లోకేశ్‌పై వైసీపీ కౌంటర్ ఫోబియానా?
ఒకప్పుడు అంటే గత రాష్ట్ర ,ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం మీడియాను పిలిచిందంటే జగన్ గురించి విమర్శించడానికే అనుకునేవారు. ఒకే రోజు ఇద్దర ముగ్గురు కూడా మాట్లాడే సందర్భాలుండేవి. మీ శక్తిని బట్టి రాజకీయంగా ఎదుర్కోవాలి గాని ఆయనకు ఎందుకు అంత ప్రచారం మీరే కల్పిస్తారు అని నేను టిడిపి నేతలతో అంటుండేవాణ్ని. ఈ మాటే చర్చల్లోనూ చాలాసార్లు చెప్పాను. జగన్ ఫోబియా లాటి మాటలు అప్పుడు చలామణిలో వుండేవి. ఆనాడు టిడిపిని ఆవరించిన అభద్రత అంత పనిచేయించింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు నాయుడుకు జగన్ ఆలోచనల గురించి ఒక అనుమానం వెల్లడించారు. అదేమిటో చెప్పడానికి ఇది సందర్భం కాదు, అవసరమూ లేదు.ఇప్పుడు లోకేశ్‌పై వైసీపీ వారు అదేపనిగా చర్చ సాగలాగించడం చూస్తుంటే టిడిపి గతంలో చేసిన ఉపకారానికి రుణం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. గతంలో ఆయనపై ఫోటోలు విడుదల చేశారు. పెద్ద ప్రభావం రాలేదు. మొన్న శిక్షణా తరగతులలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను అవమానించినట్టు ఫోటో పెట్టారు. దానిపైనా విడియో విడుదలతో కొంత తేలిపోయింది. అయినా సరే ఆ సమాధానం సరైంది కాదని వాదించారు. వారి ఇష్టం. ఇదే సమయంలో సాక్షి వెబ్‌సైట్ చూస్తే ఏకంగా ముగ్గురు నలుగురు నాయకులు లోకేష్‌పైనే కేంద్రీకరించి మాట్లాడిన వార్తలు కనిపించాయి. నిజంగా అంత అవసరమా? గతంలో జగన్‌పై దాడి చేసినా ఆయనే పార్టీ అధినేత, ప్రధాన ప్రత్యర్థి గనక ఒక విధంగా వుండేది. ఇప్పుడు లోకేష్ ఇంకా ఆ స్థానంలోకి రాలేదు.టిడిపి కూడా అలా చెప్పడం లేదు. నిజంగా ఆయనపై ఏదైనా నిర్దిష్ట సమాచారం ఆధారం దొరికితే నిరభ్యంతరంగా విమర్శించవచ్చు. సమాధానం కోరవచ్చు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన సమాధానం చెప్పుకోవలసి వుంటుంది కూడా. కాని దానికి బదులు మామూలు ఆరోపణలు బలహీనమైన విమర్శలు చేయడం వల్ల వైసీపీకి కలిగే ప్రయోజనం వుండదనే చెప్పాలి. పైగా ఈ దాడి ద్వారా వైసీపీ తమ ప్రధాన లక్ష్యం లోకేష్ అన్న సంకేతాలు పంపినట్టవుతుంది. అది ఆయనకు మేలు గాని జగన్‌కు కలిగే ఉపయోగం శూన్యం. తండ్రికి తోడుగా ప్రభుత్వంపై ప్రభావం పార్టీలో సమన్వయం చేస్తుండవచ్చు గాని లోకేశ్ ఇంకా జగన్‌తో పోల్చదగిన పాత్ర తీసుకోలేదు. తీసుకుంటే అదో విధం, నా ఉద్దేశంలో కొందరు వైసీపీ అధినేత సలహాదారులు కొందరు ఇదేదో గొప్ప బ్రహ్మాస్త్రం అన్న భ్రమ పడుతున్నారేమో గాని అది నిజం కాదు. ఈ వ్యక్తిగత రభసలూ నిరర్థక వివాదాలు ఎంత త్వరగా ముగించి విదానపరమైన ప్రజా సంబంధమైన విషయాలపైకి మరలితే అంత మేలు.
