దేశభక్తి ఎక్కువై దాడిచేస్తే ఎలా రాజా?
టీవీ5లో సర్జికల్ దాడులపైన జరుగుతున్న చర్చలో నట దర్శక రచయిత పోసాని కృష్ణ మురళి మాజీ ఎంపి,సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుపై దాడికి దిగడం, బూతులు తిట్టడం దారుణమైన ఘటన. చర్చ చూడని చాలా మంది క్లిప్పింగులు పంపిణీ అయ్యాక చూడగలిగారు. నేనూ అలాగే చూశాను. పోసాని ఆవేశపరుడు అని సరిపెట్టుకుందామనుకున్నా మరీ ఆ స్థాయికి వెళ్లవలసింది కాదు. కొంతమంది ఆయనేదో గొప్ప పని చేసినట్టు సోషల్‌మీడియాలో( టీవీ మీడియాలోనూ మాతో చర్చకు వచ్చిన బిజెపి ప్రతినిధి మెచ్చుకుంటున్నారు) పొగడ్డం, ఇంకొంత మంది ప్రాంతీయ కోణంలో బాగుందనడం కూడా హాస్యాస్పదం. ఇలాటి ధోరణులను ఈరోజు ఒకరిమీద జరిగాయని పొగిడితే రేపు ఈ పొగిడిన వాళ్లకూ అదే పరిస్థితి ఎదురు కావచ్చు. భారత పాకిస్తాన్ ఘర్షణపట్ల వ్యవహరిస్తున్న తీరుపై భిన్నమైన అంచనాలు వ్యూహాలూ వున్నాయి. వుండాలి కూడా. మరీ అతి చేయొద్దని ప్రధాని మోడీనే సూచించాల్సి వచ్చిందంటే కొంతమంది పైత్యం ఏ స్తాయిన వుందో తెలుస్తుంది. దైనందిన రాజకీయాల్లో వుండే వారి విషయం వేరు, కళాకారుడుగా అందరికీ ఇష్టమైన పోసాని వంటిమిత్రుడు రెచ్చిపోయి సహనం కోల్పోవడం వేరు. ఆయన మోడీని ఎంతైనా అభిమానించవచ్చు, ఆరాధించవచ్చు కూడా. అయితే దాంతో ఇతరులు విభేదించడానికీ అవకాశముండాలి. తాను ముందే కొన్ని షరతులు పెట్టి చర్చకు వచ్చానన్నట్టు పోసాని ఆ వాదనలో అన్నారు. కావచ్చు. కాని మామూలు చర్చలలో పిచ్చికుక్కల్లా పోట్లాడుకుంటారని అందరినీ అన్ని చర్చలనూ అసభ్యంగా దూషించడం పొరబాటు. పోనీ తను సంయమనం చూపిందేమన్నా వుందా అంటే ఏకంగా దాడికే దిగిపోయారు. అది కూడా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడైన నాయకుడితో. విహెచ్‌పై ఎవరికి ఏ భావన వున్నా పోసానికి ఆయనను తిట్టే హక్కు ఎలా వస్తుంది?
నిజానికి అంతకు ముందు సిపిఐ నేత నారాయణపైనా అలాగే అసహన వ్యాఖ్యలు చేశారు. పోసాని లేదా మరే కళాకారులైనా రాజకీయాలు ఇతర రంగాలపై వ్యాఖ్యలు చేయడం మంచిదే గాని అవతలివారినందరినీ చులకన చేయడం అదుపు తప్పిపోవడం అనుచితం. చర్చ లేదా ప్యానల్ నచ్చకపోతే బయిటకు పోవచ్చు. వాకౌట్ చేయొచ్చు. కాని తిట్టడం కొట్టబోవడం పొరబాటు.వున్నమాట చెప్పాలంటే విహెచ్‌కు కూడా అసహనానికి గురై సీనియార్టితో అవతలివారిని తక్కువగా మాట్లాడే అలవాటుంది. నేను పాల్గొన్న చర్చల్లో అలాటి రెండు మూడు సందర్బాలు చూశాను గాని ఇక్కడ ఉదహరించడం లేదు. కాని దానికి పరిష్కారం ఇది కాదు. వినిపించిన మేరకు నిన్న అలాటి మాటలు అన్నట్టు లేదు.
గతంలో నేను ఒకటి రెండు సార్లు పోసానితో ఫోన్ ఇన్‌లలో మాట్లాడాను గాని ఈ పరిస్థితిలేదు. నిజానికి ఒక సినిమా పోస్టర్‌లో చే గువేరా గెటప్‌కూ ఆ టైటిల్‌కూ పొంతన లేదని చెప్పినప్పుడు వెంటనే సవరించుకుంటానన్నారు. చాలామంది ఆయన వివాదపడతారని చెప్పారు గాని చాలా మంచిగానే మాట్లాడారు. విహెచ్‌తో వివాదం విషయంలోనూ పొరబాటును లేదా తొందరపాటును ఆయన అర్థం చేసుకుంటాడని ఆశించాలి. వక్రబుద్ధితో తనను సమర్థించేవారి ట్రాప్‌లో పడేంత అమాయకులు కాదు గనక సరిదిద్దుకుంటారనుకుంటాను.
