మరో రెండేళ్లు సినిమాల్లోనే పవన్

ప్రత్యేక హౌదా సమస్యపై బిజెపి టిడిపిల పట్ల విమర్శనాత్మకంగా మాట్లాడినప్పటికీ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మరో రెండేళ్ల వరకూ రాజకీయ కార్యాచరణలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అప్పుడైనా ఏం జరుగుతుందనేది అప్పటికి జరిగే పరిణామాలను బట్టి నిర్ణయవుతుంది.తిరుపతి కాకినాడ సమావేశాల్లో కాస్త నిశిత విమర్శలూ వ్యాఖ్యలూ చేయడం ఆయన అభిప్రాయ ప్రకటన తప్ప ఆచరణకు సూచిక కాదని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఇటీవల ఒక ఛానల్ మిత్రుడు పవన్‌ను ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆయన సన్నిహిత నిర్మాత ్ సూచన మేరకు తదుపరి సినిమా షఉటింగు ఎప్పుడు అని అడిగితే త్వరలోనే అని జవాబిచ్చారాయన. కాకినాడ సభలోనైతే నేను సినిమాల్లో నటించాలా వద్దా అని ప్రేక్షకులనే అడిగారు.అక్కడ వున్నవారిలో ఆయన యువ అభిమానులే అత్యధికులు గనక అందరూ సానుకూల సమాధానమే ఇచ్చారు.తను ఖర్చులు సిబ్బంది జీతాల వంటి వాటికోసం నటించి సంపాదించకతప్పదన్నట్టు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు నేరుగానే చెబుతున్నారు. తన దగ్గర దబ్బులు లేవనీ, అప్పులు తీర్చాలనీ కూడా మరే హీరో చెప్పని విధంగా ఆయన చెబుతుంటారు.
కాకినాడ సభలోగాని ఆ తర్వాత గాని ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటో ప్రకటించలేదు. ఇతర ప్రధాన పార్టీలు కదలకపోతే తాను రంగంలోకి వస్తానన్నట్టు మాట్లాడారు. రాజకీయ రంగంలో ఈ తరహా వ్యాఖ్యలకు పెద్దగా విలువుండదు. మీరు చేసేదేమిటో మీరుచెప్పాలి గాని ఇతరులు ముందు చేయాలనీ, లేకపోతే నేను వస్తానని అంటే చెల్లుబాటు కాదు. ఎవరి కార్యాచరణ వారిది. ఆ రోజున పవన్ వామపక్షాలను మరీ ముఖ్యంగా సిపిఎంను అభినందించారు. ఆ కారణంగానే వారు ఆయనను బలపరుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. వాస్తవానికి తర్వాత వారిలో కొందరిని నేను కలిసినప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నారని అడిగారు. బి.వి.రాఘవులు బహిరంగంగానే ఆయన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఆర్కె కొత్తపలుకులో దీన్ని అన్యాపదేశంగా అపహాస్యం చేశారు కూడా.
కాకినాడ సభ తర్వాత బిజెపి టిడిపి నాయకులు పవన్‌పై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. వెంకయ్య నాయుడు విసుర్లు విసిరారు. గతంలో నేను కూడా చూడప్పా సిద్దప్పా డైలాగును అనుకరిస్తూ సినిమాలో రాజకీయాలో తేల్చుకోవాలని అన్నప్పుడు చాలా మంది మెచ్చుకోవడం నొచ్చుకోవడం జరిగింది. అది పవన్ ప్రశ్నిస్తానంటూనే చంద్రబాబును ప్రశంసిస్తున్న దశ. గత రెండు సభల్లోనూ ఆయన నిజంగానే ప్రశ్నించారు గనక దాన్ని సానుకూల పరిణామంగా విశ్లేషించాను. అయితే ఆయన వ్యక్తిగత నేపథ్యం, బయిట రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి దూకేస్తారనుకోలేదు. అయితే ఇటీవల మరింత స్పష్టంగా తాను రెండేళ్ల పాటుసినిమాలు చూసుకుని ఆ తర్వాతే రాజకీయ కదలికలు మొదలు పెడతానన్నట్టు ఆయన సహాయకులతో సంప్రదింపులు జరిపినవారు చెప్పారు.కాబట్టి ప్రస్తుతానికి విశ్రాంతి అనుకోవలసిందే. ఏదైనా విపరీతం జరిగితే తప్ప! ఇది ఆయన విమర్శకులకు, ప్రేక్షకాభిమానులకు సంతోషం. రాజకీయ అభిమానులకు నిరుత్సాహం కలిగించవచ్చునేమో గాని అంతకన్నా భిన్నంగా జరుగుతుందని వూహించలేము.