మధుపై పోలీసు జులుం – సిఎం స్పందన,మీడియా నివేదన ఏదీ?
పెనుబల్లి మధు సిపిఎం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. స్వతహాగా సమరశీల స్వభావం గనక సమస్య ఎక్కడున్నా రంగంలోకి దిగిపోతుంటారు. ఇది ప్రభుత్వానికి ఇరకాటం కావచ్చు గాని అంతమాత్రాన ఆయనపై ప్రతిచోటా పోలీసులను ఉసిగొల్పటం, స్టేషన్ల చుట్టూ తిప్పడం, పిడిగుద్దులు గుద్డడం, ఈడ్చుకుపోవడం ఏం ప్రజాస్వామ్యం? ఒక పార్టీ రాష్ట్రకార్యదర్శిపైనే పదేపదే ఇలా ప్రవర్తించడాన్ని ప్రభుత్వం అనుమతిస్తే సామాన్యులకు రక్షణ వుంటుందా? మధు లేదా సిపిఎం విధానాలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అందులో స్వార్థం వుందని ఆరోపించలేరు. ప్రజల కోసమే ఆ ఉద్యమాలు జరుగుతాయని ప్రత్యర్థులూ శత్రువులు కూడా అంగీకరిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టులు గట్టిగా పోరాడాలని కోరుతుంటారు. భూసేకరణపై గాని కంపెనీలకు భూదత్తంపైన గాని ఎక్కడ ఉద్యమాలు వచ్చినా అణచిపారే
యవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఆదేశాలచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఉద్యమాలతో అభివృద్ధికి అడ్డుపడేవారంతా ఉన్మాదులని ఆయన ధ్వజమెత్తారు కూడా. ఇవన్నీ నిజమే కావచ్చు గాని రాష్ట్ర స్థాయి నాయకులపై స్థానిక పోలీసులకు ఇష్టారాజ్యం నిర్బంధానికి అనుమతినిచ్చేయడం దారుణం. అప్రజాస్వామికం. కనీసం ఇలాటి వార్తలు వచ్చిన తర్వాతనైనా జోక్యం చేసుకుని సంయమనం పాటించాలంటూ సర్దుబాటు చేయవలసిన బాధ్యత వుంటుంది. నిజానికి కాంగ్రెస్ పాలనలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్నప్పుడు అనేక ఉద్యమాలను సిపిఎం తరపున మధు, అప్పటి సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వంటి వారితో సమన్వయం చేసుకోవడం నిరంతరం సంబంధాలు పాటించడం నాకు తెలుసు. ధర్నాలు, బంద్‌లు జరిగేవి కూడా. అలాటిది అధికారం వచ్చినంత మాత్రాన అభిప్రాయాలు విధానాలు వేరైనంత మాత్రాన ఇష్టానుసారం పోలీసు దౌర్జన్యానికి పాల్పడితే ఫలితాలు నష్టదాయకంగా వుంటాయని గ్రహించడం అవసరం. 2000 విద్చుచ్చక్తి ఉద్యమంపై అణచివేత పలితాలు ఇప్పటికి ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు ఆ భూసేకరణ విధానాలు ఇంకా తీవ్రమై వూరూరా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వీటిపై ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూడా పాదయాత్రలు పర్యటనలు చేశారు. కాడిగట్టి దున్నారు. అవే ఉద్యమాలు ఇప్పుడు మహాపరాధంగా ఉన్మాదంగా మారిపోతాయా? రైతాంగ సమస్యలపై చంద్రబాబు నిరాహారదీక్షను ప్రభుత్వం అప్పటి కిరణ్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఢిల్లీ నుంచి ప్రకాశ్ కరత్ తదితరులు వచ్చి విరమింపచేశారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి ఈ నిర్బంధ విధానాలు విరమించడం శ్రేయస్కరం.
ఇక కొన్ని మీడియూ సంస్థలూ పత్రికలూ మధు అరెస్టు వామపక్షాల నిరసన వార్తను జిల్లా (లేడా జోనల్) స్థాయికి కుదించేశారు. రాజధానిలో కొన్ని పత్రికల్లో ఆ వార్తకు అంగుళం కూడాచోటు లభించలేదు. కొంతమంది నేతలు కాలు కదుతామని సూచన ఇవ్వగానే మొదటి పేజీ ముంచెత్తే ఈ పత్రికలూ ప్రైమ్‌టైమ్ కేటాయించే ఛానళ్లు కాస్తయినా వాస్తవికంగా ఆలోచించుకోవా?తమపై ఏ దాడి జరిగినా మీడియా స్వాతంత్రంపై దాడిగా పరిగణించేవారికి చరిత్ర కలిగిన ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శిపై ఇంత దౌర్జన్యం జరిగితే స్తానిక వార్తగా మాత్రమే కనిపిస్తుందా. ఈ ద్వంద్వనీతిని విడనాడకపోతే రేపు ఏ తేడా వచ్చినా మీడి
యా కూడా ఇదే స్థితిని ఎదుర్కొవలసి వస్తుంది. అన్నిటినీ మించి ప్రజలకు నిజాలు చెప్పవలసిన బాద్యతకు అన్యాయం జరుగుతుంది. దీనిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని డిజిపి సాంబశివరావు సిపిఎం నేతలకు హామీనిచ్చారు గనక నిజంగా స్పందిస్తారేమో చూద్దాం…
