మహాజనయాత్ర మొదటి పేజీ అర్హత లేదా?

mahajana111

సిపిఎం సామాజిక సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న మహాజన పాదయాత్ర అక్టోబరు 17న ఇబ్రహీం పట్నంలో సంరంభంగా ప్రారంభమైంది. (గత నాలుగు రోజులుగా నేను లేనందువల్ల పాల్లొనలేకపోయాను) అంబేద్కర్‌ మనవడు మేధావి ప్రకాశ్‌ అంబేద్కర్‌తో పాటు వామపక్షాల నాయకులూ పలువురు సామాజిక జీవులు ఆ సభలో పాల్గొన్నారు. యాత్రకు పదిరోజుల ముందే ముఖ్యమంత్రి కెసిఆర్‌ దానిపై దాడి చేయడంతో కొంత చర్చ కూడా నడిచింది. మామూలుగా ఇలాటి విమర్శలు వివాదాలు వస్తే చాలా సంచలనం చేయడానికి ప్రయత్నించడం మన మీడియాకు అలవాటు. సిపిఎం నాయకులు ఆ విధమైన వివాదం పెంచడానికి గాక తమ ఆలోచనలు చెప్పడానికే ఎక్కువగా ప్రయత్నించినట్టు కనిపించింది. ఏమైతేనేం వీటన్నిటి తర్వాత మహాజనపాదయాత్రకు రాజకీయ సామాజిక ప్రాధాన్యత పెరగడం సహజం. కాని నేను ఈ రోజు ఆలస్యంగా వచ్చి చూసి ఆశ్చర్పపొయిందేమంటే ప్రముఖ పత్రికలు చాలా వరకూ ఈ వార్తను మొదటిపేజీకి తీసుకోలేదు. కనీసం ఇండికేషన్‌ కూడా ఇవ్వలేదు. లోపల వారి వారి నిర్ణయాన్ని బట్టి ఇచ్చాయి. కొన్నిపార్టీలు కొందరు నేతలు ఇలాటి సూచనలు చేయగానే పతాకశీర్షికలు ప్రత్యేక కథనాలు గుప్పించే మన పత్రికలకు ఇన్ని వేలమంది సమీకరణ కావడం.ఇంతమంది మాట్లాడ్డం, యాత్ర ప్రారంభించడం మొదటిరోజైనా ప్రముఖమైందిగా కనిపించకపోవడం విచిత్రమే. పాలకపక్ష నేతల ప్రదక్షిణలు వేషభాషలు మొక్కులు నృత్యాలు కూడా గొప్ప వార్తా కథనాలై పోతాయి గాని మామూలు మనుషుల కోసం హంగూదర్పాటు లేకుండా ఒక యాత్ర సంకల్పిస్తే ఇంత పరిమితమైన ప్రాధాన్యత ఇచ్చారంటే కారణం ఏమైవుండాలి? కనిపించని కారణాలు వుండి వుండాలేమో! ఇవేవీ వుండవు గనక హిందూ మాత్రం తన మామూలు ప్రమాణాలు మించి ప్రముఖంగా ప్రచురించింది. పత్రికా రంగానికి సంబంధించిన వాడిగా ఎంతైనా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి వున్న స్వేచ్చను గౌరవిస్తూనే ఈ వాస్తవాన్ని మాత్రం నమోదు చేస్తున్నా. ఈ యాత్ర ఎలాగూ ఎన్నికల సమయంలో జరగడం లేదు, రాజకీయమైంది కాదని ఒకటికి రెండుసార్లు నిర్వాహకులు ప్రకటిస్తూనే వున్నారు. అయినా ఇంత చిన్నచూపు చూస్తే దీన్పి బలపర్చే చిన్నమనుషుల మనసులు చివుక్కుమనవా? పెద్దలు ఆలోచించాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *