నిజంగా ముస్లిం వ్యతిరేక ప్రచారక్‌లెవరు?

modi111

ముసల్మానోంకో న పురస్క్రతి కర్‌నా చాహియే న తిరస్క్రతి కర్‌నా చాహియే.. ఉన్‌ కో వోట్‌ కీ మండీ కా సామాన్‌ నహీ సమ్‌ఝనా చాహియే.. ఉన్‌ కో అప్‌నా సంఝానా చాహియే.. కొజికోడ్‌లో బిజెపి జాతీయ సమితి సమావేశాల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఈ సందేశంలో నిజానికి ఏ కోణంలోనూ కొత్త దనం లేదు. ముస్లిములను ఓటుబ్యాంకులుగా చూస్తున్నారనేది అరిగిపోయిన బిజెపి పాత రికార్డే. దానికి ఆయన ఏదో కొత్తదనం జోడించి అటూ ఇటూ తిప్పి చెప్పారు.(ముస్లిములకు పురస్కారాలు అక్కర్లేదు, తిరస్కారాలు అక్కర్లేదు.వారిని ఓటు బ్యాంకు సరుకులుగా చూడొద్దు.వారిని వారుగానే చూడాలి) జనసంఫ్‌ు కీలక నేత దీనదయాళ్‌ ఉపాధ్యాయ భావనగా చెబుతున్న ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు దేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ సమాన హక్కులు కలిగివుంటారని రాజ్యాంగంలో 14,15,16 అధికరణాలు చెబుతున్నాయి. మత ప్రాతిపదికన దేశం విభజితమైనా పాకిస్తాన్‌ వెళ్లకుండా ఇక్కడే వుండిపోయిన ముస్లిములకు దేశంపై వుండే ప్రేమను శంకిచాల్సిన అవసరం లేదు. వారిపై విద్వేష ప్రచారం చేసిన తమ వారిని వదిలిపెట్టి- తన హయాంలోనే గుజరాత్‌లో జరిగిన మారణకాండను మర్చిపోయి మోడీ ఎవరికి ముస్లింలపై ప్రేమను బోధిస్తున్నారు? అల్పసంఖ్యలో వుండే వారిని ఓటు బ్యాంకులుగా భావించే వారి సంగతి అటుంచి మెజార్టి మతాన్ని అఖరుకు వారి దేవుడైన రాముణ్ని కూడా ఓట్ల గుర్తుగా మార్చింది బిజెపి సంఘ పరివార్‌ కాదా? ముస్లిములను వారిగానే చూడాలని డొంక తిరుగుడుగా చెప్పేబదులు గౌరవంగా చూడాలనీ, భద్రత కల్పించాలని చెప్పడం సమంజసంగా వుండేది కాదా? ఇస్లామిక్‌ తీవ్రవాదం పేరుతో చెలరేగే టెర్రరిస్టులతో ఆ మతస్తులందరినీ కలిపి చూపే ధోరణి వద్దని తమ వాళ్లకు ముందుగా చెప్పవలసిన ప్రధాని ఓటు బ్యాంకుగా చూస్తున్నారంటూ ఇతరులపై నింద వేసేందుకు ప్రయత్నించడం శోచనీయమే. ఇటీవల హైదరాబాదు సభలో ఆయన దళితుల విషయంలోనూ ఇలాగే ఇతరులను నీతిబోధ చేవారు. ఆ తర్వాతే ఉన్‌లో వారిపై హింసాకాండ జరిగింది. నిన్న ఒక గర్భిణి అయిన దళిత మహిళపైన దౌర్జన్యం చేశారు. సూక్తులు హితబోధలు మంచివేగాని మాననీయ ప్రధాని ముందు స్వపరివారానికి వాటిని నేర్పిస్తే పాలించేది వారేగనక చాలా మేలు జరుగుతుంది.లేకపోతే తప్పు సంకేతాలిచ్చినట్టవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *