మీరూ చూసుకోవద్దా హరీష్‌జీ?
హైదరాబాదులో వర్షాల దెబ్బ మునిసిపల్,ఐటి మంత్రి కెటిఆర్‌పై విమర్శలకు దారితీస్తే మిడ్ మానేరుకు గండి పడటం నీటిపారుదలశాఖా మంత్రి హరిష్ రావు పాత్రను విమర్శాపాత్రం చేసింది. అధిక వర్షాలు, అధికారుల నిర్లక్ష్యం వంటి మాటలు ఎన్ని చెప్పినా ఇంత పెద్ద ఉపద్రవానికి అవకాశం వుందని అప్రమత్తంగా వుండకపోవడం పొరబాటే. అందులోనూ వేగంగా ప్రాజెక్టుల పూర్తి, రాత్రి నిద్రల వంటి ప్రక్రియలూ ప్రచారాలు నడుస్తున్నప్పుడు ఈ ఘటన మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. అ(న)ధికార పత్రిక అసలు గండి అన్న మాటే శీర్షికలో ఇవ్వకపోయినా జరిగింది అదే. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా విహంగ వీక్షణ చేసి కాంట్రాక్టర్ల తీరుపై విమర్శలు చేయడం, 5శాతం లోపు కోట్ చేసేవారిని తొలగించాలని చెప్పడం పరోక్ష అభిశంసనలే.
11 ఏళ్ల కిందట వైఎస్ హయాంలో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టును టెండరుదారుడు మూడేళ్లపాటు ప్రారంభించలేదట. అయినా ఆయనకు ఆయనే తప్పుకునేవరకూ మార్చలేదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక వేగం పెంచామని ప్రకటించారు. ముఖ్యమంత్రి అత్త
గారి వూరు గనక సందర్శనలూ తనిఖీలు కూడా బాగానే చేశారు. స్పిల్ వే వరకూ వచ్చారు గాని అంతకు ముందు వేసిన మట్టికట్ట బలోపేతం చేయాల్సిన బాధ్యత విస్మరించారు. వానలు లేనంతవరకూ బాగానే జరిగిపోయింది.కాని ఇప్పుడు రికార్డు వానలతో కొంప మునిగింది. ఎగువ మానేరునుంచి వచ్చిన నీరు, మూలవాగు,వరద కాలువ అన్నీ కలసి రోజుకు రెండు లక్షల క్యూసెక్కులు దాటింది. కట్టతెగింది. మరి ఇంత వానలు పడుతుంటే కట్ట పటిష్టత గురించి గాని నీటి పరిణామం గురించి గాని లోతుగా అధ్యయనం చేయకపోవడం ఆశ్చర్య కరం. పైగా ప్రాజెక్టు ముంపు జాబితాలో లేని మాన్వాడ అనే వూరు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని నవతెలంగాణ నివేదించింది. ఇప్పటికి పునరావాస కాలనీలు కూడా సిద్దం కాలేదు. మాన్వాడలో ఉద్రిక్తత కూడా నెలకొన్నది. వరదలో బురద రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలపై హరీష్ వ్యాఖ్యలు చేయొచ్చు గాని తమ అంచనాలు తప్పాయని అప్రమత్తత లోపించిందనీ కూడా అంగీకరించాలి కదా!
