పునర్జన్మల పుక్కిటి కథలతో కవలలు
ఈ ఫోటోలోని ఇద్దరు పిల్లలను చూశారా?వారు కవలలు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన వారు. పేర్లు నితిష్, జితేష్. తండ్రి ఒక రోజున ఉన్నఫలానా వీరు భగియనాథ్ అనే వూళ్లోవున్న తమ సమీప బంధువు సుఖవీర్ సింగ్ ఇంటికి బయిలుదేరారు. అక్కడంతా తెలిసినట్టే ప్రవర్తించడం మొదలెట్టారు. ఏమంటే 2010లో ఆయన కుమారులైన సొరాబ్సింగ్; ఓమ్లు ఈతకు వెళ్లిచనిపోయారట. ఇప్పుడీ కవల సోదరులు అక్కడకు వెళ్లిపోయి ఆ సోరాబ్,ఓమిలు ఎవరో కాదు మేమేనంటూ గోల చేస్తున్నారు. మనదేశంలో ఇలాటి వాటికి పెద్ద ఆకర్షణ కదా.. వాళ్లను అవీ ఇవీ అడిగితే ఏవో గుర్తులు చెబుతున్నారట. ఇంకేముంది? ఈ పిల్లలు పునర్జన్మ ఎత్తారని అక్కడి వాళ్లు నమ్మడం మొదలెట్టారు. కాబట్టే వీరి పోటోలు ఇంటర్నెట్లోనూ మొదటగా దర్శనమిస్తున్నాయి. నిజానికి ఏ కాస్త పరిశీలించినా ఇందులోని మర్మం తెలిసిపోతుంది. ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి చనిపోయిన తమ వాళ్ల గురించి వింటుంటారు. కొన్నాళ్లకు తామే వాళ్లని భ్రమలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తారు గనక అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతున్నారు.ఈ విషయమై శాస్త్రీయంగా సమగ్రంగా పరిశీలించి వాస్తవాలు చెప్పే బదులు అధికారులు పెద్దలు కూడా ఈ విధంగా కట్టుకథల ప్రచారంలో పడ్డారు. ఆఖరుకు నెట్ వరకూ వచ్చారు. ఏం చేస్తాం? చంద్రముఖి సినిమాలో గంగ(జ్యోతిక) చంద్రముఖిగా మారిన సన్నివేశం గుర్తుకు రావడం లేదూ? అయితే మనస్తత్వ శాస్త్రం అంటూనే దాంట్లోనూ భూతవైద్యం, పెద్ద కాలసర్పం వగైరాలన్నీ చూపిస్తారు గనక అది కూడా సైన్సేమీ కాదు. కాకుంటే విన్నవాటిని ఇంటర్నలైజ్ చేసుకుని తమకు ఆపాదించుకునే లక్షణం మనుషులకు అందులోనూ బలహీనులకూ పిల్లలకూ ఎక్కువగా వుంటుంది. ఇది ముమ్మాటికి అలాటి కథే!
