టిడిపి తరగతుల్లో సణుగుళ్లు, సందేహాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రవేశపెట్టిన డాష్ బోర్డు అనేక విషయాల్లో క్రాష్ లాగా మారిందని తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారు.దాంట్లో లెక్కల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. అన్నిటినీ దాంట్లో చూసి రేటింగులు షంటింగులు ఇవ్వడం మొదలుపెడితే గందరగోళం తప్పదని వారు చెబుతున్నారు. ఈ బోర్డు ప్రకారం అన్ని జిల్లాలు ఏదో విభాగంలో గొప్ప ఫలితాలు చూపిస్తున్నాయి. శాఖలు మెప్పుకోసం అంకెల గారడీలకు పాల్పడుతున్నాయి. అసలు రాష్ట్రం 12.26శాతం అభివృద్ధి రేటు సాధించిందనే లెక్కనే కీలక బాధ్యతలు నిర్వహించిన ఒక ఐఎఎస్ అధికారి తీవ్రంగా ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్ర బాధ్యుడైన తన పూర్వ సహచరుడిని కూడా ఆయన ప్రశ్నిస్తే నవ్వారట. అధికారులు ఏవో లెక్కలు ఇచ్చేస్తే వాటిని పూర్తిగా నమ్మి చంద్రబాబు నాయుడు పరిస్థితి గొప్పగా వుందనుకుంటున్నారట.ఈ డాష్ బోర్డు చూసి ప్రజలు అమిత సంతోషంగా వున్నారని ముఖ్యమంత్రి చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధ్వాన్నంగా వుందని ఒక సీనియర్ ఎంఎల్‌ఎలే అంటున్నారు. నిజంగా దీన్నే నమ్మితే రేపు వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తింటామని ఒక ఎంఎల్‌ఎ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ఓటర్లు వున్న చోట కూడా తమకు ఆదరణ లభిస్తున్నదని వైసీపీ నేతలు చెబుతుంటే కొత్త వర్గాలను కూడా చేరువ చేసుకున్నామని చంద్రబాబు ఈ తరగతుల్లో ప్రకటించారు. ఇవన్నీ వివరించేందుకు జనచైతన్య యాత్రలుగా వెళ్తే విమర్శలు రావచ్చని వారిలో కొందరు సందేహిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా పూర్తి చేయొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్‌లు వాస్తవాలపై మరింత శ్రద్ద పెడితే బాగుంటుందని అందుకు బదులుగా అంతా బావుందనే భ్రమలో వుండిపోతున్నారని ఒక నాయకుడు చెప్పారు.
అవినీతిపై సూక్తులు వృథా!
కాల్‌మనీ, ఇసుక దందా, ముడుపులు, దాడులు ఇలా తప్పులు చేసి దొరికి పోయిన ఒకరిపైనైనా చర్య తీసుకోకుండా దూరం పెట్టకుండా అవినీతి లేని పాలన అంటే అర్థం ఏముంటుందని అమరావతి శిక్షణా తరగతుల్లో ఒక యువ ఎంఎల్‌ఎ ఆవేశపడ్డారు. కాగా అసలు అవినీతి లేనిదెవరిలో అని రాయలసీమ సీనియర్ ఎంపి ఒకరు కుండబద్దలు కొట్టారు. అవినీతి నిర్వచనం చాలా విస్త్రతమైంది గనక అనేక రూపాల్లో వుండవచ్చని దాన్ని ఉపేక్షించడమే మంచిదని కూడా ఆయన సుభాషితం వినిపించారట.క్షేత్రస్థాయిలో ఎదురీతగా వున్న తమ పరిస్థితిని గమనించకుండా తాడూబొంగరం లేని ర్యాంకుల పేరిట మమ్ముల్ను వేటాడితే ఎంతకాలం తట్టుకోగలమని కూడా కొందరు చాటుమాటుగా మాట్లాడుకున్నారు. తక్కువ ర్యాంకు వచ్చిన వారి స్థానంలో ప్రత్యామ్నాయాలు చూసేందుకు వెనుకాడబోమని నాయకత్వం ప్రకటిస్తే మేము మాత్రం చూసుకోలేమా అని మరో ఎంఎల్‌ఎ ఎదురు ప్రశ్న వేశారు.
ఇద్దరూ బెదిరిస్తారా?
తెలుగుదేశం శిక్షణా తరగతులకు మొదటి రెండు రోజులు ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాకపోవడంపై చాలా వూహలు నడిచాయి. కథనాలూ వచ్చాయి. కొద్దికాలం కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన స్పీడు తగ్గిందని వ్యాఖ్యానించినట్టు చెప్పుకున్నాము. దానికి తోడు దసరాకు జరిగిపోతుందన్న మంత్రి వర్గ విస్తరణ ఆలస్యమై లోకేశ్ మంత్రిపదవి కూడా అనిశ్చితిలో వుండిపోయింది. ఈ కారణాలే గాక చంద్రబాబు అదేపనిగా చెప్పిందే చెబుతుంటారని కూడా కుమారుడు కొంత భాగం స్కిప్ చేసివుండొచ్చు. ఎందుకు రాలేదన్నది ఒకటైతే వచ్చిన తర్వాత ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మాత్రం ఒకింత నిరసన వ్యక్తమవుతున్నది. బాగా పనిచేస్తేనే పదవులు లేకుంటే ఇంటికి అంటూ హెచ్చరించడం ముఖ్యంగా సీనియర్లకు మింగుడుపడలేదు.చంద్రబాబు హెచ్చరికలంటే సరే, ఈ యువ నేత కూడా అదే పాట పాడితే మేమంతా ఏమై పోవాలని వారు కినుక వహించారు. ఓటుకు నోటులో వేసిన తప్పటడుగు కన్నా తలవంపులు ఏముంటాయని కూడా కొందరు ఆక్షేపించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకమైన నిర్ణయాలు నియామకాలు ఏవీ లోకేష్‌కు తెలియకుండా జరగనప్పుడు ఆయనే మరెవరిని విమర్శిస్తారని కూడా ఒక సీనియర్ ఎంఎల్‌ఎ ఆగ్రహం వ్యక్తం చేశారు.లోకేశ్ మాత్రమే గాక ఆయన చుట్టూ వున్నవారి జోక్యం కూడా పెరిగిపోతున్నదని అసమ్మతి వ్యక్తం చేశారు.
బిజెపి వలలో పడిపోయాం
ప్రత్యేక హౌదా బదులు ప్యాకేజీ మెరుగని ఎంత బోధ చేసినా ప్రజల సెంటిమెంటులో పెద్ద మార్పులేదని ప్రజా ప్రతినిధులు కొందరు నివేదించారు. గతంలో కనీసం బిజెపిని విమర్శించి మనం తప్పుకునే అవకాశం వుండేది. ఇటీవల బిజెపి దూకుడు పెరిగి మనం కూడా సమర్థించాల్సిన పరిస్థితిలో పడ్డాం. హౌదా నిరాకరించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు వూరూరా సన్మానాలు చేస్తుంటే మనం మొహం చూపించలేకపోతున్నాం. చెప్పాలంటే మన ముఖ్యమంత్రి కన్నా ఆయన హడావుడి ఎక్కువై పోయింది. బిజెపిలోనే ఆయనపై అసంతృప్తి వుంది గాని మనం ఎందుకు ఇంతగా నెత్తిన పెట్టుకుంటున్నామో తెలియడం లేదు అని టిడిపిలో వివిధ స్థాయి బాధ్యతలు నిర్వహించడమే గాక ఇప్పుడు కూడా కీలక స్థానంలో వున్న ఒక నాయకుడు విమర్శించారు.
అమరావతి భారం
తమాషా ఏమంటే చాలా కాలం తర్వాత తెలుగుదేశం నేతల్లో అమరావతిని అనవసరంగా తలకెత్తుకున్నామనే భావన వ్యక్తమవుతున్నది. విజయవాడ పరిసరాల్లో నూజివీడు వంటి చోట అయితే ఎప్పుడో దూసుకుపోయేవాళ్లం. యాభై వేల ఎకరాలుకూడా వుండేది. ఇప్పుడు ఇక్కడ ఎంతకాలం పడుతుందో చివరకు ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. ఆ సింగపూర్ వాళ్లను నమ్మడం వాళ్ల పేర మనమే ఇక్కడ చేసుకోవడం.. ఆయన చుట్టూ వున్న వారికి తప్ప ఒక్కరికి ఒక్క ముక్క తెలియదు. ప్రతిపక్షాల నోళ్లు మూయించవచ్చు గాని మాలో మాకు కలిగే సందేహాలు ఎలా తొలగిస్తారు? అని ఒక సూపర్‌సీనియర్ నాయకుడు ప్రశ్న వేశాడు.
పెద్ద విషయమేమీ లేకుండా గంటలతరబడి వూకదంపుడు వినిపించేందుకు ఎందుకు పిలిపిస్తారో తెలియడం లేదని తరగతులతో సంబంధం వున్న అధికారులు, నాయకులు కూడా ఆశ్యర్యపోయారు.