పాక్‌పై ఇండియా ‘నాలుగో అడుగు..’

మొత్తంపైన మోడీ ప్రభుత్వం అనుకున్నట్టుగానే పాకిస్తాన్‌పై ఒత్తిడి దశనుంచి సీమాంతర దాడుల దశకు వచ్చింది. స్పష్టంగా గుర్తించిన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి నివారణ దాడులు(సర్జికల్ స్ట్రైక్స్) నిర్వహించామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డిజిఎంవో) రణవీర్ సింగ్ విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్‌తోకలసి అధికారికంగా ప్రకటించారు.ఆ మేరకు తీవ్రమైన దాడులు కూడా జరిగాయి. బహుశా ఇవి మరింతగా కొనసాగుతాయి. వూహించినట్టే పాకిస్తాన్ ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదని తమ భూభాగంపై దాడులనేనని ఖండించింది. ప్రధాని మోడీ వాస్తవాధీన రేఖ దగ్గర పరిస్థితిని సమీక్షించగా పాకిస్తాన్‌లోనూ ఆ తరహా సమావేశాలు జరిగాయి. ఇది భారత దేశపు నాలుగో అడుగుగా చెప్పాలి
నేరుగా యుద్ధ ప్రకటన అన్నసూచనను నిరాకరించిన ప్రభుత్వం దౌత్యపరమైన ఓత్తిడి పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సింధుజలాల ఒప్పందాన్ని పక్కకు పెట్టడం మొదటి అడుగుగాచెప్పాలి.1960 సెప్టెంబరులో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం తూర్పుగా ప్రవహించే రావి బియాస్‌సట్టెజ్ వాటి ఉపనదులు నీళ్లన్నీ ఇండియాకు కేటాయించగా పశ్చిమానికి వెళ్లే సింధు జీలం చీనాబ్‌ల నీరు పాకిస్తాన్‌కు కేటాయించారు. అయితే మొత్తంపైన 80 శాతం పైగా నీరు పాక్‌కే వెళుతుంది. భారత దేశం పరిమితంగానే ఈ నీరు వాడుకోవడానికి అవకాశముంది. ఇది చాలా ఉదారమైన నదీజల ఒప్పందంగా వర్ణిస్తుంటారు. దీనికోసం ఒక కమిటీ వున్నా ఆ అవసరం లేకుండానే భారతదేశం అమలు చేస్తున్నది.ఇప్పుడు దాన్ని నిలిపివేయడం పెద్ద కుదుపు. ఈ నిర్ణయం యుద్ద ప్రకటనతో సమానమని పాక్ వ్యాఖ్యానించింది. మధ్యవర్తిగా వున్న ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది.
అంతకంటే కీలకమైంది పాక్‌లో జరగవలసిన సార్క్ సమావేశాన్ని బహిష్కరించడం. నేపాల్,బంగాల్లదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇదే నిర్ణయం తీసుకోవడంతో సార్క్ నిలిచిపోయింది. ఇది అంతర్జాతీయంగా పాక్‌కు చాలా పెద్ద దెబ్బ
పాక్‌కు వున్న అత్యత అనుకూలదేశం హౌదా(ఎంఎప్‌ఎన్)ను రద్దు చేసే విషయమై సమీక్ష జరుగుతున్నది.ఈ సమావేశం కాస్త వాయిదా పడినా ఆలోచనల్లో మార్పు లేదు. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్యమే తక్కువ గనకు దీని ప్రభావం పెద్దగా వుండదు. పాక్ సినిమా రంగానికి మాత్రం చాలా నష్టం.అమెరికా కూడా ఇండియాకు మద్దతు తెల్పితే అప్పుడు నిజంగా పెద్ద నష్టం.కాని అలా జరిగే సూచనలు లేవు
ఈ చర్యల సంకేతాన్ని గ్రహించి పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటే దానికీ మనకూ కూడా మంచిది. అలాగాక ఘర్షణ పెరిగితే ఇద్దరికీ నస్టమే.