ఫుటేజీ నిరాకరణ- ప్రచారానికి సమీకరణ!

modi-prachr
భారతసైన్యం సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన విడియో ఫుటేజీని బయిటపెట్టే ప్రసక్తిలేని రక్షణ మంత్రి మనోహర్‌ పరిక్కర్‌ ప్రకటించారు. దీంతో ఈ వివాదంలో ఒక ఘట్టం ముగిసినట్టే. కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీల నేతలు ఈ ఫుటేజీ బయిటపెట్టాలని కోరడం పై బిజెపి తీవ్రస్థాయిన దాడి చేసింది. సీనియర్‌ మంత్రి వెంకయ్య నాయుడు మరీ ముందుకు వెళ్లి వీరంతా పాకిస్తాన్‌స్వరం ఆలపిస్తున్నారని ఆరోపించారు.రక్షణ మంత్రి పరిక్కర్‌కూడా ఇలా అడిగే వారి దేశ విధేయత కొరవడిందనే భావించాల్సి వస్తుందన్నారు. ఈ దాడులు జరగలేదని పాకిస్తాన్‌ అంటున్నది గనక మీరు విడియో బయటపెట్టి తగు సమాధానం చెప్పాలన్నట్టు కేజ్రీవాల్‌ తర్కం లేవనెత్తారు. మరోవైపున కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన కిసాన్‌ యాత్ర ముగింపు ప్రసంగంలో ప్రధాని మోడీ సైనికుల త్యాగాల వెనక దాక్కుంటున్నారని ధ్వజమెత్తారు.
స్వయంగా ప్రధాని ఈ దాడులపై అతి చేయొద్దని తమ పార్టీ వారిని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. కాని బిజెపి దాని అనుబంధ సంస్థల తీరుతెన్నులు మాత్రం అలా లేవు. ముఖ్యంగా నాలుగు మాసాల్లో ఎన్నికలు జరిగే యుపిలో దీన్ని బాగా వాడుకోవాలని బిజెపి భావిస్తున్నది. విజయదశిమి రోజున ప్రధానిని పిలిపించి అక్కడ విజయ దినోత్సవం నిర్వహిస్తున్నారు.దీనికోసం వేసిన పోస్టర్లలోనూ సైనికుల బొమ్మలు వినియోగించారు. విమర్శల తర్వాత వీటితో పార్టీకి సంబంధం లేదని ఒక ప్రకటన చేశారు గాని నిజానికి ఇది బిజెపి వ్యూహంలో భాగంగా వుంది. రాబోయే రోజుల్లో ఇది తమకు లాభమని ఆ పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *