జియో ఎయిర్‌టెల్ లాభాల యుద్ధం ,- మొబైల్ వ్యాపార రహస్యం

ఇప్పుడు తమ ఫోన్లనుంచి వచ్చే కాల్స్‌కు ఎయిర్‌టెెల్ కనెక్టివిటీ నిరాకరిస్తున్నట్టు జియో ఆరోపిస్తున్నది. రోజుకు 2 కోట్ల కాల్స్‌కు ఇంటర్ కనెక్టివిటీ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నది. ఇందుకు సమాధానంగా భారతి ఎయిర్‌టెల్ తాము 1.5 కోట్ల కాల్స్‌కుఅవకాశమిస్తున్నామని ప్రకటించింది. కాని జియో దీన్ని ఖండించడమే గాక ఇది ఏ మూలకు చాలదని తేల్చేస్తున్నది. మొత్తం మీద పరిష్కారం కంటే తనను చూసి ఇతర కంపెనీలు భయపడుతున్నాయనే భావన పెంచడం దాని ఉద్దేశంగా వున్నట్టు అర్థమవుతుంది.ఈ సమస్యలో రెండు కోణాలు చూడాల్సి వుంది
మొదటిది- బిఎస్‌ఎన్‌ఎల్ మొదటి నుంచి సెల్‌ఫోన్లు తీసేసుకుని ప్రైవేటు ఆపరేటర్లకు లాభం చేకూర్చే విధానాలు అనుసరించేలా ఒత్తిడి చేశారు. కనుకనే మొదటి దశలో అంటే ప్రైవేటు ఆపరేటర్లు రాకముందు సెల్‌ఫోన్ కాల్ ఖర్చు రు.16, 18 వుండేది. అప్పట్లో లాండ్‌ఫోన్ కన్నా ఇది 40, 50 రెట్టు ఎక్కువగా వసూలు చేసేవారు.దీనిపై నిపుణులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు.ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యయం బాగా తక్కువైనప్పుడు సెల్‌ఫోన్ కాల్స్‌ను ఎందుకు ఇంత ఎక్కువగా వసూలు చేస్తారని.ప్రశ్నించేవారు.దీనంతటికి ఆద్వర్యం వహించే ట్రారు(టెలికాం రెగ్యులేటరీ అధారిటీ) ప్రజలను బిఎస్‌ఎన్‌ఎల్‌కు విముఖులను చేయాలని కంకణం కట్టుకుని పనిచేసింది. ఎయిర్‌టెల్,వొడాఫోన్ వంటివాటిని రంగంలోకి తెచ్చినతర్వాత ప్రైవేటు కంపెనీలైతే రేట్లు తక్కువ అనేభావం కలిగించింది. అంతేగాక ఆనాటి బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం చాలా కాలం పాటు బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌లను మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. నిజానికి వాటికి లైసెన్సు వున్నా అనుమతినివ్వలేదు. చివరకు బిఎస్‌ఎన్‌ఎల్‌కు అనుమతి లభించడం, జరిగాకే మొబైల్ రేట్లు మొదటిసారి తగ్గాయి. వినియోగదారుల నిరసన కూడా ఇందుకు కారణమైంది.మొదటిదశలో రిలయన్స్ తనకు లాండ్‌లైన్లకు వున్న లైసెన్సును దుర్వినియోగపర్చి మొబైల్ సర్వీసులు మొదలు పెట్టింది. ఈ కారణాలన్నిటి రీత్యానే రేట్లు తగ్గాయి. లాండ్‌లైన్లు విస్తరించి టెలిడెన్సిటీ రావాలంటే చాలా భారీ ఖర్చుతో కూడినపని. అందుకే ఇండియాలో మొబైల్స్ వచ్చాకే టెలిడెన్సిటీ పెరిగింది. చాలా యూరప్ దేశాల్లో మొబైల్ రేట్లు లాండ్ లైన్ల కన్నా ఎక్కువగానే వుంటాయి. ఇందుకు భిన్నంగా వర్థమాన దేశాలు మొబైల్ విప్లవం అనేదాన్ని అనుసరించాయి.ఈ క్రమంలో ప్రైవేటు కంపెనీలు లాభపడ్డాయి.
ఇదెలా జరిగిందంటే మౌలికంగా డేటాగా పరిగణించవలసిన వాయిస్ కాల్స్‌ను విడిగా లెక్కకట్టి సొమ్ములు వసూలు చేయడం వల్లనే ప్రైవేటు కంపెనీలు లాభపడ్డాయి. వారి ఆదాయంలో 70 శాతం ఈ విధంగానే వస్తుంది. ఒకో వాయిస్ కాల్‌కు రెండు పైసలు వసూలు చేయవలసి వుండగా వారు 60,70 పైసలు తీసుకుంటున్నారు. ఈ కారణంగానే రిలయన్స్ జియో కాల్స్‌ను వాయిస్‌గా పరిగణించే పద్ధతిలో విస్తరించాలనుకోవడం వారికి పెద్ద దెబ్బ అయింది.
ఇప్పుడు వారి ముందు రెండు మార్గాలే వున్నాయి. మొదటిది జియో దాడినితట్టుకోవాలంటే తమ ఆపరేషన్లను వేగంగా మార్చుకోవాలి. రెండవది జియో ఫోన్లకు కనెక్టివిటీ అడ్డుకోవాలి. ఎందుకంటే అధికారికంగా తాను 2017 జనవరి నుంచి వాణిజ్య ఆపరేషన్లు మొదలు పెడతానని జియో చెబుతున్నది గనక అప్పటి వరకూ కేవలం కొంత వరకూ వీరు కనెక్టివిటీ ఇస్తే సరిపోతుంది. వ్యాపార పోటీకి సంబంధించిన ఫిర్యాదులు లేవనెత్తడం తప్ప జియో న్యాయపరంగా ఎదుర్కొనే అవకాశం లేదు.
ఏమైనా లక్షకోట్లపైన పెట్టుబడితో రిలయన్స్ చేసిన దాడిని ఈ విధంగా ఈ కంపెనీలు ఎంతో కాలం తట్టుకోలేవు. కేవలం వాయిస్ కాల్స్ ఆదాయంపై ఆధారపడి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న తమ వ్యూహాలు మార్చుకోవాలి. వాట్సప్, జియో వంటివి డేటాను వాయిస్‌గా పరిగణిస్తున్నాయి గనక ఈ కంపెనీలు ఇతర డేటా సర్వీసులు పెంచుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోవాలి. అప్పటి వరకూ ఈ పోరాటం కొనసాగుతూనే వుంటుంది.ఇందులో ధర్మాధర్మ విచక్షణ ఏమీ లేదు. ఎవరి లాభాల వేట వారిదే.
ప్రబీర్ పుర్కాయస్త వ్యాసం ఆధారంగా)