సత్యాన్ని ఖూనీ చేస్తే సన్మానాలా?
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు ఆత్మ రక్షణ స్వీయ సమర్థన యజ్ఞంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై మీడియాపై విరుచుకుపడుతున్నారు. తను చెప్పిన మాటలు అమలు చేయకపోగా తానే ఖండించుకునే దుస్థితిలో అనవసరంగా ఆయాసపడుతున్నారు. తాజాగా విజయవాడలో సభ జరిపి పాత పాటలే పాడారు. క్లుప్తంగా సూటిగా
.1972లోనే విభజించి వుండాలనే వారు ఎందుకు దానికోసం ఉద్యమం జరపలేదు? ఒక ఓటు రెండురాష్ట్రాల నినాదం ఎందుకు మూలనపెట్టారు? మొన్న తెలంగాణ ఉద్యమంలో చేరేందుకు కూడా ఎంత కాలం తటపటాయించారు?
మీరు అంత గట్టిగా విభజించాలనుకుంటే కాంగ్రెస్‌కు సరైన సూచనలు చేయకుండా లోక్‌సభలో ఎందుకు బలపర్చారు? మీ పార్టీ రెండు సభల్లో వేరు వేరా?
14 వ ఆర్థిక సంఘం హౌదా వద్దని చెప్పిందని నిరూపించే ఒక్క వాక్యమైనా చూపిస్తారా?
ఆర్థిక వెసలుబాటు లేని రాష్ట్రాలకు ప్రత్యేక హౌదా ఇచ్చే సదుపాయం వుందన్న సత్యాన్ని ఎందుకు దాచి పెడుతున్నారు?లేదని చెప్పగలరా?
ఇప్పుడు ఇచ్చామంటున్న ప్యాకేజీ వాస్తవంగా ఇవ్వాల్సిన అనేక ప్యాకేజీలను( ఉదాహరణకు కెబికె ప్యాకేజీ టాక్స్ హాలిడే వంటివి) వమ్ము చేసిన మాట నిజం కాదా?
తెలుగు ప్రజలు చరిత్ర తెలుసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్న వెంకయ్య నాయుడు గారు ప్రజలకు అన్ని చరిత్రలూ అందరి చరిత్రలూ తెలుసని గ్రహించడం మంచిది.
గొప్పగా ప్రచారం చేసుకున్న హౌదా సాధించలేకపోతే తప్పుకుని నమస్కారం పెడితే ప్రజలు గౌరవించేవాళ్లు. దానికి బదులు ఇతరులను తిట్టిపోయడం ఏం న్యాయం?
మాట తప్పినందుకు సత్కారాలు చేయించుకోవడం ఎంత విడ్డూరం?
ఈ ప్రచారార్భాటానికి ఆత్మ సమర్థనా పర్యటనలకు బిజెపి వారే విస్తుపోతుంటే ఇతరులను అనడం దేనికి?
