హైకోర్టు ఆదేశం: టిటిడిపికి నో లాభం… ఎపి టిడిపికి ఇరకాటం

high-court-of-telangana

రేవంత్‌ రెడ్డి తరపున జంధ్యాల రవిశంకర్‌ వాదించిన ఫిరాయింపుల కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించాయి. ఫిరాయించిన 12 మంది తెలుగుదేశం ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్‌పై మూడు మాసాలలోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశం రాజకీయ విజయంగా చెబుతున్నారు. ఫిరాయింపులను మొదటి నుంచి ఖండిస్తున్న మాలాటి వారికి కూడా ఇది ఆ కోణంలో ఆహ్వానించదగిందే. అయితే దీని సారాంశంపైనా పర్యవసానాలపైన మాత్రం కొంచెం అతిశయోక్తిగా ప్రచారం జరుగుతున్నది. నిజానికి హైకోర్టు ఈ విధమైన ఆదేశాలివ్వడం ఇదే మొదటిసారి కాదు. 2015లోనూ కాంగ్రెస్‌ నాయకులు దాఖలు చేసిన కేసులో అప్పటి ప్రధాన న్యాయమూర్తితో సహా వున్న ధర్మాసనం మూడు మాసాల గడువే ఇచ్చింది. టిటిడిపి లెజిస్లేచర్‌ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా రాసిన లేఖను ఆమోదిస్తూ 2016 మార్చి 10న అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసిన బులిటెన్‌ను రేవంత్‌ సవాలు చేస్తున్నారు. ముందు వారి అనర్హత పిటిషన్‌పై తప్ప విలీనం నిర్ణయించవలసింది స్పీకర్‌ కాదని ఆయన తరపు వాదన. అయితే హైకోర్టు ఇప్పుడు మూడు మాసాలలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది తప్ప చర్య తీసుకొమ్మని కాదు. ఈ తేడాకు చాలా ప్రాధాన్యత వుంది. ఆ మాటకొస్తే అప్పట్లోనే కోర్టు స్పీకర్‌కు నోటీసు కూడా జారీ చేసింది. అయితే ఆయన హాజరు కాకపోతే ఏం చేయాలన్నది అస్పష్టం. ఇప్పుడు కూడా మూడు మాసాల తర్వాత స్పీకర్‌ తప్పక స్పందిస్తారని గ్యారంటీ లేదు. తను ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను స్పీకర్‌ కార్యాలయం కోర్టుకు పంపించవచ్చు. వాటిపై విచారణకు సమయం పడుతుంది. కనుక మూడు మాసాలలో చర్య తప్పక తీసుకోవలసి వుంటుందని వ్యాఖ్యానించడం వాస్తవికత కాదు. ఓటుకు నోటు వ్యవహారంలో వైసీపీ ఎంఎల్‌ఎ ఆర్‌కె కేసులో ఇచ్చిన ఆదేశాల విషయంలోనూ ఇలాగే హడావుడి జరిగింది గాని తర్వాత ఎలాటి కదలిక లేదు.
ఒక విధంగా చూస్తే ఈ కేసు తెలంగాణలో టిడిపికి చేసే లాభం కంటే ఎపిలో వైసీపీ నుంచి సామూహిక ఫిరాయింపులను ప్రోత్సహించిన తెలుగుదేశం ప్రభుత్వానికి కలిగించే ఇబ్బంది ఎక్కువగా వుంటుంది. ఏదో ఒక రూపంలో టిటిడిపి లెజిస్లేచర్‌పార్టీలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారంతా టిఆర్‌ఎస్‌లో కలసిపోయారు. కాని ఎపిలో ఎప్పటికీ వైసీపీ సభ్యులందరినీ టిడిపి చేర్చుకోవడం సాధ్యం కాని పని. ఇప్పటికి వచ్చిన వారు మూడోవంతు మాత్రమే గనక ఫిరాయింపుల చట్టం తప్పక వర్తించాలి. హైకోర్టు ఆదేశాలనే ఆయుధంగా చేసుకునే అవకాశం ఈ కేసు వల్ల ఎపిలో ప్రతిపక్షాలకు దక్కుతుంది. మూడు మాసాలలోనూ అదో ప్రధాన ప్రచారంగా వుంటుంది. అంతిమంగా ఏం జరుగుతుందనేది విచారణలు వాయిదాల తర్వాత వచ్చే తీర్పుపై ఆధారపడి వుంటుంది. అప్పటికి పుణ్య కాలం గడిచిపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *