మొన్నరెగ్యులరైజేషన్‌,నేడు డిమాలిషన్‌! జరిగేదేనా?

a546429801730521122823137420932

హైదరాబాదులో ఆ మాటకొస్తే తెలంగాణ మొత్తంలో ఏ సమస్య వచ్చినా గత పాలకులను విమర్శించడం,ఇంకా అవసరమైతే సమైక్య పాలనమీదకు నెట్టేయడం రివాజు. రాజకీయంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు గాని తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆద్వర్యంలో జరిగిన నిర్ణయాలు పొరబాట్ల మాటేమిటి? ఇటీవల ఎడతెగని వర్షాల దెబ్బకు నగరం విలవిలలాడితే అంతా గతం పాపం అనడం ఒకె గాని వర్తమానానికి బాధ్యత ఎవరు మోయాలి? హైదరాబాదులో కెటిఆర్‌,నీటి ప్రాజెక్టుల విషయంలో హరీష్‌ రావు ఇద్దరు యువ నేతలు సంతృప్తికరంగా తమ పనులు చేశారనే కెసిఆర్‌ భావిస్తున్నారా? లేకపోతే వారికి లోలోపలైనా హితబోధ చేశారా? మలిదశలో వారు కదలడానికి అదే కారణమా?
అది అలా వుంచి స్వయంగా కెసిఆర్‌ ప్రకటనలు చూద్దాం. 60ఏళ్లలో ప్రతిపక్షాలు(అంటే కాంగ్రెస్‌ తెలుగుదేశం) నగరాన్ని నాశనం చేశాయని విమర్శించడం బాగానే వుంది. పాలించింది వాళ్లే గనక పడవలసిందే. ఆ పాలక వ్యవస్థలో ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా చాలా మంది భాగస్వాములుగా వుండటమే గాక ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఘనాపాటీలు చాలా మంది వచ్చి ఈ వ్యవస్థలో భాగమయ్యారు. వారినీ వదిలేద్దాం.
2015 నవంబరులో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున హైదరాబాదులో బిల్లిండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(బిఆర్‌ఎస్‌) అమలు చేసింది. లే ఔట్ల క్రమబద్దీకరణకు 68,772, భవనాల క్రమబద్దీకరణకు 1,31,095 దరఖాస్తులు వచ్చాయి.వీరినుంచి 157 కోట్ల రూపాయలు వసూలైంది. ఇప్డుడు ముంపునకు గురైన కుకట్‌పల్లి,నిజాం పేట, అమీర్‌పేట, వంటి చోట్ల నుంచి అ త్యధికంగా ఇది జరిగింది. ఈ విధమైన విచక్షణా రహిత క్రమబద్తీకరణ మంచిది కాదని పర్యావరణ సంస్థలు హెచ్చరించాయి. కాని బహుశా జిహెచ్‌ఎంసి ఎన్నికల అవసరాల ముందు అవన్నీ చెవికెక్కలేదు. 2016 ఫిబ్రవరిలో ఆ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత కొంత కాలం వూపు కోసం 100రోజుల ప్రణాలికలు వగైరా ప్రకటించినా జరిగింది లేదు. ఇటీవల వర్షం దాడి ఆగ్రహావేదనలు మిగిల్చింది.
ఇప్పుడు నాలాల ఆక్రమణ ఇతర సమస్యలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బహుమానం ఇస్తామని జిహెచ్‌ఎంసి ప్రకటించింది గాని ఇన్ని లక్షల మంది దరఖాస్తుదారులుంటే ఎవరు ఎవరిపై ఫిర్యాదు చేస్తారు? ఈ భవన నిర్మాతలు పాలక పక్షంతో బొత్తిగా సంబంధాలు లేని వారిని కూడా చెప్పలేము. నగరంలోనే ప్రథమ శ్రేని నిర్మాణ సంస్థల అధినేతలతో వున్న అనుబంధాలూ అందరికీ తెలుసు. ప్రభుత్వం రాగానే అయ్యప్ప సొసైటీలో కూల్చివేత ప్రారంబించి ఆపేసింది.అప్పట్లో అడ్డుకుని అరెస్టయిన వారిలో ఒకరు అరికెపూడి గాంధీ ఇప్పుడు టిఆర్‌ఎస్‌లోనే వున్నారు. అక్కినేని నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌పై బోలెడు హడావుడి జరిగి చప్పునసీన్‌ మారిపోయింది. ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే సర్దుకోవచ్చని కెసిఆర్‌ స్వయానా ఒక సినిమా వేడుకలో చెప్పారు.సో… ఇప్పుడు కిర్లోస్కర్‌ కమిటీ 27 వేల అక్రమ నిర్మాణాలంటూఇచ్చిన నివేదికను ఇప్పుడు ప్రస్తావిస్తూ అడ్డంకులన్నీ కూల్చివేస్తామని చెప్పడం కూడా ఆరంభ శూరత్వం
గానే ముగిసే అవకాశం చాలా ఎక్కువ. కాదు నిజంగా ఏదైనా సమూలంగా ప్రక్షాళన చేయాలంటే సమగ్రంగా చర్చించి పరిశీలించి ముందుగా ప్రకటించి చేయాలి తప్ప మీడియా గోష్టుల్లోనూ సమీక్షా సమావేశాల్లోనే ప్రకటించి ఒకటి రెండు కూల్చివేతలు చూపిస్తే అయిపోదు. చెప్పాలంటే లేనిపోని హడావుడి కంటే అర్థవంతమైన ఆచరణ అవసరం. అనేక అడుగులు పడితే గాని ఆ విధమైన విశ్వాసం కలగదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *