భద్రాద్రి రాముడు కమ్యూనిస్టా? జిల్లా చెయ్యరే!
అదిగో యాదాద్రి.. త్వరగా నిర్మించెయ్యండి.. . అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదగిరి అభివృద్ధిపై ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నారు. ఒకసారి దిశానిర్దేశం చేసి పర్యవేక్షణకు పరిమితమయ్యే బదులు స్వయంగా మొత్తం మీద వేసుకోవడమెందుకనే ప్రశ్నలు కూడా వున్నాయి. కాని అంతకన్నా శతాబ్దాల ముందునుంచి తిరుపతి,శ్రీశైలం వంటివాటితో సరసన తీర్థయాత్రాస్థలిగా విరాజిల్లుతున్న భద్రాచలంపై శీతకన్ను వేయడానికి కారణమేమిటి? అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి.. అంటూ ఎందుకు పాడటం లేదు? పైగా భద్రాచలం డివిజన్‌లో కొన్ని మండ
లాలు ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై విమర్శలు కూడా వున్నాయి కదా.. కెసిఆర్ అలాటి కీలక ప్రదేశం ఎందుకు జిల్లాగా చేయాలనుకోలేదు? జిల్లాల ఏర్పాటుపై జరిగిన అఖ్‌ిలపక్ష సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భద్రాచలం జిల్లా గురించి ప్రస్తావిస్తే కమ్యూనిస్టులకు దీంతో సంబంధమేమిటని హాస్యమాడారు గాని ప్రతిపాదన తీసుకోలేదు. నిజానికి భద్రాద్రి ఎప్పుడూ కమ్యూనిస్టులనే ఎన్నుకుంటున్నది. అక్కడ గిరిజనోద్యమం తునికాకు పోరాటాల వంటివి గొప్పచరిత్ర కలిగినవి. ఈ కారణం వల్లనే బహుశా కొందరికి భద్రాచలం అంటే చిన్నచూపు అనుకోవాలి. రామరథ యాత్ర రాజకీయం నడిపిన బిజెపి కురువృద్ధుడు హైదరాబాద్ వచ్చినప్పుడు భద్రాచలం వెళతారా అని అడిగితే అక్కడ అంత గొప్ప క్ష్తేత్రం వుందని ఆయన గమనంలోనే లేదట. (అయినా నాగార్జునతో రాఘవేంద్రరావు తీసిన శ్రీరామదాసును హిందీ డబ్బింగ్ ఆయనే విడుదల చేశారు. ఎందుకంటే ఆ చిత్రంలో అద్వానీ గారి జైశ్రీరాం నినాదాలు అయోధ్య శిలాన్యాస్ చాయలుంటాయి.) అద్వానీ సంగతి ఏమైనా కెసిఆర్‌కు ఈ ప్రాశస్త్యాలు బాగా తెలుసు. అయినా సరే యాదాద్రిపై చూపిన శ్రద్దలో సగభాగమైనా భద్రాద్రిపై ప్రసరించి స్థానికుల కోర్కెను మన్నించడానికి సిద్ధపడలేదు. భద్రాద్రి రాముడు కమ్యూనిస్టనే భావన వుందేమో మరి! కొత్తగూడెంభద్రాద్రి అంటూ కొత్త జిల్లా ప్రకటించారు. ఈ పునర్విభజనలో అసమానతలు చాలా అధికంగా వుండే జిల్లా ఇదే అవుతుంది. ఏమంటే ఇక్కడ బాగా వెనకబడిన గిరిజన ప్రాంతాలూ బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక సంపన్న ప్రాంతాలు సహజీవనం చేయాలి.
ఇంత విస్తారంగా అభీష్ట ప్రకారం జిల్లాలు విభజించిన టిసర్కారు భద్రాద్రి జిల్లాకు నిరాకరించడంలో రాజకీయాలు లేవనుకోవడం కష్టం. ఇప్పుడు స్థానిక ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టారు. ప్రజలు అంతకు ముందే ఆందోళన చేశారు. అది గద్వాలలో అరుణ తరహాలోనో లేక సిరిసిల్లలో కెటిఆర్ అనుచరులు చేసిన తరహాలోనో వుండకపోవచ్చు. కాని స్తానిక కోర్కె. ఇప్పటికైనా కెసిఆర్ పరిశీలన జాబితాలో దాన్ని చేర్చుకునే అవకాశం వుందా అంటే కష్టమే కావచ్చు.