సిపిఎం యాత్రపై ముందే కెసిఆర్వ్యతిరేకతా!

కొన్నేళ్ల కిందట విభజన ఉద్యమం తీవ్రంగా వున్నప్పుడు తెలంగాణలో కొన్ని పార్టీల నేతల పర్యటనలను అడ్డుకుంటామని టిఆర్ఎస్ ప్రకటిస్తే చర్చల్లో అందరూ వ్యతిరేకించేవారు. ఎవరి రాజకీయాలు వారు చెప్పుకుంటారు తప్ప అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని అంటుండే వారు. ఆ ఘట్టాలన్ని ముగిసి తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మహాపాదయాత్ర తలపెడితే దానిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ముందే విరుచుకుపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉనికి కోసం చేస్తున్నారని, రష్యా చైనా పోయినా ఇక్కడ వేళ్లాడుతున్నరన్నట్టు మాట్లాడ్డం ఇంకా హాస్యాస్పదం. కెసిఆర్ స్వంత జిల్లా కరీం నగర్లో పుట్టిన జ్ఞానపీఠం అధిరోహించిన కవి సి.నారాయణరెడ్డి సోవియట్ విచ్చిన్నం సమయంలో రాసిన కవిత ఇక్కడ గుర్తుకు వస్తుంది.’పైన మంచు కరిగినా పర్వతం కరిగిపోదు’ కాలదన్నితే చరిత్ర మాసిపోదు అంటూ ఆయన గానం చేశారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వంతో మొదలు పెట్టి ఇప్పుడు సామ్యవాద సామాజిక న్యాయ సాధనకోసం ప్రజల సమస్యలపై కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారు. సీట్లు వున్నా లేకున్నా అధికార రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఉద్యమాలతో ప్రజలను కదిలించే సిపిఎం వామపక్షాలను అభిప్రాయభేదాలు ఏమున్నా అందరూ గౌరవిస్తారు. కెసిఆర్ కూడా అలా మాట్లాడ్దం నాకు తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి హౌదాలో ప్రజాస్వామికంగా జరిగే పాదయాత్రను స్వాగతించేబదులు ముందే దానిపై ధ్వజమెత్తడం ఏమిటి? భాషా రాష్ట్రాల విభజనను విధాన పరంగా సిపిఎం వ్యతిరేకించిన మాట నిజమే కాని అందులో ప్రత్యేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడిన మాట ఒక్కటైనా వుందా? ఆ మాటకొస్తే యుపిఎ మనుగడే సిపిఎం వామపక్షాల మద్దతుపై ఆధారపడినప్పుడు, టిఆర్ఎస్ కన్నా సిపిఎం మద్దతే కీలకమైనప్పుడు కనీస కార్యక్రమంలోనూ రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ విదర్భ అంశాలు ప్రస్తావన వుందంటే ఆ పార్టీ అడ్డుపడితే జరిగివుండేదా? తన విధానం తాను చెప్పడం తప్ప రాజకీయ ప్రక్రియకు సిపిఎం ఏనాడూ అడ్డుపడిన సందర్బాలు లేవు. రెండు ప్రాంతాల్లో రెండు పాటలు పాడిన అవకాశవాదం అంతకన్నా లేదు. అక్కడ వ్యతిరేకించి ఇక్కడ బలపర్చామన్న కాంగ్రెస్లో కలసి పోవడానికే టిఆర్ఎస్ అధినేత మొదట సిద్ధమైన మాట నిజం. ఆ ద్వంద్వనాటకం నడిపిన పార్టీలను వదలిపెట్టి నిజాయితీగా నిలబడిన వారిని క్షమాపణలు అడగడమేమిటి? ఇప్పుడింతగా ఖండించే తెలుగుదేశంలో అంత సుదీర్ఘ కాలం కొనసాగినందుకు, ఇప్పటికీ వారిని పుంఖానుపుంఖంగా చేర్చుకుంటున్నందుకు ఎవరైనా ఏనాడైనా సంజాయిషీ చెప్పిన ఉదాహరణలున్నాయా?
తెలంగాణ సాయుధ పోరాటంతో చైతన్యం నింపి దానికో చరిత్ర కల్పించిన మహత్తర కమ్యూనిస్టు ఉద్యమ వారసత్వంలో ఈనాడు సిపిఎం సిపిఐ పనిచేస్తున్నాయి. ప్రజలలో మమేకమై మనుగడ సాగిస్తున్నాయి. అలాటి వారు క్షమాపణ చెప్పాలని ముక్కు నేలకు రాయాలని షరతులు పెట్టడం రాజకీయ వ్యతిరేతనే ప్రతిబింబిస్తుంది.పైగా వారిని వూరూరా నిలదీయాలని ముఖ్యమంత్రి గారే పిలుపునివ్వడం కూడా ప్రజాస్వామ్య స్పూర్తి అనిపించుకోదు. పైగా ఇలాటి వాటివల్ల వాతావరణం కలుషితమయ్యే అవకాశముంది. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం, ప్రత్యామ్నాయ విధానాలు సూచించడం ప్రతిపక్షాల బాధ్యత. వామపక్షాల కర్తవ్యం. అప్పటి ఉద్యమ సమయంలో అంటే ఆవేశాలు చూపివుండొచ్చుగాని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ దశాబ్దాలుగా పోరాడుతున్న వారిని ప్రజా ఉద్యమ నేతలు యాత్రలు చేస్తే శాపనార్థాలు పెట్టడం, అడ్డుపడాలని పిలుపునివ్వడం అవాంఛనీయం. అప్రజాస్వామికం.ఆగ్రహంలో విమర్శించినా కెసిఆర్ ఈ యాత్రపట్ల సానుకూల వైఖరి తీసుకుంటారని ఆశించాలి. ప్రజలు కూడా ఈ యాత్రలను ఆదరిస్తారని విశ్వసించవచ్చు.