ఛాన్సు వదలని ‘లేఖేశ్’ ఫోటో వార్
రాజకీయంగా ఎవరినైనా ఎంతైనా విమర్శించవచ్చు గాని వ్యక్తిగత ఆరోపణలు చేసేప్పుడు జాగ్రత్తగా వుండాలి. అసలు విధానపరమైన విషయాలు వదిలేసి వ్యక్తులపై పడటం అనవసరం, అవాంఛనీయం కూడా. అత్యున్నతమైన అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ట్రంప్, హిల్లరీ క్లింటన్‌ల మధ్య పోరాటంలో అప్పుడప్పుడూ వినిపించే మాటలు కనిపించే చిత్రాలు మనకు చాలా జుగుప్స గొల్పుతాయి. నిజానికి భారత రాజకీయాల్లో అలాటి వ్యక్తిగత విషయాలపై వివాదాలు చేయడం తక్కువ. అధికార హౌదాలో వున్న వారు దొరికితే మాత్రం వదిలే ప్రసక్తి వుండదు. ప్రస్తుతానికి వస్తే వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ పోరాటంలో లోకేష్‌పై కేంద్రీకరణ ఎందుకో మొదటి నుంచి ఎక్కువగానే వుంటున్నది. ఒకప్పుడు ఆయన అమెరికాలో వున్న ఫోటోలంటూ కొన్ని ప్రచారంలోకి వచ్చాయి.వాటిని అధికారికంగా కూడా వారు చలా
మణి చేశారు. అయితే ప్రజలేమీ పట్టించుకోలేదు. ఆ రోజుల్లో నేను సాక్షి గ్రూపులో ఎవరితోనో ఇవన్నీ ఎందుకు అంటే వారు కూడా నాతో ఏకీభవించారు. అయినా అడపాదడపా ఏవో ఇలాటి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి.నిజంగా ఏదైనా తప్పు జరిగితే దొరికితే వేరే విషయం. వున్నదానిపై వూహలు పెంచడం వేరు. శిక్షణా తరగతులపై నేను కూడా చాలా రాశాను. కాని ఇద్దరు వ్యక్తులు నిలబడి వున్న పోటో పట్టుకుని శక్తికొద్ది కథలు అల్లవలసిన పని లేదు. వైఎస్ హయాంలో అధికార సమావేశంలో జగన్ పాల్గొన్న ఫోటోపై ఇలాగే దుమారం రేపినా ఎవరూ పట్టించుకోలేదు.ఇక్కడ సాంకేతికాంశాల కంటే వాస్తవంగా తీవ్రత ఎంత అనేది సమస్య.
ఇప్పుడు ఆ పోటోకు సాక్షి చేసిన వ్యాఖ్యానం, దానిపై తెలుగుదేశం స్పందన మన ముందున్నాయి. వున్నంతలో ఆ ఆడియో విడియోను అనుమానించవలసిన అవసరమేమీ కనిపించదు. అందులో వాళ్ల పార్టీ సభ్యత్వం గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ఎవరు పైన ఎవరు కింద ఎవరిని ఎవరు ఏమంటున్నారు ఇవన్నీ అప్రస్తుత విషయాలు. లోకేష్ ఆడియో సరిగా లేదు గాని వినిపించిన మేరకు చినరాజప్ప లోకేష్ ల మధ్య సమస్య ఏమీ అనిపించడం లేదు. దీనిపై సాక్షి నిర్వాహకులకు గాన నేరుగా జగన్‌కు లేఖ రాయడం ద్వారా లోకేశ్ రాజకీయ వ్యూహం ప్రదర్శించారని చెప్పొచ్చు. గతంలోనూ ఆయన ట్విట్టర్‌లో ఇలాగే ఏవో వదులుతుండేవారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కెటిఆర్‌తో వాదనలు నడిపించారు. కాబట్టే ఈ ఫోటో విషయంలోనూ అవకాశం వదలకుండా లేఖాస్త్రం సంధించి లేఖేశ్‌గా మారారు. దీనికి వైసీపీ నుంచి సాక్షి నుంచి సమాధానం రాదని భావించలేము.కాకుంటే ఈ లేఖలో జగన్‌పై కొన్ని ఆరోపణలు ఎదురుదాడి చేశారు గనక ఆయన సమాధానమిస్తారా ఇప్పిస్తారా చూడాలి.ఇలా ప్రజలకు సంబంధం లేని విషయాలపై ఈ చర్చ సాగదీయకుండా ముగిస్తే మంచిది. లేక వారి దగ్గర మరేదైనా ఆధారముంటే బయిటపెట్టొచ్చు గాని ఆ అవకాశం పెద్దగా వుండకపోవచ్చు.
