వేరే కాపురమంటే విడాకులేనా?

మన కోర్టులు కొన్నిసార్లు క్లిష్టమైన తీర్పులు ఇస్తుంటాయి. తాజాగా సుప్రీం కోర్టు విడాకులకు సంబంధించి ఇచ్చిన తీర్పులో భార్య గనక వేరే కాపురం పెట్టాలని పట్టుపడితే భర్త విడాకులు ఇచ్చేయొచ్చని తీర్పు చెప్పింది. హిందూ కుటుంబంలో కుమారుడు తలిదండ్రుల బాధ్యత చూడాలని, ఒక్కడే కుమారుడైతే అతని జీతంలో వారికి హక్కు వుంటుందని పేర్కొంది. అలాటి పరిస్థితిలో భార్య గనక కలసి వుండేందుకు ఒప్పుకోకపోతే భర్త విడాకులు తీసుకోవచ్చని అనిల్ ఎ దావే, లావు నాగేశ్వరరావులతో కూడి ధర్మాసనం తీర్పు చెప్పింది. భర్త ఆదాయమంతా తామే అనుభవించాలని కోరడం హిందూ నైతిక సూత్రాలకు విరుద్దమని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఒకే కొడుకైతే తప్పక తలిదండ్రుల బాధ్యత చూడాలనడం వరకూ బాగుంది. కలిసే వుండాలని కూడా కోరుకోవచ్చు. కాని ఆ సాకుతో విడాకులు మంజూరు చేస్తే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. పైగా ఇది భార్యకే వర్తించడం మరో సమస్య. ఒక వేళ ఆ కొడుకే విడిపోదామని అనుకుంటే అతనికి కూడా విడాకులివ్వొచ్చా? తలిదండ్రుల బాధ్యత అమ్మాయిలకు వుండకూడదా? దేశంలో కామన్ సివిల్ కోడ్ గురించి తరచూ వాదించేవారు అవిభక్త హిందూ కుటుంబం అన్నది కూడా మత ప్రాతిపదికనే నడుస్తుందనీ, దానిచాటున శతసహస్ర కోటీశ్వరులు కావాల్సినంత దాచేసుకోగలుగుతున్నారని మరిచిపోతుంటారు. ఇక్కడ ఈ తీర్పులో కూడా కేవలం భార్యకు మాత్రమే విడాకులిచ్చి పంపేయాలనడం ఎలా సమర్థనీయమవుతుంది? ఒకవేళ కొత్తలో పరస్పర అవగాహన పెరిగేలోగా ఎవరైనా అలా భావిస్తే నేరమేమీ కాదు. తప్పులు ఎటైనావుండొచ్చు గనక నచ్చజెప్పవలసిన బాధ్యత వుంటుంది. కాబట్టి ఉమ్మడి కుటుంబం కోసం దంపతులను విడదీయడం కూడా పొరబాటే అవుతుంది.తీర్పు వివరాలు తదుపరి పరిణామాలు చూడవలసిందే.