‘ప్రత్యేక’ వంచన- ఆర్కే కొత్త’పలుకు’ల వంత

..నమో వెంకయేష!
కవరింగ్ కథనాలెవరి బిల్డప్?
మీరు గొప్పంటే గొప్ప.. డొప్పంటే డొప్ప
ప్రజలు చవటలు కారు
విభóజన సమయంలో పార్లమెంటు వేదికగా పాలక ప్రతిపక్షాలు ఆంధ్ర ప్రదేశ్‌కు అధికార పూర్వకంగా ఇచ్చిన హామీలను మంటగలిపిన మాయా రాజకీయాల మలిన పర్వంలో మనమున్నాం. చెల్లాచెదురైన తెలుగు వాళ్లు తెల్లబోయి చూశారని అప్పుడెప్పుడే శ్రీశ్రీ అన్న చందంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వంచనాశిల్పంపై అందరిలోనూ ఆగ్రహావేదనలు నెలకొన్న సందర్భం. ఇలాటి సమయంలో దుమ్ము రేపే మీడియాధిపతులు దమ్ము చూపిస్తారనే ప్రజలు ఆశిస్తారు. నిజాలు నిర్భయంగా వెల్లడించి నిలదీస్తారని భావిస్తారు. కాని జరుగుతుంది పూర్తి భిన్నం. రాజకీయానుభవం లేదన్న నటుడు పవన్ కళ్యాణ్ వంటి వారు పాచిపోయిన లడ్డూలుగా గుర్తించిన కేంద్ర ప్రసాదం వీరికి పరమ పవిత్రంగా గోచరిస్తున్నది. వెంకయ్య నాయుడు రూపంలో సాక్షాత్తూ వెంకన్న బాబే వచ్చాడు గనక సాష్టాంగపడిపోవడమే తరువాయి అంటున్నారు. మహా వ్యూహ సంపన్నుడూ పాలనా దక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థతకు జేజేలు పలక్కపోతే ఒప్పకోమని భీష్మిస్తున్నారు.తమ వాదనా పటిమతో వాస్తవాలను అవాస్తవాలుగా దోషులను రుషులుగా చిత్రిస్తున్నారు. మాట తప్పిన వారికి మహౌన్నత నేతలుగా అభిషేకిస్తున్నారు. ఇందులో అన్నిటినీ చెప్పుకోలేకపోయినా నేను చూసిన మేరకు రెండు మూడు పత్రికలూ చానళ్ల తీరు పరిశీలిస్తే అత్యంత విచారకరంగానూ చికాకు తెప్పించేవిగానూ వున్నాయి. అరుణ్‌జైట్లీ ఆర్ధరాత్రి దాకా సాగదీసిన తర్వాత టీవీ9లో చర్చ ప్రసారమైంది. చాలా కాలం తర్వాత సిఇవో రవిప్రకాశ్ నిర్వహించారు. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుతో బిజెపి ఆడుకుంటున్నదని, గుజరాత్‌కు ఎపి పోటీ అవుతుంది గనకే హౌదా నిరాకరించారని ఏవే
వో తమవైన సిద్ధాంతాలూ గుమ్మరించారు. చంద్రబాబు మీద జాలి కలగడం లేదా అని చర్చలో పాల్గొన్న బిజెపి నేతను పదే పదే అడిగారు. (దీనిపై నేను ఆ సమయంలోనే నా స్పందన మిత్రులతో పంచుకున్నాను. వేలమంది చూశారు) ఇంతకూ ఈ చర్చ తతంగం ముగిసేలోగానే చంద్రబాబు నాయుడు మీడియాగోష్టి పెట్టి ఇచ్చిన దానికి స్వాగతం పలికేయడంతో ఈ జాలి పాటలూ చెలగాటాలు అపహాస్యంగా మారాయి. మరోవైపున మామూలుగా కాషాయ నేతల భావాలను బలపర్చే ఆంధ్రభూమి సంపాదకుడు ఎం.వి.ఆర్.శాస్త్రి ఆంధ్రకు సాయం అబ్రకదబ్ర అంటూ వున్న మాట చెప్పేయడం విశేషం. బిజెపి టిడిపినాయకులు వూరించి వూరించి విశ్వాసాన్ని వమ్ము చేసినతీరును ఆయన బాగా ఎండగట్టారు. ఆఖరుకు నమస్తే తెలంగాణ పత్రికలోనూ ఢిల్లీ ప్రతినిధి జగదీష్ సమతుల్యంగా వ్యాఖ్యానం రాశారు. ఇలా చెప్పుకోవలసినవి ఇంకా వున్నా అన్నిటిని మించి పోయింది ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్తపలుకు. చాలా సార్లు విషయాన్ని సూటిగా చెబుతారని పేరున్న ఆయన ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలన్ని ఏకపక్షంగానూ బిజెపి టిడిపిలకు వంతపాడేవిగా వున్నాయి.
నమో వెంకయేష!
సెప్టెంబరు 11 కొత్తపలుకు శీర్షికే రాని హౌదా కోసం రచ్చ రాజకీయం. తామే సాధించామని ఇదిగో అదుగో వస్తుందని తెస్తామని రాకుండా చేసిందెవరు? వారిని వదిలేసి రావాలని పోరాడుతున్న వారు రచ్చ చేస్తున్నట్టు? అందరూ కలిసి ఏపిని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారట. ప్రతిపక్షాల పోరాటం ప్రజల ఆరాటం రచ్చ అనుకుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలాగే అనిపిస్తుంది. వంచించిన నక్కలను వదిలి ఇతరులను తిట్టిపోయడం తప్పుచేసిన వారిని కాపాడే ఎత్తుగడే అవుతుంది. అధికారంలోని వారిని వదలి అందరూ ఏదో చేశారని ఆడిపోసుకోవడమెందుకు? నాయకులు, వంచన అనే పదాలను పదే పదే గుప్పించిన ఈ వ్యాఖ్యాతకు అసలైన వాగ్దానం భంగం చేసిన అధినాయకులు మాత్రం అపర దేవతల్లా అగుపిస్తారు. పుణ్యానికిపోతే పాపం ఎదురైనట్టు వెంకయ్య నాయుడు పరిస్థితి తయారైందట!విభజన సందర్భంగా ఎవరూ పట్టించుకోని ఏపికి ప్రత్యేక హౌదా కావాలని కోరిన పాపానికి ఆయన ఇప్పుడు దోషిగా బోనులో నిలవాల్సి వచ్చిందని ఈయన డిఫెన్సు లాయర్ పాత్ర తీసుకున్నారు. మరో అడుగు ముందుకేసి ఈ రోజున కేంద్రంలో ఏపీ గురించి ఆలోచించి ఏదో చేయాలని తపన పడుతున్నది వెంకయ్య నాయుడు ఒక్కరేనట. అందుకే ఏపీకీ ప్రత్యేక హౌదా రాదని మొట్టమొదటగా బయిటపెట్టిన వ్యక్తి కూడా ఆయనేనట. తన మాట నిలబెట్టుకోకపోగా వాగ్దానభంగానికి రంగం సిద్ధం చేసుకోవడం కూడా గొప్పతనమేనన్నమాట. పైగా ఇలాగే విమర్శిస్తే వెంకయ్య నాయుడు కూడా కాడిపారేసే పరిస్థితి వస్తుందట! హతవిధీ! బిజెపిలో కూడా పెద్ద భాగం జీర్ణించుకోలేకపోతున్న వెంకయ్య నాయుడు తీరును ఇంతగా నెత్తికెత్తుకోవడం ఈ వ్యాఖ్యాతకే చెల్లింది! మొత్తానికి రవి ప్రకాశ్‌కు చంద్రబాబు మీద జాలి ఆర్కేకు వెంకయ్య మీద జాలి. బాగుంది మీడియాలో జాలి గుండెలు ఎక్కువైపోతున్నాయన్నమాట.
కవరింగ్ కథనాలెవరివి?
టీడీపీ కూడా హౌదా రాదని తెలిసీ హౌదా కోసం పోరాడతామని బిల్డప్ ఇచ్చిందట. కేంద్రంపై చంద్రబాబు అస్త్రాల గురించి వాటి ప్రభావం గురించి ప్రత్యేకంగా ఈ పత్రికలోనే ఒక క్రమపద్దతిలో కథనాలు పాఠకులందరూ చూశారు. కావాలంటే ఆ జాబితానే ఇవ్వొచ్చు.ఇప్పుడు అదంతా బిల్డప్ అంటున్నారు!ఈ వ్యాసంలో కూడా చంద్రబాబు రాజకీయ విన్యాసాలను చాలా రసవత్తరంగా వర్ణించారు. ఆ మల్లగుల్లాలు చూసీ చూసీ ప్రజలు విసుగెత్తిపోయారని తెలుసుకుంటే మంచిది. దీనివల్ల తమ విశ్వసనీయతకూ విఘాతం అని గుర్తించలేనంత పారవశ్యం. వంచన రాజకీయాలకు శ్రీకారం చుట్టడంలో ఒక వర్గం మీడియా కూడా తన వంతుపాత్ర పోషించిందని దెప్పిపొడుస్తున్న వారు – జగన్ యాజమాన్యంలోని సాక్షి మినహా మరే మీడియాను గురించి మాట్లాడుతున్నారు? భజన వర్గం మీడియానే అత్యధికంగా వుందని అంగీకరించుతారా? ఈ వర్గాలలో భాగం కాకుండా ప్రజల పక్షానే నిలిచే ప్రజాశక్తి వంటివి ఎప్పుడూ వున్న విషయం కుండబద్దలుకొట్టి చెబుతూనే వచ్చాయి. కాని ఆర్కేకు కమ్యూనిస్టులు రైతులు వ్యవసాయ కార్మికుల పక్షానచేసే పోరాటాలు కూడా తప్పుగానే కనిపిస్తున్నాయి. హౌదా వస్తే పరిశ్రమలు వస్తాయంటున్న కమ్యూనిస్టులు తూర్పుగోదావరి జిల్లాలో దివీస్‌సంస్థ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు భూసేకరణ జరగకుండా అడ్డుకుంటున్నాయట. విష కాలుష్యపు కాటు వేసే పరిశ్రమలను స్థానిక ప్రజలు ప్రతిఘటించడం దానికి కమ్యూనిస్టులు మద్దతు తెల్పడం మహాపరాధమై పోయింది. మచిలీపట్నంపోర్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమోద ముద్ర వేస్తే ఆయన కుమారుడు జగన్ అడ్డుపడుతున్నారట. అప్పుడు బందరు రేవుకు 1800 ఎకరాలు చాలని చెప్పిన టిడిపి ఇప్పుడు లక్ష ఎకరాలు సేకరిస్తానంటే దానికీ వంతపాడటం ప్రతిపక్షాల ధర్మమని ఈయన చెబుతున్నారా? నిజానికి చంద్రబాబు ప్రతిపక్షంలో వున్నప్పుడు కాకినాడలోనో మరో చోట కాడిగట్టి దున్నిన ఫోటో ఫోజులు కావాలనే మర్చిపోయినట్టున్నారు. పాదయాత్ర ముగించుకుని వచ్చిన చంద్రబాబును ఆర్కే ఇంటర్వ్యూ చేసినప్పుడు నేనూ మధ్యలో మాట్లాడాను. ఆ మాటకొస్తే ఆంధ్రజ్యోతిలోనే నా గమనం కాలమ్‌లో గత పదేళ్లలోనూ తెలుగుదేశం అధినేత ప్రతిపక్షంలో వున్నప్పుడు చేసిన ఉద్యమాలపై చాలాసార్లు వ్యాఖ్యలు రాశాను. అవన్నీ ఒప్పయితే ఇప్పుడు కమ్యూనిస్టులు చేసే పోరాటాలు నేరమై పోతాయా;గ?అపహాస్యంగా కనిపిస్తాయా? ఎందుకీ ద్వంద్వనీతి? ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడినప్పుడు కూడా మద్రాసు కావాలని పట్టుపట్టి అంతా చెడగొట్టుకున్నామట. ఆ నగరంతో సంబంధం లేని ప్రతిపాదన చేసిందీ గట్టిగా ముందుకు నెట్టింది అప్పుడు ప్రధాన శక్తిగా వున్న కమ్యూనిస్టులేనని చరిత్ర చెబుతున్న సత్యం ఆయన గుర్తించాలి. మొన్న విభజన సమయంలోనూ సిపిఎం ఒక్కటే విధానపరంగా నిలబడిందని అందరూ అంగీకరిస్తున్నారు. కనక అందరినీ కలిపికొట్టే కావేటి రంగ రాగాలు చెల్లుబాటు కావు.
మీరు గొప్పంటే గొప్ప,డొప్పంటే డొప్ప
హౌదా వల్ల పరిశ్రమలు వస్తాయని చెప్పింది ఇప్పుడు ఆయన కీర్తిస్తున్న ఘన చరిత్రులే. దాంతోనే స్వర్గం వస్తుందని కాకపోయినా వ్యవసాయ రాష్ట్ర పారిశ్రామికీకరణకు మేలు జరుగుతుందని ఆశించడంలో తప్పులేదు.ఈ అంశాలపై చాలా చర్చించాం. ఏది ఎంత మేలు అనే మాట అటుంచితే అధికారికంగా ఇచ్చిన ప్రణాళికల్లో పొందుపర్చిన ప్రత్యేకహౌదాను కోరే హక్కు అందుకోసం పోరే హక్కు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపైనా ప్రతిపక్షాలపైనా వుంది. నిజానికి ఈ పోరాటానికి ఒత్తిడికి ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షం జరిపి వుండాల్సింది. బిజెపితో ముందే కుదిరిన అవగాహన మేరకు ఆయన రకరకాల దాగుడుమూతలాడి చివరకు చేతులెత్తేశారు. ఏదో ప్యాకేజీ వచ్చిందని ఆయన రాజకీయ కారణాలవల్ల చెప్పొచ్చు గాని నిశిత విమర్శక పత్రికాధిపతులెలా చెబుతున్నారు? అరుణ్‌జైట్లీ బృందం ప్రకటించిన దానిలోఒక్కటంటే ఒక్క కొత్త ప్యాకేజీ లేదు. ఇంతవరకూ ఇచ్చిన 8700 కోట్లు గాక తక్షణం ఇస్తున్నదీ లేదు. నిజానికి హౌదాలో భాగంగా రావలసిన టాక్స్‌హాలీడే, కెబికె ప్యాకేజీ వంటివాటికి ఎగనామం పెట్టడమే జరిగింది. 30 వేల కోట్ల పైన వ్యయమయ్యే పోలవరం కు సగం పాలనాకాలంలో850 కకోట్టు ఇచ్చి ఇప్పుడేదో ఒరగబెడతామంటే అదేదో మహాప్రసాదమని సంబరపడమంటున్న ముఖ్యమంత్రి మాటలను ఈయనా నెత్తినెత్తుకుంటున్నారు. హౌదా ప్రకారం వచ్చే 90 శాతానికి ఇప్పుడు ఇచ్చే 60 శాతానికి మధ్య తేడా భర్తీ చేస్తామని ఏవో మాయమాటలు చెప్పడం తప్ప దాన్ని సంఖ్యాపరంగా చెప్పారా? చెప్పగలరా? అంటే లేనేలేదు. టాక్స్ హాలిడే వంటివాటిని ముందస్తుగాలెక్కకట్టడం కుదిరేపని కాదు. ఆ హాలిడే వల్లనే ఉత్తరాంచల్ వంటిచోటికి మన ఫార్మాపరిశ్రమలు తరలిపోయిన మాట కూడా వీరికి తెలుసు. ఏ రాష్ట్రానికి చేయనంత సాయం ఏపీకి చేశామని చెప్పగానే స్వాగతించవలసిందేనని పలకడంలో కొత్తదనం ఏముంది? నిజమైతే అని ఒక తోక తగిలించారు గాని నిజమో కాదో తెలియడం లేదా? ఇంతకూ కొండ ప్రాంతాలు, గిరిజనులు వంటివాటితో పాటు ఆర్థిక స్తోమత లేని రాష్ట్రాలకు కూడా హౌదా ఇచ్చే సదుపాయం ఇంకా రద్దుకాలేదు.14వ ఆర్థిక సంఘం నీటి ఆయోగ్ వంటివన్నీ మోడీ సర్కారు నిర్వాకాలే తప్ప మరెవరికి సంబంధం లేదు.ఆ సంస్థలకూ హౌదాకు అస్సలు సంబంధం లేదు.
చవటలు కాదు ప్రజలు
దారుణంగా మాటతప్పిన వారిని దానవీరశూర కర్ణులుగానూ దానికోసం పోరాడాలనే వారిని వంచకులుగానూ చిత్రించడం అంటే నిజాన్ని అబద్దంగా చెప్పడమే. ఇలాటి అసత్యాలకే మోసపోయేంత అమాయకత్వంలో ప్రజలు లేరని బిజెపి టిడిపి నేతలు వారి వందిమాగధులు గుర్తించడం మంచిది. హౌదా గాని నిధులు గాని ఇవ్వడానికి నిరాకరించడానికి కేంద్రం ఎవరి స్వంత ఖజానా కాదు,ఈ దేశమూ రాష్ట్రాల ప్రజల హక్కు. కొత్తపలుకుల వ్యాఖ్యాత అంటున్నట్లు వారేమీ వెధవాయిలు కాదు. నిజానికి గురజాడ అన్నది కూడా వంచకుల గురించే అనిపించిందీ వంచకుడితోనే. హౌదా ఇస్తామని వంచన చేసినవారిని వంచడమెలాగో ప్రజలకు ి తెలుసు. వాగ్దానాలు వమ్ము చేసిన వారికి పాఠం చెప్పడమూ తెలుసు. ముందుముందు ఆ ముచ్చటా చూస్తారు.
ప్రజాశక్తి, సెప్టెంబరు 14,2016
Andaroo erri pappalu, vaallu aadu kuntunnaru.. Daridram emitante, voter gorre kasayi vaallane nammmutaadi