సోషల్‌ మీడియా -పార్టీలకసరత్తు

20150505180528-social-mediaఈ మధ్య అగ్రశ్రేణి తెలుగు పత్రిక యాజమాన్యం అస్మదీయుడు లేదా వీర విధేయులొకరు సోషల్‌ మీడియాపై విరుచుకుపడ్డారు. అదీ సోషల్‌ మీడియాలోనే! ఏమంటే టీవీ మీడియాకంటే ఇదే ఎక్కువ తప్పులు చేస్తుందట. వందల కోట్ల ఆస్తులు పెట్టుబడులు యంత్రాంగం వున్న బడా మీడియాకు వ్యక్తుల మీదుగా నడిచే(వ్యవస్తాగతమైనవి తీసేస్తే) సోషల్‌ మీడియాకు పోలిక ఏమిటి? ఇందులో కొంతమంది చెత్త రాస్తారు, కొందరు విద్వేషాలు రెచ్చగొడతారు, అసభ్య అశ్లీల పోస్టులు పెడతారు అన్నీ నిజమే గాని అది దాని ప్రధాన లక్షణం కాదు. ఒకరిద్దరు మీడియాధిపతులు లేదా ప్రభుత్వాధినేతలు అనుకున్నదే ఎజెండా కావాలటే పరిస్థితిని సోషల్‌ మీడియా మార్చేసిన మాట నిజం. ఇదే లేకపోతే కొన్ని అంశాలు అసలు చర్చకు వచ్చేవే కావు. అయితే కులం కోణం, సంఘ పరివార్‌ ఇస్లామిక్‌ చాందస వాదాలు, ఆంధ్ర తెలంగాణ వాదాలు అనేక సార్లు శ్రుతి మించి దుర్భర స్థితికి చేరుతున్న మాట నిజం. అది మెజార్టి ధోరణి కాదు, కొందరు పైత్య కారులు, తద్వారా తమ కెరీర్లు పెంచుకోవాలనుకునే వారు కాదంటే అపరిపక్వ మనస్కులు చేస్తున్నది మాత్రమే. సంఘ పరివార్‌ మాత్రం క్రమబద్దంగానే సోషల్‌ మీడియాను అదుపు చేస్తున్నది.అసలు మోడీ విజయంలో అదో ముఖ్య భూమిక పోషించింది.
అంతెందుకు? నన్ను ఈ తరగతి వారు దారుణంగా తిట్టేవారు. దీనిపై నేను కొన్ని చర్యలు తీసుకున్నాక ఆ శిబిరం నాయకులకు చెప్పాక మంత్రించినట్టుగా తగ్గిపోయింది. మంచిదే. దాన్ని బట్టి ఇదెంత నెట్‌వర్క్‌ గా పనిచేస్తుందో కూడా అర్థమవుతుంది.
ఇప్పుడు చెప్పదలుచుకున్నదేమంటే ఇతర పార్టీలు కూడా సోషల్‌మీడియాపై దృష్టి పెంచాయి. ప్రధానంగా తెలుగుదేశం చాలాచేస్తున్నది. తాము హైటెక్‌ గనక ఈ విషయంలో బాగా ముందున్నామని అనుకున్నారు గాని వాస్తవంగా వైసీపీ వారే పైచేయి అని టిడిపి వారి అధ్యయనంలో తేలిందట. అప్పటి నుంచి ‘చినబాబు’ ప్రోత్సాహంతో దీనిపై సన్నాహాలు పెంచారు. ఒక ఉన్నతాధికారి ఇందుకు వెన్నుదన్నుగా వుంటున్నారు. మరి ఈ కృషి ఎప్పుడు ఏఏ రూపాల్లో ప్రత్యక్షమవుతుందో చూడాలి.
టిఆర్‌ఎస్‌లో మంత్రి కెటిఆర్‌ మొదటి నుంచి సోషల్‌మీడియాను జాగ్రత్తగానే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య వర్షాల దెబ్బ తర్వాత సోషల్‌ మీడియా రాతలు ఆయనను బాగా కలతపెట్టాయని మీడియా మిత్రులు చెప్పారు. వ్యక్తులుగా టిఆర్‌ఎస్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో చురుగ్గానే వుంటారు గాని వారు ఒక విభాగానికే పరిమితం అయినట్టు కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వీరు కూడా ఈ రంగాన్ని ఇంకా విస్త్రతం చేయొచ్చు.
వామపక్షాలలో సిపిఎం విస్తారంగానే సోషల్‌ మీడియాలో కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే బిజెపి వ్యవస్థీకృత యంత్రాంగంతో పోలిస్తే ఇది బాగా పరిమితమే. రానున్న రోజుల్లో ప్రగతిశీల శక్తుల చొరవ ఈ రంగంలో ఇంకా పెరగొచ్చు. పాలకులు కూడా ఈ మేరకు తమ నిఘాను నిర్బంధాన్ని కూడా పెంచుతున్నట్టు కనిపిస్తుంది. సోషల్‌ మీడియా పోస్టింగులకు అరెస్టులు చేయడం కేసులు పెట్టడం వంటివి కూడా జరిగాయి. ప్రభావం పెరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా వూరుకోవు గదా! ఇక్కడా భావ సంఘర్షణ అనివార్యం.
సామాజిక కోణంలో చూస్తే సోషల్‌ మీడియాలో యువత కన్నా నడి వయస్కులు వృద్ధుల పాత జ్ఞాపకాలు పెరిగిపోతున్నాయనే ఫిర్యాదు కూడా బలంగా వుంది. అలాగే కుటుంబాల వ్యవహారంగానూ మార్చేస్తున్నారు. ఎవరి అభిరుచి వారిదైనా సోషల్‌ స్వభావాన్ని కాపాడుకోవడం ముఖ్యమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *