మతరాజకీయాలను అడ్డుకోవాలన్న సుప్రీం
ఇప్పటి వరకూ ప్రతిపక్షాలూ లౌకిక వాదులనుంచి వినవచ్చిన ఈ ప్రశ్న అత్యున్నత న్యాయస్తానమే అడిగింది. ఎన్నికల్లో గెలిస్తే అయోధ్యలో రామమందిరం కట్టిస్తామని వాగ్దానం చేయడం మతాన్ని రాజకీయాలతో కలగాపులగం చేయడం కాదా అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాగూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందూత్వ మతం కాదు, జీవన విధానం అంటూ 1995లో ఇచ్చిన ఒక తీర్పుపై పునర్విచారణ చేపట్టిన కోర్టు వాదనలు వింటున్నది. ఎన్నికల్లో మతాన్ని రాజకీయాలతో మిళితం చేయరాదని ప్రజా ప్రాతినిధ్యచట్టం 123(3) నిబంధన చెబుతున్నా అందుకు సంబంధించి సరైన చట్టాన్నిచేయడంలో పార్లమెంటు విఫలమైందని చీప్ జస్టిస్ విమర్శించారు.చట్టాలు చేయవలసింది పార్లమెంటే కానికోర్టు కాదు.మహిళల వేధింపులను అరికట్టేందుకు ఉద్దేశించిన విశాఖ తీర్పుపై 16 ఏళ్ల తర్వాత అదికూడా కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప కేంద్రం 2013లో చర్య తీసుకోలేదని విమర్శించింది. మన ఎన్నికలు లౌకిక ప్రక్రియ.వాటిని మతం నుంచి దూరం చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తప్పు చేసేవారిని ఎన్నికల్లో పాల్గొనకుండా చేసే విషయం కూడా నిర్ణయిస్తామని పేర్కొంది. 1994లో రాజస్థాన్లోపోటీ చేసిన బిజెపి అభ్యర్థి సుందర్లాల్ పట్వా కావడానికి జైనుడైనప్పటికీ ఓటర్లను ఆకర్షించడం కోసం రామమందిరం కట్టిస్తామని వాగ్దానంచేశాడని ఇది మత ప్రచారమే గాని అభ్యర్థి ప్రచారం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
