పాక్ ఉగ్రదేశం కాదు- మా దోస్తి యథాతథం
యురీ దాడుల అనంతరం అమెరికా వైఖరిలో మౌలిక మార్పు వచ్చిందనే కథలు పటాపంచలైపోయాయి. కుక్కతోక వంకరగా మరోసారి పాక్ పాలకులకు అద్యక్షుడు బారక్ ఒబామా పూర్తిగా వెన్నుదన్ను నిచ్చారు. ఉగ్రదేశంగా ప్రకటించే ఆలోచన లేదనీ, దానిపై సెనెట్ ముందుకు వచ్చిన బిల్లు లేదా మరేదీ తమ దృష్టిలో లేదని చెప్పేశారు! విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ ఈ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రచారంలో పెట్టిన కథనాలకు పూర్తి విరుద్ధంగా వున్నాయి. పాక్ అమెరికా సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని కూడా కిర్బీ తేల్చిచెప్పారు. పాక్ అణ్వస్త్ర భద్రతపైనా నియంత్రణపైనా పూర్తి విశ్వాసం వెలిబుచ్చారు. ఇది ఇలాగే జరుగుతుందనీ పాక్‌తో అమెరికా బంధం ఎప్పటికీ తెగేది కాదని తెలకపల్లిరవి.కామ్‌తో సహా పదే పదే చెప్పుకున్నదే. కాని ఎప్పటికప్పుడు ఏదో ఆశ చూపిస్తూ మోడీ సర్కారు అమెరికాను అంటుకుని తిరుగుతున్నది. అంతేగాక పాక్ స్థానం మనకు ఇచ్చేస్తారనే అంచనాతో చైనా రష్యాలను కూడా దూరం చేసుకుంది. ఇప్పుడు ఆ దేశాలు పాక్‌తో మాట్లాడుతున్నాయని ఆగ్రహించిన కొందరు బిజెపి నేతలు లేదా భాష్యాలు చెప్పిన వ్యాఖ్యాతలు అమెరికా ప్రకటనపై ఏమంటారో చూడాలి. కాశ్మీర్ సమస్యను కూడా భారత పాక్
లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ ఒబామా అది ద్వైపాక్షిక అంశంగా చూపించారు తప్ప ఏ కోశాన భారత్ పట్ల ఇసుమంతైనా మొగ్గు చూపించలేదు. కాకపోతే ఉగ్రవాదాన్ని అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని మాత్రం హితబోధ చేశారు. కాశ్మీర్ సమస్యపై తమ వైఖరి ఎప్పటిలాగే వుందనీ, దీనిపై ఇరు దేశాల మధ్య తేడాలు కొనసాగుతున్నాయని వివరించారు. వాటిని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవలసింది ఆ దేశాలేనని కూడా నొక్కి చెప్పారు. మొత్తంపైన అమెరికానుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నట్టు చెప్పుకున్న మోడీ ప్రభుత్వం ఇకనైనా వాస్తవాలు గ్రహించి దేశ స్వతంత్ర విధానాన్ని కాపాడుతుందేమో చూడాలి. ఇటీవల అలీన దేశాల సమావేశానికి తొలిసారి ప్రధాని మోడీ గైరు హాజరు కావడం ద్వారా అమెరికా కూటమిలోనే వున్నట్టు సంకేతాలిచ్చారు. ఆయుధ కొనుగోలు ఒప్పందాల కోసం హడావుడి పడ్డారు. సెనేట్‌లో ఇద్దరు ప్రైవేటు సభ్యులు పాక్‌పై బిల్లు ప్రతిపాదిస్తే దాన్ని అతిగా అంచనా వేసి అమిత ప్రచారమిచ్చారు. భౌగోళికంగా ఇండియా చైనా రష్యా ఆప్ఘనిస్తాన్ అనేక దేశాలలో తన వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకోవడానికి అమెరికా పాక్‌లోని సైనిక మత నిరంకుశాధికార కూటమిని ఎప్పుడూ కాపాడుతునే వుంటుంది. ఆయుధ ఆర్థిక సహాయం చేసి పోషిస్తుంటుంది కూడా. ఉరీ దాడి వంటివి సంభవించినప్పుడు నామకార్థంగా ఖండించడం తప్ప నిజంగా పాక్ పై కఠిన చర్యలు తీసుకోవడం జరగని పని.
