సెప్టెంబర్ 17: కెసిఆర్ సంకోచం,బిజెపి అపచారంí
సెప్టెంబరు 17 పేరిట తెలంగాణా ప్రాంతంలో షరామామూలుగా ఈ ఏడాది కూడా రకరకాల రాజకీయ శక్తులు హడావుడి సాగిస్తున్నాయి. విమోచనా విద్రోహమా అని చర్చలు నడుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఈ పరిస్థితి మారలేదంటే ఆయా పార్టీలకు చరిత్ర కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలిపోయింది. దాదాపు ఇరవయ్యేళ్ల ్ల కిందట బిజెపి విమోచన దినానికి తనదైన మతభాష్యం తెచ్చింది.బిజెపికి బొరుసు లాటి మజ్లిస్ కూడా రంగ ప్రవేశం చేసింది. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ తెలుగు దేశం నాయకులూ పరిణామ క్రమం గురించిన చారిత్రిక స్పష్టత లేకుండా రాజకీయ అవసరాల మేరకు మాట్లాడుతూ వచ్చారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా గత వైఖరి మార్చుకోవడానికి సిద్ధం కావడం లేదు. చరిత్ర కారులమని చెప్పుకునే మరికొందరు కూడా గజిబిజి పెంచడానికి కారకులవుతుంటారు. సెప్టెంబర్ 17కు ి ముందు వెనక వీర తెలంగాణా పోరాట చరిత్ర నిర్మించిన కమ్యూనిస్టుల కన్నా , వారి నాయకత్వంలో పోరాడిన యోధుల కన్నా ఇలాటి వారి హడావుడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీటన్నిటి మధ్యనా ఉభయ కమ్యూనిస్టుపార్టీలు ఎప్పటిలాగే సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి. అందులోనూ ఇది 70 వార్షికోత్సవ సందర్భం.
మా నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి ఈసడించిన పరమ పైశాచిక పాలనకు వెట్టిచాకిరీకి మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. 1946 జులై 4న దొడ్డి కొమరయ్య వీర మరణం దానికి నాందీ వాచకం. ప్రపంచ ప్రజల పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన ఆ పోరాట విజయాలను కొత్తగా చెప్పనవసరం లేదు. పది లక్షల ఎకరాల పంపిణీ, 3000 గ్రామాలలో పంచాయితీ ప్రజారాజ్య స్తాపన వగైరా ఎప్పుడూ స్మరించుకునేవే. కాకుంటే ఈనాటి రకరకాల రాజకీయ విన్యాసాల మధ్య తెలంగాణా పోరాట సందేశం కూడా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. ఈ పోరాట కార్యక్షేత్రం తెలంగాణానే అయినా పోరాటంలో పాల్గొన్నవారిని ప్రాంతీయ రేఖలతో,కుల మతాల కొలబద్దలకు అతీతమైంది.
నాటి నిజాం డిఐజి లేఖ
సెప్టెంబర్ 1948 సెప్టెంబరు 13న ప్రారంభమైన పోలీసు చర్యకు ఆరు నెలల ముందు – ఫిబ్రవరి26న నిజాం ప్రభుత్వ డిఐజి నవాబ్ దీన్ యార్ జంగ్ బహదూర్ తమ ప్రభుత్వ కార్యదర్శికి రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు:
” గత కొంతకాలంగా ప్రజల దృష్టి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కల్లోలిత పరిస్తితులపై కేంద్రీకృతమై వుంది. నిజాం స్టేట్ ఆంధ్ర మహాసభ(మరో విధంగా చెప్పాలంటే ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీగా పరిచితం) రావినారాయణ రెడ్డి అనే కమ్యూనిస్టు నాయకత్వంలో సాగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఫలితమే ఇది. ఆయనకు 1940 నుంచి భారత కమ్యూనిస్టుపార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి.1945 తర్వాత నెమ్మదిగా కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై 1945 నాటికి పూర్తి స్తాయి కమ్యూనిస్టుగా మారాడు. రైతు రంగంలో కమ్యూనిస్టు విధానాలు కార్యక్రమాలు సాగిస్తున్నాడు. తెలంగాణా ప్రాంతంలోని ఈ కేంద్రాలలో కమ్యూనిస్టు ప్రభావాన్ని విస్తరింపచేయడంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మొదటి నుంచి బెజవాడలోని సిపిఐ రాష్ట్ర శాఖ ప్రభావంతో మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నది. పి.సుందరయ్య,కంభంపాటి సత్యనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య,చండ్ర రాజేశ్వరరావు ఇందుకు సంబందించిన ముఖ్యనాయకులుగా వున్నారు.వీరు తరచూ ఇక్కడ పర్యటిస్తూ కమ్యూనిస్టులకు ప్రత్యేకమైన వివిధ కార్యకలాపాలను నడిపిస్తున్నారు.కిసాన్ యాత్రలు, పశు ప్రదర్శనలు, బుర్రకథల వంటివి నిర్వహిస్తున్నారు.
గడచిన రెండున్నర సంవత్సరాలలోనూ నిజామాంధ్ర మహాసభ దేశ్‌ముఖులు వతన్ దార్లకు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించింది.1945 డిసెంబరు నుంచి ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా రెవెన్యూ పోలీసు శాఖల వారికి వ్యతిరేకంగా ప్రమాదకరమైన వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నది.ఈ కాలమంతటా కూడా వారి ఉద్యమానికి బెజవాడ నుంచి ప్రచురితమయ్యే తెలుగు పత్రిక ప్రజాశక్తి మద్దతునిచ్చింది. ఈ పత్రికలో నిజాం స్టేట్, బెజవాడ కమ్యూనిస్టులు ఉభయులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అతిశయోక్తులతో కూడిన రాతలు రాస్తున్నారు.”
దాదాపు 40 పేజీల ఈ నివేదిక నిండా కమ్యూనిస్టులపై నిందారోపణలు మాత్రమే గాక కమ్యూనిస్టుల దాడులంటూ కట్టలు కట్టలు జాబితాలు ఢిల్లీకి పంపించారు. నిజాం రజాకార్ల రాక్షస హత్యాకాండకు తలవంచని ఆ పోరాటాన్ని అణచేందుకే కేంద్ర సైన్యాలు దిగాయన్నది వీటన్నిటిలో రుజువయ్యే సత్యం. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహమేమిటో ౖ పుచ్చలపల్లి సుందరయ్య చాలా స్పష్టంగా రాశారు:
” స్వదేశీ సంస్థానాలను వాటి పాలకులైన రాజకుమారులను నవాబులను రద్దు చేయాలని పొరుగునే వున్న భాషా ప్రాంతాలలో విలీనం చేయాలని వివిధ జాతులకు నిజమైన ప్రజాతంత్ర వ్యవస్థ ఏర్పర్చాలని, స్వతంత్ర ప్రజాతంత్ర భారత సమాఖ్యను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వమూ దాని కాంగ్రెస్ నాయకులూ ఏ నాడూ ఆసక్తి ప్రదర్శించలేదు.వారు కోరుకున్నదల్లా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి అధికారాన్ని వారసత్వంగా పొందాలనీ, తమ స్వంత పెట్టుబడిదారీ(లాభార్జన లక్ష్యంగా గల పారిశ్రామికీకరణ) భూస్వామ్య దోపిడీని పెంపొందించాలని మాత్రమే.వారు స్వదేశీ సంస్తానాలలో ప్రజా పోరాటాలను పెంపొందించనూ లేదు. ప్రోత్సహించనూ లేదు.సర్వదా సంస్థానాధీశులను బుజ్జగించడానికి పూనుకున్నారు……. బ్రిటిష్ వాళ్లు భారత భూభాగంలోని స్వదేశీ సంస్థానాలన్నిటికీ భారత దేశంలో గాని పాకిస్తాన్‌లో గాని చేరడానికి లేదా స్వతంత్రంగా వుండిపోవడానికి అవకాశమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ దుస్తంత్రాన్ని అధిగమించడానికి సంస్తానాధీశులు భారత యూనియన్‌లో చేరేలా ఒత్తిడి చేయడానికి మాత్రమే కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు..”
సర్దార్ పటేల్ నిర్వాకం.
ఈ కారణంగానే నైజాం భారత యూనియన్‌లో చేరడానికి నిరాకరించినా నిర్యుద్ధ సంధి చేసుకుని ఆయుధాలను అందించారు. వీటిని ఉపయోగించుకునే రజాకార్లు ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. అయినా ప్రజా పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలోనే సెప్టెంబర్ 13వ తేదీన జనరల్ జెఎన్‌చౌదరి నాయకత్వంలో పోలీసు చర్య ప్రారంభమైంది, కమ్యూనిస్టులను అణచివేయడం నీవల్ల కాదని నైజాంకు చెప్పి మరీ సైన్యాన్ని పంపించారు. వాస్తవానికి ఒకటి రెండు చోట్ల తప్ప నిజాం సైన్యాలు రజకారులు ప్రతిఘటించింది లేదు. అందుకే అయిదు రోజుల్లోనే 17 నాటికి నైజాం పూర్తిగా లొంగిపోయాడు. ఆ తర్వాత పదిహేను రోజులలోన అంటే సెప్టెంబరు నెలాఖరుకల్లా జెఎస్‌చౌదరి సైనిక ప్రభుత్వం కమ్యూనిస్టులపై ప్రజలపై హంతక దాడి ప్రారంభించింది. వివిధ ప్రాంతాలలో వందలాది సైనికులతో పెద్ద శిబిరాలు ఏర్పాటుచేశారు. గ్రామాల నుండిపారిపోయిన దేశ్‌ముఖ్‌లను ప్రజా శత్రువులను కాంగ్రెస్ వలంటీర్లను తీసుకొచ్చి వారి పెత్తనాన్ని పున:స్థాపితం చేసేందుకు కారకులయ్యారు. ప్రతి సైనిక శిబిరం పక్కనే కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటైంది! సైనిక దళాలకు లొంగిపోవాలని కమ్యూనిస్టు యోధులను పట్టివ్వాలని ప్రజలను కోరుతూ బెదిరిస్తూ వూరూరా తిరిగారు. ఇదీ సర్దార్ పటేల్ ఘనకార్యం.
ఆ విధంగా పోలీసు చర్య అనేది కూలిపోతున్న రాజును రాజప్రముఖ పట్టంతో అభిషేకించి అంతకు ముందు కన్నా క్రూరంగా పోరాట వీరులను వూచకోత కోసే వున్మత్త హత్యాకాండకు వొడి
గట్టింది. జనం తరిమేసిన దొరలకు కాంగ్రెస్ టోపీలు పెట్టి గడీల్లో పున:ప్రతిష్టించింది. తెలంగాణా జపంతో నాటి దొరల వారసత్వం కొనసాగడానికి బీజాలు అక్కడే వున్నాయి. నిజాం రాజ్యం కూలిపోవడం కలసి పోవడం వెనక ఇంత చరిత్ర వుంది. ఈ సారాంశం చూడకుండా పోలీసు చర్యనే విమోచన దినం అంటే చరిత్ర పరిహసిస్తుంది. సరోజిని నాయుడు తనయుడైన డా.జయసూర్య ఆరువారాల వ్యవధి ఇస్తే శాంతి స్థాపన చేయగలనని కోరితే జనరల్ చౌదరి అహంకారంతో ఆ లోపునే కమ్యూనిస్టులను అణచివేస్తానని ప్రగల్భాలు పలికాడు. కాని 1951లో పోరాటం విరమించిన తర్వాత జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులే అఖండ విజయం సాధించారు.
విమోచన కాదు విలీనం అనేది మరో వాదన. ఉత్తరాంధ్ర జిల్లాలను ఫ్రెంచి వారికి తర్వాతకట్టబెట్టడంతో మొదలుపెట్టి రాయలసీమను దత్తమండలం చేసేంత వరకూ కూడా తెలుగు ప్రజలను చీలికలు పేలికలు చేసింది నిజాం నిరంకుశత్వం. బ్రిటిష్ వారి పాదాల ముందు మోకరిల్లి స్వాతంత్రాన్ని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అప్పగించడమే కాదు, స్వతంత్రంగా పోరాడే టిప్పు సుల్తాన్ వంటివారిని తుదముట్టించేందుకు సహకరించిన దోషులూ ద్రోహులూ ఆ పాలకులు.. కనుక విప్లవ భాషణంతో కొందరు మేధావులు ”స్వతంత్ర” నిజాంను బలవంతంగా విలీనం చేసినట్టు చెప్పడం వితండ వాదనే.
ఇక సెప్టెంబరు 17, 1998లో ఎల్‌కెఅద్వానీని సమక్షంలో రాజకీయ హడావుడి మొదలెట్టింది బిజెపి. ి బిజెపికి లేదా సంఘ పరివార్‌కు నిజాం వ్యతిరేక పోరాటంతోగాని ఏ ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమాలతో గాని ఏ మాత్రం సంబంధం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చాక జునాగడ్ పాకిస్తాన్‌తో కలవడానికి మంతనాలు జరిపితే, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు స్వతంత్రం ప్రకటించుకోవడానికి ప్రయత్నించాయి. వీటికి ి ప్రతిరూపం లాటి రామరాజ్య పరిషత్ హిందువనే ఒకే కారణంతో కాశ్మీర్ రాజు కుట్రలకు వంతపాడింది! చరిత్ర తిరగేస్తే దేశానికి ద్రోహం చేసిన రాజులలో మీర్జాఫర్లూ వున్నారు, జయ చంద్రులూ వున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మత ప్రాతిపదిక తప్ప మానవ సమానత,లౌకిక కొలబద్దలు మతతత్వ రాజకీయాలకు అక్కర్లేదు.