స్త్రీ వ్యతిరేక శ్లోకాలతో సంస్కారానికే ‘సవాల్’.. నమస్తే!

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల విభజనాంతర పర్వంలో రాజకీయ నేతలు వ్యాపారవేత్తలూ సామాన్య ప్రజలూ సహజంగానూ సర్దుబాటు ధోరణిలోనూ వ్యవహరిస్తున్నారు. ఈ మూడు తరహాల వారూ తమ బతుకేదో భవితేదో తాము చూసుకుంటున్నారు గనక పేచీ వుండదు. ఎటొచ్చి పరాన్నభుక్కు పండిత్మన్యులకూ కృత్రిమావేశిత బుద్ధిజీవులకూ మాత్రం అనుక్షణం అభద్రత వెన్నాడుతుంటుంది. సమస్యలు ఎలాగూ వుంటాయి. గతంలోని వాద వివాదాలు అంత త్వరగా పోవు, పోనివ్వరు కూడా. అయితే కొంతమంది మేధావులూ లేదా ఆ బిరుదాంకితులూ భాషా భిషక్కులూ అటూ ఇటూ కూడా ఈ తేడాలను లేదా వివాదాలనే పెద్దవి చేస్తూ పాత గాయాలు రేపాలని చూడటం దారుణం.ఇదే తమ వునికికి మూలం అని వారు భ్రమలోనో లేక అజ్ఞానంలోనో వున్నారు. ఆ క్రమంలో ప్రాంతాలకూ కాలానికి కూడా అతీతమైన కనీస సంస్కార గుణాన్ని విస్మరించడ ఇంకా ఘోరం.
యాదాద్రి (నిజానికి అచ్చమైన యాదగిరి) అభివృద్దికోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద చూపడంపై ఎవరో ఎగతాళిగా పోస్లు రాశారట. దానిపై నమస్తే తెలంగాణలో సవాల్ రెడ్డి(నిజానికి వీరి అసలు పేరు కూడా ఈ మధ్యనే ఆ పత్రికలో రాశారు) దీనిపై ఆగ్రహంతో నిప్పులు కక్కారు. అర్థం చేసుకోవచ్చు. నేను కూడా యాదాద్రి అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రి నెత్తిన వేసుకోవడం కన్నా మత ధార్మిక సంస్థల నిర్వహణ మరెవరికన్నా అప్పగించడం మంచిదని తెలకపల్లిరవి.కామ్‌లో రాశాను. కాని సవాల్ రెడ్డి ప్రస్తావించిన పోస్టు రచయిత ఎవరో కెసిఆర్ చర్యలను చౌకబారుగా అపహాస్యం చేశారట. తప్పక ఖండించాలి. ప్రాంతాలనూ అందులోనూ విశ్వాసాలను ఎవరూ ఎగతాళి చేయకూడదు.( ఆ వ్యాఖ్య రాసింది ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అని ఈ పోస్టుపై ఆగ్రహ స్పందనలో పాత్రికేయ మిత్రుడు బుద్దా మురళి తెలియజేశారు.వారికి ధన్యవాదాలు. నేను ఒరిజినల్ చూడలేదు, ఆ నేను ఆ వ్యాఖ్యతో మొదటే ఏకీభవించ లేదు గనక వివరాలు అవసరం కూడా లేదు.)
కాని ఇందుకోసం సవాల్‌రెడ్డి ఎంచుకున్న ప్రయోగం మరింత దారుణంగా వుండటం ఆశ్చర్యకరం. తన రివాజు ప్రకారం సంసృత శ్లోక చరణాలను ఉటంకించినంత మాత్రాన సారాంశం ఏమైపోతుంది? ఉద్దేశం ఎక్కడ దాగుతుంది? నవవైధవ్య మసహ్స వేదనం .. అన్న చరణాన్ని ఆయన శీర్షికగా ఎంచుకోవడం.. ప్రచురించడం అనుచితం. ప్రారంభదశలో వైధవ్యం దుర్భరంగా వుంటుందని దీని అర్థం విప్పి చెప్పారు మొదట్లోనే. శిరోముండనం ఇత్యాదులనూ ప్రస్తావించారు. చట్టబద్ద హెచ్చరికలాగ ‘సరే కాలం మారింది.. నాగరికత నూతన విలువలు తేవడంతో ఈ సామెతకూ ఈ సామెతకు కాలం చెల్లింద’ని ముక్తాయించిరు తప్ప దాంతో విడగొట్టుకుంది గాని గట్టిగా ఖండించింది గాని లేదు. అసలు మహత్తర తెలంగాణ ప్రజా సంసృతిలో ఈ కాలం చెల్లిన సంస్కార హీన సంసృత శ్లోకం తప్ప తమకు సందర్భోచితమైన మరో లోకోక్తి కానుడి దొరకలేదా ? కొత్తగా వితంతువులు కావడమంటే ఆవేదన శోకం గాక అసహ్యం అనడంలో మానవత్వం ఏ కోశానైనా వుందా? సాహిత్యంలో మంచి పట్టున్న కెసిఆర్ గాని, అభ్యుదయ విలువలలో పెరిగిన సంపాదకులు శేఖర్‌రెడ్డి గాని ..జాగృత ఎంపి కవిత గాని దీన్ని ఆమోదించరనే నా నమ్మకం. అటూ ఇటూ బుద్ధిజీవులు నోరు పారేసుకోకుండా బుద్దిగావుంటే మంచిదని సలహా.(ఉచితంగానే) ప్రజలూ ప్రజా నాయకులూ అన్నిటినీ మించి చరిత్ర చేయాల్సింది చేస్తుంది. యత్రానార్యంతు పూజ్యంతే.. అన్నట్టు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్‌లోనూ వారిని గౌరవించవలసిందే.బండెనక బండి గట్టి అంటూ మట్టి మనుషులతో మహత్తర సమరగానం చేయించిన తెలంగాణ గడ్డమీద కాలం చెల్లిన ఈ సంసృత శ్లోకాల దట్టింపు ఎంత తగ్గిస్తే అంత మంచిది.వాటిని మరేదైనా వేదికపై చూసుకోవచ్చు. కాపాడుకోవచ్చు. ప్రజాసంసృతి స్థానే పండిత సంసృతిని ప్రతిష్టించనవసరం లేదు. ఇలాటి అసందర్భ ప్రాచీన భావాల ప్రవాహం తరచూ కనిపిస్తున్నా ఇప్పుడు మరీ శ్రుతి మించినందున చెప్పకతప్పడం లేదు.(మళ్లీ శ్రమపడి వ్యాఖ్యానించే అవసరం లేకుండా ఒక విషయంలో ఇబ్బందిని మనవి చేస్తున్నా. కంప్యూటర్ టైపింగులో రుత్వం క వత్తు రెండూ కలిపి ఒకేసారి ఇచ్చే శక్తిలేక సంసృతం అంటూ రుత్వంతోనే సరిపెట్టాను. భాషా వేత్తలు క్షమింతురు గాక. నేనెటూ పండితుణ్ని కాదు.)