ముంపు ప్రాంతాల్లో కెటిఆర్.
చార్ సౌ షహర్.. పుకారా షహజాదా( విశ్వ నగర ఘోష వినండి యువరాజా) అని మనం మొన్న వ్యాఖ్యానించుకున్నాము. ఇప్పటి వరకూ వచ్చిన మంచి పేరు అదికారుల అలసత్వం వల్ల కొట్టుకుపోతుందని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఒక అగ్రశ్రేణి పత్రికలో చదివి, ఆయన అంత వరకూ నేరుగా రంగంలో కనిపించకపోవడం గమనించి ఆ పోస్టు రాశాను. దీనిపై కొందరు రాజకీయ నేతలు మీడియా మిత్రులు కూడా నాతో ప్రస్తావన చేశారు. ఎందుకంటే అప్పటికి(బహుశా ఎప్పటికీ) ప్రస్తుతం మన ప్రధాన మీడియాలో ఆ తరహా వ్యాఖ్యలు చూసేపరిస్థితి లేదు. బుధవారం, గురువారం ఆయన ముంపు ప్రాంతాల్లో విస్త్రతంగా పర్యటించడం ఆహ్వానించదగింది. ఆలస్యం జరిగినా, అందుకే ఏ కారణాలున్నా బాధ్యతలు తీసుకున్నవారు ప్రజల బాధల తరుణంలో ప్రత్యక్షంగా కనిపించి తీరాలన్నదే నా విమర్శ సారాంశం. ప్రకృతి వైపరీత్యాలు ఒక్కసారితో ముగిసిపోవు, ఎవరి చేతుల్లోనూ వుండవు. అయితే బాధితులను ఆదుకోవడం కీలక నేతల అవశ్య కర్తవ్యం. అయితే ఈ ఘటనల నుంచి తగు పాఠాలు నేర్చుకునేట్టయితే కెటిఆర్ జిహెచ్‌ఎంసిలో తన బాధ్యతలు తగ్గించుకుని వికేంద్రీకరణ పెంచాలి. తక్షణ సమస్యలూ దీర్ఘకాలిక అంశాలు విడదీసి చిన్న చిన్న సమస్యలు పెద్ద ఎత్తున పరిష్కరించాలి. భరోసా ఇవ్బడం మంచిదే గాని అది పరిస్థితులనుంచి కలగాలి, పలుకులను బట్టి కలగదు. కనక వానలు తగ్గగానే పనుల వరద మొదలవాలన్నది ప్రజల ఆకాంక్ష.
