కార్పొరేట్‌లకు చేయూత- ప్రభుత్వ సంస్థల మూత

రాజకీయ ప్రచారార్బాటం ఎలా వున్నా ప్రజల ఆర్థిక పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయి. ఆర్థిక సంస్కరణల రజతోత్సవం పేరిట హడావుడి చేస్తున్నా వాటి కారణంగా అసమానతలే పెరిగాయని అందరూ అంగీకరించకతప్పడం లేదు. ప్రపంచవ్యాపితంగానే ఒక్క శాతం మహాసంపన్నులు యాభై శాతం పైగా సంపదలు కలిగివున్నారని ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో పేర్కొన్న వాస్తవమే ఇందుకు నిదర్శనం. విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి శ్యామ్ సరణ్ ఒక ఆర్థిక పత్రికలో దీనిపై వ్యాసం రాస్తూ ప్రపంచీకరణ వైఫల్యం వల్ల అసంతృప్తి పెరిగిపోతున్నదని హెచ్చరించారు.ఇది ప్రపంచీకరణ యుగం గనక దేశంలోనే గాక ప్రపంచవ్యాపితంగానూ ఈ దుష్ప్రభావాలు గోచరిస్తున్నాయి. . కొంతమంది త్వరగా సంపన్పులైతే మిగిలిన వారు ఆలస్యంగానైనా ఆ జాబితాలో చేరతారన్న గతంలోని భ్రమలు కూడా ఇప్పుడు తొలగిపోతున్నాయి.ఎందుకంటే ఈ సంపదలశిఖరాలు చేరుకుంటున్నవారు అక్రమ మార్గాల వల్ల, అశ్రితపెట్టుబడిదారీ విధానం వల్ల, అవినీతి వల్ల తప్ప న్యాయమైన మార్గాల్లో పెరుగుతున్నది లేదని అనేక వికృత కుంభకోణాలు వెల్లడించాయి. మన దేశంలో విజరు మాల్యా, సుబ్రతో ముఖర్జీ(అంతకు ముందు సత్యం రామలింగరాజు..) నుంచి బ్యాంకు బకాయిలు ఎగవేసిన ఘరానా బాబుల కథలు వెగటు పుట్టిస్తున్నాయి. అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఈఅవినీతి బురదలో కూరుకుపోయి ఆఖరుకు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న తీరు నిన్ననే బన్సాల్ కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకున్న ఘటనలో చూశాం. ఇదేగాక వివిధ వ్యాపారాలు క్రీడలు ఆధ్యాత్మికతలతో సహా అన్నిటా అవినీతి తాండవించడం అసహ్యం కలిగిస్తున్నది. రాజకీయాల్లోనైతే సరేసరి. ఎన్నికల పోటీ నుంచి దైనందిన వ్యవహారాల వరకూ అణువణువునా అవినీతి పొంగిపొర్లుతున్న స్థితి. ఇందుకోసం నయీం వంటి కిరాయి హంతక ముఠాలను పోషిస్తున్న స్థితి.ప్రభుత్వాధికారులే గాక వోక్స్‌వ్యాగన్, ఎజిలతో సహా అనేక బహుళజాతి కంపెనీల సిఇవోలు బోనెక్కి నిల్చున్నారు. నరేంద్ర మోడీ అధికారంంలోకి వచ్చాక అవినీతి కుంభకోణాలు జరగలేదని చెబుతున్నారు గాని అప్పుడే తుదిమాట చెప్పడానికి లేదు. రెండవది వీటన్నిటికీ మహారాజ పోషకులుగా వున్న కార్పొరేట్ బాబులే ఇప్పుడూ అధికార సౌధాల్లో అగుపిస్తూనే వున్నారు.నల్లడబ్బు బయిటపెట్టడం గురించిన కబుర్లు కల్లలుగానే మిగిలిపోయాయి. .పైపెచ్చు ఇప్పుడు బ్యాంకు బకాయిల విషయంలోనూ ఎలాగో బయిటపడేసే మార్గాలు వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. కార్పొరేట్లకు రాయితీల వాన కురిపించడమే గాక స్వయానా ప్రధాని మోడీ ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి అంబానీ ప్రచారక్‌గా మారిపోయినట్టు జియో అడ్వర్టయిజ్‌మెంటుకు తన ఫోటో వాడకానికి అనుమతినిచ్చారు.
ప్రజలూ ప్రభుత్వ సంస్థలపై దాడి
అపర కుబేరులను అక్రమార్జనా పరులను ఇంతగా కాపాడుతున్న ఈ ప్రభుత్వం స్వయంగా తన ఆధ్వర్యంలోని ప్రజోపయోగ వ్యవస్థల పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. ఈ వారం 15 ప్రభుత్వ సంస్థల మూతకు రంగం సిద్దం చేసింది. వైద్య రంగాన్ని బాహాటంగా ప్రైవేటు పరం చేసేందుకు బాట వేసింది.ఆఖరుకు దేశానికే ప్రతిష్టాత్మకమైన రైల్వే వ్యవస్థకే మంగళం పాడేందుకు వీలుగా రైల్వే బడ్జెట్ ప్రక్రియకు స్వస్తి పలికింది. లక్ష కోట్ల పైబడిన పెట్టుబడులతో దేశమంతా విస్తరించిన ఈ అతి పెద్ద వ్యవస్థను ప్రజోపయోగ కోణంలో నడపకుండా ప్రైవేటుకు కట్టబెట్టడం కోసమే ఈ విధాన పరమైన మార్పు తీసుకొచ్చింది. అది కూడా పార్లమెంటులో చర్చ లేకుండా అధికార ఉత్తర్వుగా అమలు చేయడం మరింత అన్యాయం. ఇకపైన రైల్వే మార్గాలు కావాలని అడగడం గానీ, ఛార్జీల పెంపుదలను వ్యతిరేకించడం గాని సాధ్యపడదు. గతంలో విభాగాల వారిగా అమలు చేస్తున్న ప్రైవేటు పంథా ఇక మొత్తాన్ని ప్రైవేటు పట్టాలెక్కిస్తుందన్నమాట. నిధుల కొరత, లోటు వంటి అనేక కారణాలు చూపిస్తున్న ప్రభుత్వం దాని విధాన కర్తలు రైల్వేలకు వున్న అపారమైన యంత్రాంగాన్ని ఆస్తులనూ ఎందుకు ప్రజలకు మేలు చేసే దిశలో వినియోగించడంలేదో అర్థం కాదు. స్టేషన్లనే ప్రైవేటు పరం చేస్తూ ఇప్పుడు వ్యవస్థకే తిలోదకాలిస్తున్నారు