దేశ భద్రత, కేంద్ర బాధ్యత!
యూరిలోని భారత సైనిక కేంద్రంపై దాడి చేసి నిద్రలో వున్న పద్దెనిమిది మంది వీరజవాన్లను బలిగొన్న పాకిస్తాన్ ప్రేరిత వుగ్రవ్యూహం క్షంతవ్యం గాని నేరం.దీనికి సంజాయిషీ ఇవ్వాల్సిన పాక్ ప్రధాని నవాజ్ షరీప్ ఐక్య రాజ్యసమితి వేదికపై షరామామూలుగా భారతదేశాన్నే నిందితురాలుగా చూపించేందుకు ప్రయత్నించడం మరింత దారుణం. యూరి దురంతం నేపథ్యంలో ఈ సమావేశాలవరకైనా షరీప్ మరో విధంగా మాట్లాడతారన్న మీడియా అంచనాలు తప్పిపోయాయి. పాకిస్తాన్ పాలకులు భారత వ్యతిరేక విద్రోహశక్తులకు వత్తాసునిస్తున్న తీరును భారత ప్రతినిధి శ్రీమతి ఈనమ్ గంభీర్ శక్తివంతంగా వినిపించడం కూడా ఆహ్వానించదగింది. నేరుగా ఒక కీలక సైనిక కేంద్రంపై దాడి అంటే ప్రత్యక్ష కవ్వింపు గనక ఇండియా సముచిత వ్యూహం అనుసరించాలనే అందరూ కోరుకుంటారు.
నిజానికి చాలా పెద్దదైన బారాముల్లా జిల్లా యూరి సైనిక కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేసి గుడారాలకు నిప్పు పెట్టిన ఫలితంగా సైనికులు బలికావడం దేశాన్ని కలచివేసింది. కాశ్మీర్ ప్రజలు నిత్య నిర్బందాజ్ఞల్లో గడుస్తున్న ్ట నేపథ్యంలో ఈ దారుణమైన దాడి ఉద్రిక్తతను మరింత పెంచింది. జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం సహాయంతో దాడి చేశారని భారతదేశం చెబుతున్నది దాదాపు యథార్థమే. అయితే ముందస్తు సమాచారం వుండి కూడా ఈ పరిస్థితికి అవకాశమిచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వ అలక్ష్యం అభిశంసనీయం. ఆ భావన ప్రజల్లోనూ వచ్చింది. అందుకే కేంద్రం పాక్‌పై ప్రతీకార దాడి చేయడమే పరిష్కారమన్న సంకేతాలతో ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది. సమీక్షా సమావేశాలు జరుపుతూ సరిహద్దులు దాటి వెళ్లి పరిమిత దాడి చేయడం, లేదంటే పూర్తి స్థాయి యుద్దం చేయడం వంటి ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్టు కథనాలు వదిలింది. దాడి చేసిన దుండగులను అప్పుడే వెంటాడి చంపడంతో పాటు మరుసటి రోజునే సరిహద్దులలో పదిమంది చొరబాటు దార్లను కాల్చివేశారు. వీటన్నిటి చూపిస్తూ తామూ దూకుడుగా వెళ్లనున్న భావన కల్పించింది. అయితే వాస్తవాలు తెలుసు గనక అంతలోనే యుద్ధం అవకాశాలు లేవన్న వాదనలనూ ప్రచారంలో పెట్టింది. జరిగిన దారుణం చాలనట్టు భవిష్యత్ కార్యాచరణ గురించిన ఈ విరుద్ధ సంకేతాలు అభద్రతను పెంచుతున్నాయి.

మోడీ కేంద్ర బిందువుగా నయా హిందూత్వ జాతీయ వాదంతో స్వచ్చ భారత్, నైపుణ్య భారత్ అంటూ అనేక నినాదాలతో హౌరెత్తిస్తున్న ప్రభుత్వం వాస్తవంగా దేశభద్రత విషయంలో ఎందుకింత అలసత్వం చూపిస్తున్నది? . 2016 జనవరిలో పఠాన్‌కోట వైమానిక స్థావరంపై దాడి జరిగింది.దానికి ముందు ఇదే ఉరి కేంద్రంపరిసరాల్లో 2014 డిసెంబరులోనూ దాడి జరిగింది. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో 2001లో పార్లమెంటుపై జరిగిన దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ పరాక్రమ్ పేరిట హడావుడి చేస్తున్న సమయంలోనే 2002లో కోల్చాక్ సైనిక శిబిరంపై జరిగిన దాడిలోనూ 31 మంది మరణించారు. అప్పటి నుంచి ఉరి పరిసరాలపై కూడా దాడులు జరుగుతూ వచ్చాయి. సెప్టెంబర్ 8వ తేదీన లెఫ్టినెంట్ జనరల్ ఉన్ హసన్ నిర్దిష్టంగా ఉరి సైనిక కేంద్రంపైనే దాడి జరగనున్నట్టు హెచ్చరిక పంపించిన పది రోజులకే ఈ ఘోరం జరిగింది. రోజూ 90శాతం చొరబాట్లను నిరోధిస్తుంటామని, పదిశాతం మాత్రమే అనుకున్నట్టు జరుగుతాయని అటు నిఘా అధికారులు ఇటు సైనికాధికారులు ఇటు ప్రభుత్వం కూడా చెప్పడం సమర్థనకే పనికి వస్తుంది. 12వేల మంది సైనికులున్న కేంద్రంలోకే విద్రోహులు చొరబడగలగడం దేశ భద్రతకే పెను సవాలు. సైనిక పటాలాలు మారుతున్న సందర్బంలోనే ఇలాటి దాడులకు అవకాశం వస్తుందన్న వాదన కూడా సంజాయిషీగా పనికి రాదు. ఎందుకంటే సైన్యంలో అది నిరంతర ప్రక్రియ. ఈ దాడి తర్వాత రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ స్వయంగా . ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ఎలా రాగలిగారు? వచ్చినా సైనిక కేంద్రంలోకి ఎలా చొరబడగలిగారు? అని అడిగారు. సమాధానం చెప్పవలసిన వారే ప్రశ్నలు వేయడం హాస్యాస్పదం. ఈ విషయం అర్థం కాబట్టే ఆలస్యంగా ఆయన ఏవో తప్పిదాలు వున్నాయని అంగీకరించారు . కాని ప్రభుత్వ వ్యూహాత్మక గజిబిజిని రాజకీయ బాధ్యతనూ స్వీకరించడానికి సిద్దంగా లేరు.
పఠాన్‌కోట దాడి ముందు తర్వాత కూడా పాకిస్తాన్ పట్ల మనం అనుసరించే విధానంలో ఒక స్థిరత్వం స్పష్టత రాలేదు. సైనిక మత ఛాందస అవినీతి కూటమి ఆదిపత్యంలో అమెరికా కనుసన్నల్లో నడిచే పాకిస్తాన్ కుటిల వ్యూహాలు భారత్ వ్యతిరేక చర్యలు నిత్య కృత్యాలే వాటిని ఎలా ఎదుర్కొవాలనే దానిలో మనకు స్పష్టత వుండాలి .కేవలం కవ్వింపు వ్యాఖ్యానాలు లేక కృత్రిమ దేశభక్తి ప్రచారాలు పరిష్కారం చూపించలేవు. గతంలోనూ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే కార్గిల్ చొరబాట్లు, అనంతర సాయుధ ఘర్షణ చూశాం. దాని ఫలితంగానే ఆయన రెండోసారి అధికారంలోకి రాగలిగారనేది కాదనలేని సత్యం. ప్రతిపక్షంలో వుండగా తాజ్ హొటల్‌పై దాడిని గురించి వీరోచితంగా విరుచుకుపడిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ, గత ఏడాది బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ బిజెపి పాక్ సమస్యను అసందర్భంగా రాజకీయ ప్రచారానికి వాడుకున్నది. అదే అలాటి ప్రభుత్వం ఎందుకు పాక్ చొరబాట్లకు ఇంతగా అవకాశమివ్వడం అంతుపట్టని వింత. జరగాల్సింది జరిగిపోయాక గంభీర హెచ్చరికలు చేయడం, చర్చలు నిలిపేయడం, హఠాత్తుగా పునరుద్ధరించడం ఇదంతా వ్యూహాత్మక అవకాశవాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ే జమ్మూ కాశ్మీర్‌లోనూ పిడిపితో కలసి అధికారం చేస్తున్న బిజెపి అక్కడ పరిస్థితి ఉద్రిక్తం కావడానికి ఒక ముఖ్య కారకురాలు. స్వతంత్రం వచ్చాక తొలిసారిగా బక్రీద్ పండుగ రోజున కూడా మసీదులకు వెళ్లకుండా కర్ఫ్యూ విధించే పరిస్థితి ఏర్పడింది. అఖిలపక్ష సమావేశంలో అందరితో మాట్లాడి పరిష్కారం కనుగొంటానని ఇచ్చిన హామీని కూడా వుల్లంఘించి నిర్బంధాన్ని తీవ్రం చేశారు. ఫలితంగా అక్కడి యువతలో తీవ్ర నిరసన పెరగడమే గాక పిడిపి ముఖ్యనేతలే నిష్క్రమణ ప్రకటించారు. పాకిస్తాన్ కుట్రలకు కాశ్మీర్ పెద్ద కేంద్రంగా మారే పరిస్థితి దాపురించింది. కాశ్మీర్‌లో సాధారణ వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజల విశ్వాసం పొందకుండా సరిహద్దులలో చొరబాట్లను లేదా ఉగ్రవాద దాడులను అరికట్టడం కుదిరేపని కాదు. ఒక వేళ సరిహద్దులు దాటి వెళ్లి దాడి చేస్తే అప్పుడు పాకిస్తాన్ మనపైనే నెపం పెట్టే అవకాశం ఇచ్చినట్టవుతుంది.పైగా ఇరువైపులా ప్రాణనష్టం వాటిల్లుతుంది. కనుక చాలా సంయమనంతోనూ చాకచక్యంగానూ ఈ సవాలును ఎదుర్కొవలసి వుంటుంది. ఆ క్రమంలో సైనికుల పౌరుల ప్రాణాల పరిరక్షణ కీలకంగా పరిగణించాలి తప్ప రాజకీయ ప్రయోజనాల లెక్కలు కాదు.
దౌత్యపరంగా మద్దతు కూడగట్టడం మంచిదే గాని ఇందుకోసం అమెరికాపై ఆధారపడటం ఆశలు పెంచడం పెద్ద పొరబాటు. అమెరికా రష్యా ఫ్రాన్స్ వంటి దేశాలనుంచి ఇప్పటికే మనవాదనకు మద్దతు వచ్చేసిట్టే భావించడం అవాస్తవికత. ఇండియా వాదనతో అందరూ ఏకీభవించి ఐరాస పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే పని జరిగేది కాదు. అవన్నీ ా సాధారణ ఖండనలే. ఎప్పటికైనా పాకిస్తాన్ పాలక కూటమికి ప్రధాన ప్రాపు అమెరికానే. చైనాను మాత్రం ఎప్పుడూ పాకిస్తాన్‌తో కలిపి చూస్తూ దానికి వ్యతిరేకంగా అమెరికాతో కలసి మాట్లాడ్డం కూడా పొరబాటే. భారత చైనాల నియంత్రణ కోసమే గాక ఆప్ఘనిస్తాన్‌లో తన ఆదిపత్య ప్రయోజనాల కోసం కూడా అమెరికా ఎన్నటికీ పాకిస్తాన్‌ను తన పావుగా వాడుతుంటుంది. అమెరికా ఉపాంగంగా పాక్ స్తానం మనకు వచ్చిందనే అంచనా తప్పు. రావాలని కోరుకోవడం ఇంకా ప్రమాదం. యూరీ దాడిపై విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ ఖండన కూడా అనేక మినహాయింపులతో వుంది.ే..విహెచ్‌పి నాయకులు లేదా కొంరదు సంఘపరివార్ ప్రతినిధులు చెబుతున్నట్టు దుందుడుకుగా దాడులకు పాల్పడితే అప్పుడు మనం నిందితులుగా నిలబడతాము. ముందు అప్రమత్తతనూ రక్షణ పాటవాన్ని పటిష్టం చేసుకోవడం నిఘాను కట్టుదిట్టం చేయడం జరగాలి. తక్షణ విస్త్రత సంప్రదింపులతో కాశ్మీర్ యువత విశ్వాసం పొందగలిగితే గాని సరిహద్దుల్లో పూర్తి భద్రత లభించదు. ఆ బాధ్యత పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే.
గమనం ఆంధ్రజ్యోతి ఎడిట్‌పేజి, 23..8.16
