రజా జీవితం తొణకిసలాడాలని ప్రజా రాజధానిగా వుండాలని చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకూ ప్రజాసంఘాలతో గాని రైతులు కూలీలతో గాని మాట్లాడ్డం లేదని మొత్తం సమయం కార్పొరేట్లతో చర్చించడానికే సమయం వెచ్చిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులకు సంబంధించిన లంక భూములకు ప్యాకేజీ అందలేదు.వాటిని సమీకరణలో తీసుకోలేదు. సాగునూ అనుమతించడం లేదు. ఇవి ప్రభుత్వ ఆస్తిఅంటూ జరీబు భూములతో సమానంగా ఇవ్వాల్సిన పరిహారాన్ని కోత కోశారు. మొత్తంపైన ఏడాది తర్వాత కూడా ఏది ఎలా వుంటుందనే స్పస్టత రాకపోతే అప్పుడు ఇచ్చిన హామీలు అమలు కాకుండా పోతున్నాయనేది అమరావతి ప్రాంతంలో వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ఇంకా చెప్పాలంటే ఆవేదన. అన్న క్యాంటిన్లు పెట్టి ఆహారసదుపాయం కలిగిస్తామన్నది పోయి వెలగపూడిలో వున్నదే మూసివేయడం దీనికి కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *