‘నమో’ నయా జాతీయ వాదం- ఆరెస్సెస్‌ వ్యూహం

656765-pm-modi-flags-off-tiranga-yatra
ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో వామపక్ష సామాజిక విద్యార్థి సంస్థలు ఘన విజయం సాధించడం కేంద్ర ప్రభుత్వమూ, సంఘ పరివార్‌ సాగించిన దుష్ప్రచారానికి చెంపపెట్టు. దేశభక్తి దేశ ద్రోహం అంటూ కృత్రిమ వివాదం తీసుకొచ్చి విష ప్రచారాలను అత్యున్నతమైన పార్లమెంటు వరకూ తీసుకెళ్లిన విపరీతం గతంలో ఎప్పుడూ ఎరగనిది. అయితే హెచ్‌ సియు నుంచి జెఎన్‌యు వరకూ సాగిన ప్రచారం ఒక పద్ధతి ప్రకారమే నడిచిందనేది గమనించాల్సిన విషయం. దేశ వ్యాపితంగానే బిజెపి ఆరెస్సెస్‌లు జాతీయత నినాదాన్ని వ్యూహాత్మకంగానే ముందుకు తెస్తున్నాయి. ఉదాహరణకు బిజెపి ఎంపిల సమావేశంలో ప్రధాని మోడీ చెప్పిన సందేశం జాతీయతను కాపాడ్డమే. తాజాగా కర్ణాటక తమిళనాడు జల వివాదం ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో విడుదల చేసిన ప్రకటనలోనూ సమస్యపై సంప్రదింపులు, శాంతి భద్రతల సంరక్షణ వంటి వాటితో పాటు జాతీయవాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. అన్ని పార్టీల మద్దతుతో ఆమోదించిన జిఎస్‌టి బిల్లును కూడా ఒకే దేశం ఒకే పన్ను అన్న పద్ధతిలో ముందుకు తెచ్చారు. ఒకే దేశం ఒకే ప్రజ అని బిజెపి చాలా కాలంగా నినాదమిస్తున్నది. దీని కొనసాగింపు ఒకేదేశం ఒకే మతం ఒకే ప్రజ అన్నది వారి ఆంతర్యం. నరేంద్రమోడీని ముందుకు తెచ్చాక దీనికి ఒకే నేత అన్న మాట కూడా కలిసింది. నమో నమో భజన పూర్వక ప్రచార వ్యూహం నడుస్తున్నది.
అధికార పాచికల అనర్థం
తమది విలక్షణ పార్టీ అని సిద్ధాంతాల ప్రాతిపదికనే నడుస్తుంటుందని బిజెపి చెప్పుకుంటుంది. అదెప్పుడూ మితవాద మతవాద హిందూత్వ సిద్ధాంతమే. ఆ ప్రకారమే ఎప్పుడూ మెజార్టి హిందూమతతత్వ రాజకీయాలు నడుపుతూ వచ్చింది. ఇందిరా గాంధీ పాలనలో మొదలై రాజీవ్‌ గాంధీ హయాంలో వివాదాస్పద రామజన్మభూమి తలుపులు తెరిచిన అవకాశవాద నిర్ణయం తర్వాత బిజెపి బాహాటంగానే రామభక్తిని రాజకీయాల వైపు మళ్లించి లాభపడింది. ఎవరో అన్నట్టు ఈ దేశ చరిత్రలో మొదటి సారి ఒక ప్రధానన్రాయకుడు రాముడి బొమ్మను కమలం గుర్తును మేళవించి రథమెక్కి వూరేగారు.. దీనంతటి వల్ల బిజెపి బలం పెరిగిందనడం నిస్సందేహం. అయితే రథికుడు ఎల్‌కె అద్వానీని పక్కనపెట్టి అటల్‌ బిహారీ వాజ్‌పేయినిsrisri ప్రధానిగా భారత దేశం ఎదురుచూస్తున్న వ్యక్తి( ద మ్యాన్‌ ఇండియా అవైట్స్‌) అన్నారు. ఆ రాజకీయ రామజపానికే అప్పుడు హిందూ జాతీయ వాదం అని పేరు పెట్టారు. ఆరెస్సెస్‌ యంత్రాంగం, మతం మేళవించిన జాతీయ వాద నినాదం, వ్యక్తి ఆకర్షణ, సూత్ర రహితంసంఘటన అన్నిటినీ కలిపి అధికారపీఠం ఎక్కారు. ఆ దశలో కీలకంగా సహకరించి బలాబలాలు మార్చింది చంద్రబాబు నాయుడే. అయినా జయలలిత మద్దతు ఉపసంహరించడంతో 1998లో ఆ ప్రభుత్వం పడిపోక తప్పలేదు. అలాటి సమయంలో పాకిస్తాన్‌ సైనిక దుస్సాహసం వల్ల కార్గిల్‌ సంఘర్షణ దేశభక్తి జాతీయత వంటి ప్రచారాలు చేసుకోవడానికి మళ్లీ గెలవడానికి బిజెపికి అవకాశం లభించింది. ఈ కాలమంతా కూడా బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం కాంగ్రెస్‌ నాటి ఆర్థిక వైదేశిక విధానాలనే కొనసాగించింది తప్ప ఇసుమంతైనా మార్చింది లేదు.
మోడీకి త్రీడీ ప్రచారం
అదే సమయంలో గుజరాత్‌లో మోడీ ప్రభుత్వ హయాంలో äఘోరమైన మత మారణహౌమం సాగింది. ఇందిరాగాంధీ హయాంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌, ఆమె హత్య సమయంలో సిక్కులపై వూచకోత అలాగే పివి నరసింహారావు ప్రధానిగా వుండగా బిజెపి కూటమి బాబరీ మసీదు కూలగొట్టడం, తదనంతర మతఘర్షణలూ, ముంబాయి పేలుళ్లు పెద్త ఎత్తున ప్రజల ప్రాణాలు బలిగొన్నాయి. కాని వాటికీ గుజరాత్‌లో మారణహౌమానికి తేడా ఏమంటే ఇక్కడ ప్రభుత్వం ప్రేరణగానూ ప్రేక్షక పాత్రలోనూ వుండిపోయింది. ఆరెస్సెస్‌ చెప్పే హిందూ జాతీయవాద ప్రకారం అల్పసంఖ్యాక ముస్లింలపై వూచకోత సాగింది. దీన్ని నాటి ప్రధాని వాజ్‌పేయి కూడా సహించలేక ధర్మం(మతం) రాజధర్మం(రాజ్యాంగం) మధ్య వివాదం వస్తే రాజధర్మమే పై చేయికావాలన్నారు. ఆయన మాట ఎవరూ వినరని తెలుసు. అద్వానీ జనాకర్షణ చాలదని వాజ్‌పేయిని తెచ్చిన శక్తులు ఇప్పుడు మోడీ వెనక చేరి గుజరాత్‌ నమూనా అంటూ ఆకాశానికెత్తారు. రిలయన్స్‌ అనిల్‌ అంబానీ మోడీని మహాత్మాగాంధీతో పోల్చారు. ఆయనను భావి జాతీయ నేతగా తీసుకొచ్చే ప్రయత్నం అప్పుడే మొదలైంది. తర్వాత అమెరికా కూడా రాహుల్‌కూ మోడీకి మధ్య పోటీ పెట్టి ఈయననే ప్రజలు కోరుకుంటున్నారంటూ తన మద్దతు ముందే బయిటపెట్టింది! దీనంతటి వెనకా ఒక వ్యూహం వుంది గనకే మోడీని అభ్యర్థిగా గాక ప్రధాని అయిపోయినట్టే త్రీడీ ప్రచారంతో రంగస్థలంపై నిలిపారు. అప్పటికే అవినీతి ఆరోపణలతో రోసి పోయిన కాంగ్రెస్‌ను ఓడించడమే గాక వంటరిగా మెజార్టి సాధించగలిగారు.
జాతీయవాదంలో వాస్తవాలు
ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా పనిచేసిన మోడీకి తమ సిద్ధాంతాలు ఎలా మింగించాలో తెలుసు. సంఘ సంస్కరణలు, స్వాతంత్ర పోరాటంలో గాని శ్రమజీవుల సామ్యవాద ఉద్యమాలలో గాని పాత్రలేని తమకు జాతీయ ముద్ర చాలా అవసరమనీ తెలుసు. అందుకే ఒక వైపున కార్పొరేట్‌ అనుకూల చర్యలు తీవ్రంగా అమలు చేస్తూనే మరో వైపున స్వచ్చ భారత్‌, నైపుణ్య భారత్‌, స్టార్టప్‌ ఇండియా వంటి ప్రచారార్భాటాలు చేపట్టారు. లౌకిక్‌ భారత్‌ అన్న మాట ఎప్పుడూ చెప్పకపోగా హిందూ జాతీయ వాదమే దేశభక్తి అన్న వాతావరణం తీసుకొచ్చారు. విదేశాల్లోనూ ప్రచార కాండతో ప్రతిపక్షాలపైన ముఖ్యంగా ప్రస్తుత ప్రత్యర్తి కాంగ్రెస్‌, సైద్ధాంతిక ప్రత్యర్థులైన కమ్యూనిస్టులపై దాడి జరిగేలా నిర్దేశాలిచ్చారు. సామాజిక న్యాయంపైనా దాడులకు బాసటగా నిలిచారు. ఇస్లామిక్‌ టెర్రరిజం పెద్ద సవాలే అయినా దాన్ని ఎదుర్కోవడం పేరిట అమెరికాకు పూర్తి ఉపగ్రహంగా మార్చేశారు.ఈ జాతీయ భావననే తీవ్రం చేసి ఉపఖండంలోనూ ఉద్రిక్తతల వివాదాల పెంపుదలకు తన వంతు దోహదం చేశారు.గోసంరక్షణ పేరిట దాడులతో సహా అనేక అఘాయిత్యాలు హిందూత్వ కవ్వింపు ప్రసంగాలు పోకడలను యథేచ్చగా సాగనిచ్చారు. ఎప్పుడైనా వాటితో విడగొట్టుకున్నా సంబంధం లేని పెద్దమనిషిలాగా సూక్తులు చెప్పడం తప్ప ఖండించడం దండించడం ఇంత వరకూ చూళ్లేదు. ఇంత జాతీయ వాదం చెబుతూనే ఏ రాష్మ్రంలో ఎన్నికలుంటే అక్కడ వాలిపోయి వరాలు కురిపించడం వాగ్దానాలు చేయడం షరా మామూలే.. ఆఖరుకు అరుణాచల్‌ ఉత్తరాంచల్‌ వంటి బుల్లి బుల్లి రాష్ట్రాలలో కూడా రాజకీయ కక్కుర్తికి పాల్పడ్డారు. అతి సున్నితమైన సరిహద్దు రాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌లోనూ తమ అధికారమే పరమావధిగా పావులు కదిపి పరిస్థితిని సంక్లిష్టం చేశారు. ఇంత జాతీయ వాదం చెప్పే బిజెపి కావేరి వివాదంలో కర్ణాటక తమిళనాడుల్లో వేర్వేరు విధానాలు పాటించడం దాని అసలు స్వభావం చెబుతూనే వుంది.
విపరీత కేంద్రీకరణ
మాట్లాడితే జాతీయత గురించి చెప్పే మోడీ జాతీయాభివృద్ధికి వ్యూహ రచన చేసే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి తనకే సర్వాధికారాలు వుండేలా నీటి అయోగ్‌ అనే వ్యవస్థను తీసుకొచ్చారు. మేడిన్‌ ఇండియా నినాదాన్ని మేకిన్‌ ఇండియాగా మార్చి ఒక అసెంబ్లింగ్‌ వేదికగా లేదంటే ప్రపంచ సంతలాగా మార్చేశారు. కేబినెట్‌ విధానం పార్లమెంటరీ వ్యవస్థ లాగా గాక అద్యక్ష తరహా పాలన చేస్తున్నట్టే వ్యవహరించారు. జెఎన్‌యులో ఉదారవాద భంగిమతో కన్నయ్య కుమార్‌పై దాడి చేసిన ప్రొఫెసర్‌ మార్కండేయ పరంజపే లైవ్‌ మింట్‌ పత్రికలో ‘ ద ఇంపార్టెన్స్‌ ఆఫ్‌ బీయింగ్‌ నరేంద్ర మోడీ’ అన్న వ్యాసం రాశారు. మోడీ చాలా కాలం తర్వాత ఈ దేశ రాజకీయ ఎజెండాలోకి జాతీయ వాద చర్చ తీసుకొచ్చారని కితాబునిచ్చారు. మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఈ వ్యాసమే మొదటి స్తానంలో వుంది ఇంకో వైపున నెహ్రూ గాంధీలను వెనక్కు నెట్టి సర్తార్‌ పటేల్‌, మదన మోహన మాలవీయ వంటి మితవాద జాతీయ నేతలను ముందుకు తేవడం, ఆరెస్సెస్‌ అనుకూల శక్తులకు ఆమోదం కల్పించి హేతువాదులు లౌకిక ప్రజాస్వాహిక మేధావులపై దాడులు హత్యలు చేయడం జరిగిపోతూ వుంది. ఇంకా కిందికి వెళ్లే గోసంరక్షణ లవ్‌ జిహాద్‌కు విరుగుడు వంటి పేర్లతో దళితులు మైనార్టిలపైన దాడులు జరుగుతున్నాయి. ఆఖరుకు మహిళల హక్కులపైన కూడా ప్రతికూల ధోరణులు ప్రత్యక్షమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ మోడీ విజయం సాధించడమే జరిగితే ఈ దేశ స్వరూపమే మారిపోతుందని ఇంతకుముందు చెప్పుకున్న వ్యాసంలో మార్కండేయరాశారు. త్వరలో జరిగే యుపి ఎన్నికలు అందుకు సంకేతమైతే గుజరాత్‌ ఎన్నికలు మనుగడకే సవాలు. ఈ రెండు చోట్ల గెలిచి రేపు దేశంలోనూ పట్టు పెంచుకోవడానికి మోడీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఈ జాతీయతా ప్రచార వ్యూహాన్ని ఉధృతం చేస్తుంది. ఇటీవల రాహుల్‌ గాంధీ తానూ అయోద్య సందర్శించడం వంటి ఎత్తుగడులు లేదా ప్రచార నినాదాల్లోనూ కార్పొరేట్‌ విధానాల్లోనూ మోడీతో పోటీ పడే ప్రాంతీయ పాలక పాలక పక్షాలూ దాన్ని ఓడించగలవా అనేది ఈ ఎన్నికల్లో తేలిపోతుంది. ఏమైనా మత మార్కెట్‌ తత్వాలు వ్యక్తి పూజ ప్రచారార్భాటం మేళవించిన కృత్రిమ జాతీయ వాద వ్యూహాల అసలు రూపం వెల్లడించవలసింది లౌకిక ప్రజాస్వామిక విలువలు కాపాడుకోవలసింది వివిధ రకాల ప్రత్నామ్నాయ శక్తులూ ఆలోచనా పరులే. అప్పుడే నిజమైన దేశభక్తి, జాతీయత పరిఢవిల్లుతాయి. అంతేగాని తిరంగ యాత్రల తిరణాలతో అంతా మారిపోదు.
నవ తెలంగాణ,సెప్టెంబరు 15,2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *