రాజీనామాల బ్రహ్మాస్త్రాలూ, వాస్తవాలు

వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రత్యేక హౌదా సమస్యపై అవసరమైతే ఆఖరి దశలో తమ సభ్యులు రాజీనామాలు చేసేందుకు వెనుకాడరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాక్షి దాన్ని ఉపశీర్షికగా ఇచ్చింది తప్ప ప్రధానంగా తీసుకోలేదు. నిన్న విజయవాడలో వేరే సమావేశంలో వున్నందువల్లదీనిపై స్పందించలేదు గాని మిత్రులు చాలా మంది అడిగారు.
ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలోనూ తర్వాత కూడా రాజకీయ నేతలు బ్రహ్మాస్త్రం గురించి మాట్లాడ్డం వింటున్నాం. వాటిలో తాజాగా గుర్తున్నది. మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ దగ్గర బ్రహ్మాస్త్రం వున్నదని చెప్పడం.(కెసిఆర్ కూడా ఎప్పుడన్నా అన్నారో లేదో నాకు గుర్తులేదు. కాని 2008లో వారి సభ్యులు మొదటి సారి రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్‌కు మరణశాసనం అని ఆయన ప్రకటిస్తే ఎలా అని నేను అడగడం మాత్రం గుర్తుంది. సాహిత్యం బాగాచదువుకున్నాను గనక ఇలాటి పదాలు వాడుతుంటానని మరీ యథాతథంగా తీసుకోనవసరం లేదని ఆయన జవాబిచ్చారు) బాగా ప్రచారం పొందింది. అయితే అది భ్రమాస్త్రం అయిపోవచ్చని నేను అంటుండేవాణ్ని. శాసనసభలో విభజన తీర్మానాన్ని తిరస్కరిస్తూ మరో పోటీ తీర్మానం చేయడం బ్రహ్మాస్త్రమని ఆయన గాని తనతో వున్నవారు గాని అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందో చూశాం. అలాగే కెసిఆర్ చెప్పిన మరణశాసనం కూడా కాంగ్రెస్‌కు ఎదురుకాలేదు.అందుకు బదులుగా టిఆర్‌ఎస్ చాలా స్తానాలుకోల్పోవడం కెసిఆర్ రాజీనామా ప్రహసనం, అందరిఒత్తిడి పేరిట వెనక్కు తీసుకోవడం జరిగిపోయింది.
నిజానికి పవన్ కళ్యాణ్ కాకినాడ సభలోనే ఈ సమస్యలేవనెత్తారు. ప్రత్యేక రాష్ట్రం కోసం టిఆర్‌ఎస్ వారు వారు రాజీనామాలు చేసినట్టే ప్రత్యేక హౌదాకోసం ఎపిలో రాజీనామాలు చేయాలన్నది ఒక వాదన. జగన్ జాగ్రత్తగా తుది దశలో చేసే విషయం ఆలోచిస్తామని మాత్రమే చెప్పారు.ముందే చేస్తే సభలో మాట్లాడే అవకాశం వుండదని కూడా జోడించారు. ఆయనే అంత ఆచితూచి మాట్లాడుతుంటే అప్పుడే రాజీనామాలు చేసేస్తున్నట్టు హడావుడి పడాల్సిన అవసరం లేదు. రెండవది టిఆర్‌ఎస్‌వారి రాజీనామాలు 2008లో చేస్తే ఫలితం ప్రతికూలంగా వుంది. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు తొలి ప్రకటనచేసిన తర్వాత దశలో పదే పదే గెలుస్తూ వచ్చారు. అదో ప్రత్కేక పరిస్థితి. ఆ దశలో వైసీపీలో చేరినవారు కూడా ఉప ఎన్నికల్లో ఘన విజయాలే సాధించారు. ఇప్పుడు ఆనాటి టిఆర్‌ఎస్ పరిస్థితి మాదిరిగా గాని వైసీపీ పరిస్థితి మాదిరిగా గాని లేదు. కేంద్రం స్పష్టంగా హౌదా నిరాకరించింది. దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వున్నాయి గాని బిజెపి టిడిపి సీనియర్ నాయకులు పనిగట్టుకుని అవాస్తవ ప్రచారాలు చేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. ఇలాటి స్తితిలో వైసీపీ రాజీనామాలతో రంగంలోకి వస్తుందని భావించలేము. జగన్ వ్యూహాత్మకంగా చివరి ఆరునెలల వ్యవధిలో అలాటి నిర్ణయం తీసుకోవచ్చు. ఈలోగా సవాలు విసిరిన పవన్ కళ్యాణ్ గట్టిగా రంగంలోకి వస్తారా లేక సినిమాల్లో మునిగివుంటారా అన్నది కూడా చూడవలసిందే. ఇప్పటికిప్పుడైతే రాజీనామాలు చేయడం కాదు కదా ఆ ఆలోచన కూడా చేయబోరనేది స్పష్టం.