అపెక్స్‌బాటలో మరిన్ని పరిష్కారాలు

r2r36b806172443-babu-kcr-300x192కృష్ణా గోదావరి జలాలపై కేంద్రం ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం నాటకీయ ఫలితాలు ఇవ్వకపోయినా సానుకూల సంకేతాలే విడుదల చేసింది. ఇద్దరూ కలసి తేదీలు ఇవ్వడం, చర్చల్లో పాల్గొనడం, తర్వాత విరుద్ధ ప్రకటనలు చేయకపోవడం ఇవన్నీ సత్సంబంధాలకు సూచికలే. ఎన్నికలు రాజకీయావసరాలు పరస్పరం తెలుసు గనక ఉభయులూ అవతలివారినుంచి మరీ ఎక్కువగా ఆశించరు. అవసరార్థం చేసే తీవ్ర ప్రకటనపెద్దగా పట్టించుకోరు కూడా. ఇటు హరీష్‌ రావు, అటు దేవినేని ఉమ కొన్ని సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సందర్భాన్ని బట్టి తీవ్ర వ్యాఖ్యలు చేసినా వాటిపై పంతాలు పట్టుదలలకు పోరని ఇప్పటికే చాలాసార్లు తేలిపోయింది. మొన్నటి సమావేశం తర్వాత తెలంగాణ ప్రభుత్వం లేదా టిఆర్‌ఎస్‌ ప్రతినిధుల తరపున విజయం సాధించామన్న ప్రకటనలు చాలా వెలువడ్డాయి. అంత ఉధృతంగా ఆంధ్రప్రదేశ్‌ నేతలు స్పందించలేదు. కొత్త రాష్ట్రంగా ఇవతలివారి వాదనలు చేసుకోనివ్వాలన్న భావన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ వారికి చెప్పారు. పైగా దీర్ఘకాలం పాలించిన నేతగా పాలమూరు అవసరాలనూ కాదనలేరు. పట్టిసీమ విషయంలో కెసిఆర్‌ అనుకూలంగానే మాట్లాడారు. వున్న మాట చెప్పాలంటే ఎగువ దిగువ రాష్ట్రాలు భౌగోళిక సౌలభ్యాన్ని బట్టి చేసుకునే ప్రాజెక్టులను అడ్డుకోవడం అవతలి వారికి సాధ్యమయ్యేది కాదు. అలా అయ్యేదే వుంటే బాబ్లీ అల్మట్టి వంటివి వుండేవి కావు. ప్రాజెక్టులు కిక్కిరిసిన కృష్ణానదిలో మిగులు వుండదు గనక ఎగువన ఎత్తిపోతల వల్ల కలిగే నష్టంపై ఎపి ఆందోళన చెందినా ఖాతరు చేయాల్సిన అవసరం టి సర్కారుకు వుండదు. సముద్ర ంలో కలిసే చోట గోదావరి నీటిని ఎపి ఉపయోగించుకునే నిర్మాణాలను అదీ ఆపలేదు. కాబట్టి స్టేటస్‌ కోనే వుంటుంది. అయితే వాదనలంటూ వినిపించి రికార్డు చేయాలి గనక చేశారు. రేపైనా అవిఅవసరానికి రావచ్చు. ఇంత జరిగాక పరస్పరం ఘర్షణ పడే స్థితికి మాత్రం వెళ్లరని గట్టిగా చెప్పొచ్చు.ఇంతకాలం అలాటి స్థితి వస్తే బావుండునన్నట్టు చూసిన బిజెపి చివరకు అలా జరగదని తెలిశాకే సమావేశం ఏర్పాటు చేసింది. అది కూడా సుప్రీం కోర్టు ఆదేశం మేరకు మొక్కుబడిగానే జరిగింది. సీనియర్‌గా చంద్రబాబు, తొలి సిఎంగా కెసిఆర్‌ తమ పాత్రలు బాగానే పోషించారు. ఇక 9.10 షెడ్యూళ్లపైనా ఇదే విధంగా చర్చలు జరగొచ్చు. వచ్చే నెల నాటికి ఎపిసచివాలయం దాదాపు తరలిపోతుంది గనక ఉభయ రాష్ట్రాల సంబంధాల్లో గణనీయమైన గుణాత్మక మార్పు వచ్చే అవకాశం వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *