అమరావతి ‘స్విస్’ – హైకోర్టు చెండాడిన అంశాలేమిటి?


మర్యాద పూర్వక పదాలు వాడాలంటే అమరావతిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం స్విస్ ఛాలెంజి పద్ధతిలో సింగపూర్‌కు కట్టబెట్టడం ఆది నుంచి అధికార ప్రకటన సవరణల వరకూ అభ్యంతర కరంగా నడిచింది. ఈ అభ్యంతరాలు లేవనెత్తింది ప్రతిపక్షాలో ప్రజా సంఘాలో కాదు- ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టే వీటిని సుదీర్ఘంగా పొందుపర్చింది. ఆదిత్య, ఎన్వీఎన్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎస్.రామచంద్రరావు సుస్పష్టమైన నిలుపుదల ఉత్వర్వులు విడుదల చేయడమే గాక అనేక తీర్పులను నిబంధనలను ఉల్లంఘిస్తూ స్టే ఇచ్చారు.
సాంకేతిక పదజాలం లేకుండా సాధారణ పరిభాషలో హైకోర్టు తీర్పులోని సారాంశం చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సార్లు పప్పులో లేక తప్పులో కాలేసిందని అర్థమవుతుంది.
. 1.నిన్న కూడా తెలకపల్లి రవి.కామ్‌లో చెప్పుకున్నట్టు స్విస్ చాలెంజి అంటే పోటీదారుడు తనకు తాను అడక్కుండానే ఒక ప్రతిపాదన(బిడ్)సమర్పించాలి. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థ లేక సంబంధిత సంస్థ ఏదైనా సరే ప్రతిపాదన వచ్చాక దాన్ని పరిశీలించి బాగుంటే స్వీకరించాలి. ఇతరులెవరైనా అంతకంటే బాగా చౌకగా సమర్థంగా చేయగలరేమో ఆహ్వానించాలి. మొదట ప్రాజెక్టు ప్రతిపాదన చేసిన వారిని ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోనెంట్(ఓపిపి) అంటారు.ఓపిపి ప్రతిపాదనలో అనుసరించే పద్ధతులు, ప్రక్రియ కేవలం వారి స్వంతం. వాటిని బయిటపెట్టకూడదు. కాని దాన్ని అమలు చేయడానికి సంబంధించిన ఆర్థికాంశాలు వారు పెట్టే పెట్టుబడి, తీసుకునే వాటా, ప్రభుత్వానికి వచ్చేది వంటి వివరాలు బయిటపెట్టాల్సిందే. లేకుంటే ఇతరు
లు అంతకన్నా తక్కువకు చేయగలమా లేదా అని పరిశీలించి చెప్పే అవకాశం వుండదు. ప్రక్రియ లేదా టెక్నిక్ ఓపిపి స్వంతం కావచ్చు కాని రేట్లు రహస్యం కాదు. ఒకరినే ముందు బెస్ట్ ప్లాన్ అని ప్రకటిస్తున్నారంటే ఆర్థికంగా దాన్ని సమర్థించే వివరాలు కూడా పంచుకోవాలి. గత ఏడాది 400కు పైగా రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రతిపాదన సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా ఈ మాట చెప్పారు. స్విస్ చాలెంజిలో ఓపిపి తనకు తానుగా అడక్కుండానే సూమోటో గా ప్రాజెక్టు రూపకల్పన చేసి సమర్పించాలి అని.సుప్రీం కోర్టు కూడా అంతకు ముందే ఇదే చెప్పింది. కాని అమరావతి నిర్మాణం కాంట్రాక్టులో ఇవన్నీ ఉల్లంఘించారు
2. అసెండాస్ సెంబ్‌కార్ప్ సింగ్‌బ్రిడ్జి పేరుతో ఏర్పడిన సింగపూర్ కన్సార్టియం తమకు తాముగా ప్రాజెక్టుగా పెంపొందించి సమర్పించలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వ బృందాలు పదే పదే సింగపూర్ పర్యటించి సంప్రదింపులు జరిపాయి..న వారిచ్చిన ప్లానును పరిశీలించి సవరణలు సూచింరారు. 2015 మే 4న ప్లాన్ రాగా సూచనలు చేసిన పిమ్మట మళ్లీ అక్టోబరు30న దాన్ని మార్చి సమర్పించారు. 21-3-16న స్విస్‌చాలెంజి బిడ్ దాఖలు చేశారు. అంటే ముందు నుంచి ప్రభుత్వం సింగపూర్‌కు అనుకూలమైన వైఖరి తీసుకుని వారిపట్ల మొగ్గు చూపింది.(నిజానికి వారందరిని కన్సార్టియంగా ఏర్పడవలసిందిగా తామే సూచించామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు)
3.ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే రాజధాని సంబంధిత సంస్థలు 2016 జూన్‌నెలలో సింగపూర్ కన్సార్టియంను ఓపిపిగా ఆమోదించాయి. అయితే దానికి సంబంధించిన వివరాలు బయిటపెట్టకుండానే ఇతరులను పోటీపడాలని ఆదేశించాయి. బిల్డర్లకు ఇచ్చిన సమయం కూడా వారం కాగా దరఖాస్తు మొత్తం చాలా ఎక్కువగా 25 లక్షలుగా నిర్ణయించారు. బిడ్డర్లకు విధించిన షరతులు కూడా సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా వున్నాయి.
4.బిడ్డర్లతో సమావేశంలో వారు అడిగినప్పటికి కన్సార్టియంకు ఇచ్చే వాటా ఎంతో చెప్పడానికి నిరాకరించారు. అర్హత పొందిన వారికి మాత్రమే వాటిని వెల్లడిస్తామని మెలిక పెట్టారు. పోటీ పడవల్సింది ఓపిపితో అయినప్పుడు వారెంతకు చేసేది చెప్పకుండా పోటీ పడటం ఎలా సాధ్యం?
5.అదే కన్సార్టియంతో దీర్ఘకాలంగా సంప్రదింపులు జరుపుతూ ఒకటికి రెండు సార్లు సవరణలకు అవకాశమిచ్చిన వారు ఇతరులను ఏ వివరాలు లేకుండా పోటీలో పాల్గొనాలని అది కూడా వారం రోజుల గడువులో తేలాలని నిర్ణయించడం న్యాయబద్దం కాదు. పైగా కన్సార్టియం కోరిన రాయితీలు, ఆమోదం కూడా ప్రకటించబడింది. ఇది సమాన పోటీ సూత్రానికి విరుద్ధం.
6.దేశంలో కూడా భారీ నిర్మాణ సంస్థలు వున్నప్పుడు వాటికి శక్తి వుండదని కేవలం విదేశీ కంపెనీలకే సమర్థత వుంటుందన్నట్టు మాట్లాడ్డం భావ్యం కాదు
7. రాజధాని నిర్మాణం చాలా అవసరం. ప్రభుత్వ కృషి ఆదుర్దా అర్థం చేసుకోదగినవే.అయితే ప్రభుత్వాలు వనరులపై నిర్ణయం తీసుకునేప్పుడు ధర్మకర్తల్లా వ్యవహరించాలి గాని ఏకపక్షంగా వ్యవహరించకూడదు. మామూలుగా ఇలాటి నిర్మాణ విషయాల్లో కోర్టు స్టే ఇవ్వడం జరగదు. కాని ఇక్కడ లోపాలు పరిశీలించాల్సిన అంశాలు చాలా వున్నాయి.
8.ఈ నేపథ్యంలో ఒకవేళ ఓపిపికి స్విస్ చాలెంజి పద్ధతిలో ఆమోదం తెల్పి ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టడాన్ని అనుమతించితే అప్పుడు మొదలైన దాన్ని వెనక్కు నడిపినట్టవుతుంది. 16-9-16న బిడ్లు తెరిచే లోగా ఈ మొత్తం విషయాలు అధ్యయనం చేసి తుది తీర్పు చెప్పడం సాధ్యం కాదు.కనుకనే స్టే ఇవ్వాలని కోర్టు నిర్ణయానికి వచ్చింది.అక్టోబరు 31న ఈ కేసును విచారణ చేస్తాము. అప్పటి వరకూ ఈ విషయంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించడమైనది.
9. ఎంతో దీర్ఘకాలం 20 ఏళ్లు సాగే రాజధాని నిర్మాణంలో స్పష్టత కోసం ఈ జాప్యం పెద్ద ప్రభావం చూపకపోవచ్చు.
10. ఇందుకు మద్దతుగా న్యాయమూర్తి సుప్రీం కోర్టు టాటా సెల్యులార్ కేసులో ఇచ్చిన ఆదేశాలు, జిహెచ్‌ఎంసిలో ప్రకాశ్ ఆర్ట్స్‌కు సంబంధించి నడిచిన కేసు వగైరాలను పొందుపర్చారు.