పోలవరం పొలిటికల్‌ డైవర్షన్‌ స్కీమ్‌!

cm3333

పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అని తెలిసీ కేవలం రాజకీయ కోణంలో ఇలా అంటున్నందుకు గోదావరి మాత మన్నించుగాక. ఇటీవల ప్రత్యేక హౌదా వివాదం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనకు లభించిన అతి గొప్ప ప్రయోజనం పోలవరం అని ప్రచారం చేసుకుంటున్నది. ప్రచారమే గాక ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి అక్కడ పర్యటించి వచ్చారు. చాలామంది మిత్రులు దీనిపై వ్యాఖ్యానించాలని కోరుతున్నారు.

. పోలవరంకు సంబంధించి కేంద్రం కొత్తగా చేసిన నిర్ణయమేమీ లేదు. జాతీయ ప్రాజెక్టు కింద పూర్తి బాధ్యత తీసుకోవడానికి తటపటాయించిన వారు ఇప్పుడు ఒప్పుకున్నామంటున్నారు.
అయితే అయిదేళ్లలోనూ సగం కాలానికి ఇచ్చింది 850 కోట్లు మాత్రమే గనక మిగిలిన కాలంలోనూ వారి మాట ఎంతగా అమలు అయ్యేది అనుమానమే.

ఇస్తామన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే కట్టేస్తామని మాత్రమే. ఆ అప్పు కూడా ఎప్‌ఆర్‌ఎంబి పరిమితికి లోబడి వుండాలని షరతు. కనకు ఎవరు ఇస్తారు ఎప్పుడు వస్తుంది.. దాన్ని ఏ మేరకు ఆమోదిస్తారు , ఎప్పుడు తిరిగి చెల్లిస్తారనే సందేహాలు మిగిలే వుంటాయి.
ఇప్పటికి ఇచ్చిన 850 కోట్లు గాక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రెట్టింపు ఖర్చు చేసింది. ఆ సొమ్ము మంజూరు చేయడానికి ఆలస్యం దేనికి?

రాష్ట్ర ప్రభుత్వానికే నిర్మాణ బాధ్యత అప్పగించడం మంచిదా చెడ్డదా అనే విషయం అలా వుంచితే అలసు దానివల్ల జరిగే పనిలో కేంద్రం బాధ్యత తగ్గిపోతుంది. ఏది అడిగినా రాష్ట్రం నుంచి రావాలనే సమాధానమే మిగులుతుంది. డిపిఆర్‌లు రాలేదనే సాకుతో జాప్యం జరుగుతుంది. గతంలో జరిగిన దానిపైనే అన్ని శంకలు లేవనెత్తిన ఢిల్లీ పెద్దలు ఇకముందు ఒక్కసారిగా ఎందుకు మారిపోతారు? కేంద్రం ఖర్చు భరిస్తూ జవాబుదారి తనం తీసుకోకపోతే పార్లమెంటు ఎందుకు ఒప్పుకుంటుంది? రెండు ప్రభుత్వాల మధ్య ప్రాజెక్టు పనులూ నిధులు వివాదంగా మారిపోతే ఏమవుతుంది?

ప్యాకేజీ అంటూ ఏదో ప్రకటన చేసిన మరుసటి రోజునే నిర్మాణం చేస్తున్న ట్రాన్స్‌ట్రారు సంస్థకు 14 వందల కోట్ల మేరకు అంచనా వ్యయం పెంచితే అనుమానాలు కలగవా? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో వుంటే అడిగే వారు కాదా?
polavaram
పోలవరంలో భాగమైన విద్యుత్‌ ప్టాంల్‌ను ప్రైవేలు సంస్థకు అప్పగించడం ఆందోళనకరమైన నిర్ణయం కాదా? ప్రాజెక్టు అంతర్భాగంలోని ఇక విద్యుద్‌కేంద్రాన్ని ఇలా ప్రైవేటుకు ఇవ్వడం ఎప్పుడైనా జరిగిందా?

30 ఏళ్లలో కానిది రెండేళ్లలోనే హడావుడి చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పదే పదే ఆరోపించడం ఆయన సీనియార్టికి తగిన పనేనా? 1980లలో శంకుస్థాపన జరిగినా నిజంగా ప్రారంభమైంది 2005లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలోనేనని ఆయనకు తెలియదా?( నిజానికి 1994లో ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాని పివి నరసింహారావు విజయవాడకు వచ్చినప్పుడు విలేకరులు మొదటగా పోలవరం గురించి అడిగితే అది సమస్యాత్మకమని చెప్పిన మాట నిజం కాదా?

ఇప్పడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంపై ప్రత్యేక ప్రచార కాండ చేపట్టడంలో ఉద్దేశం హౌదా ఉద్యమంపై నుంచి దృష్టి మరల్చడమే కదా

పట్టిసీమకు పదిసార్లు ప్రారంభోత్సవాలు చేసినట్టు పోలవరంను కూడా చేయాలనుకుంటున్నారన్నది నిజం కాదా? అసలు డ్యాం సంగతి వదిలేసి కాఫర్‌ డాం అనే మట్టికట్ట గురించి ముఖ్యమంత్రి అంత వివరంగా మాట్లాడ్డం దాన్ని ప్రచారం చేయడం ఎందుకు? మట్టికట్ట ఉద్దేశం నీటి ప్రవాహాన్ని మళ్లించడమే తప్ప అడ్డుకోవడానికి సరిపోతుందా? మట్టి డ్యాం వందేళ్ల వరదను దృష్టిలో పెట్టుకుని కడితే ప్రాజెక్టు పదివేలలో వచ్చే అసాధారణ వదరలను కూడా దృష్టిలో పెట్టుకుని కడతారని ఒక అగ్ర పత్రిక వివరణ ఇవ్వడం దాన్ని మింగించడమే కదా?
సాంకేతికావసరాల కోసం నిర్మించే కాఫర్‌ డాంనే ఆనకట్టగా చూపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? నిర్మాణ నిపుణులు చూసుకునే రోటీన్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపించి ఏదో జరిగిపోతుందనే భావన కలిగించడం వల్ల ఉపయోగం ఏమిటి?
ఎత్తు విషయంలో కూడా కొంచెం తక్కువలోనే నీటి విడుదల చేయాలని ఆతృత పడడం కూడా అయిపోయిందనిపించుకోవడానికే కాదా? వెయ్యేళ్లు వుండాల్సిన ప్రాజెక్టు విషయంలోనూ ఇలా హడావుడి పడటం వాంఛనీయమా?
ఈ మొత్తం మార్పులు చేర్పులలో పారదర్శకత ఎక్కడుంది?
ఎలాగూ ఇవ్వాల్సిన పోలవరం ఇచ్చారని సంబరపడిపోయి మిగిలినవి వదిలేసుకున్నందుకు ఎంత మూల్యం చెల్లించాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *