నమో జియో నయో మాయ

crutu5tvyaymi3y
బడా మీడియా మొత్తం హౌరెత్తించింది- రిలయన్స్‌ జియో దేశ గమనాన్నే మార్చేస్తుందన్నట్టు! పతాక శీర్షికలే కాదు ఫుల్‌పేజి కథనాలు, గంటల కొద్ది విశ్లేషణలు నడిచాయి. వందల కోట్ల వ్యాపార ప్రచారం లభించింది. ప్రధాని కార్యాలయం అనుమతితో మోడీ చిత్రం వేసుకోవడం వల్ల ప్రభుత్వ ఆశీస్సులున్నాయనే వాతావరణం ఏర్పడింది. వాయిస్‌ కాల్స్‌ను కూడా డేటాగా పరిగణించి కారు చౌకగా సేవలందించేందుకు ప్రధాని మోడీ ప్రేరణతో అధినేత ముఖేష్‌ అంబానీ ముందుకొచ్చారని! జియో స్టాల్స్‌ముందు బారులు తీరారు వినియోగదారులు. వేరే కనెక్షన్లు వున్నవారు మార్చుకోవడానికి పాకులాడుతున్నారు. తమ కాల్స్‌కు కనెక్టివిటీ నిరాకరించి ఇతర కంపెనీలు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాయని రిలయన్స్‌ ఫిర్యాదులు చేస్తున్నది. లక్ష 27 వేల కోట్ల పెట్టుబడి పెట్టి 4జి టెక్నాలజీతో ఇంత ఉదారంగా సేవలందిస్తున్న రిలయన్స్‌ విస్త్రతికి వితరణకూ విస్తుపోయినంత పనవుతున్నది. అయితే ఒక్క క్షణం.. ఇదంతా నిజమేనా? శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు? ప్రబీర్‌ పుర్కాయస్త వంటి నిపుణులు, రామచంద్ర గుహ వంటి కాలమిస్టులు దీనిపై రాసిన విషయాలు చాలా ఆసక్తికరంగానూ కనువిప్పుగానూ వున్నాయి.
జియో కొత్తగా కనిపెట్టింది గాని ప్రవేశపెట్టింది గానీ ఏమీ లేదు. ఒకసారి నెట్‌ వర్క్‌ నిర్మించాక వాయిస్‌కు ఇతర డేటాకు తేడా ఏమీ వుండదు.

jio_2994587f కాల్స్‌కు ఖరీదు వసూలు చేసేప్పుడు ఆవరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ఎఆర్‌పియు) లెక్క కడతారు. ఎంతమంది వినియోగదారులుంటే అంత ఆదాయం వస్తుందితప్ప వాటికి వేరే ఖర్చు వుండదు.
ఇప్పటికే వాట్సప్‌, సిగల్‌, స్కైప్‌ వంటివి కాల్స్‌ను డేటాగానే అందిస్తున్నాయి.
అయితే దూరపు కాల్స్‌ కోసం బ్లాక్‌ హాల్‌ అనే వ్యవస్థను భారతీయ మొబైల్‌ కంపెనీలు వినియోగిస్తున్నాయి. దీన్ని జియో మొత్తం కాల్స్‌కు వాడుతుంది. వాయిస్‌ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌(వివొఐపి) అనే బ్రహ్మపదార్థం లైసెన్సు ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైనట్టు కొందరు చెబుతున్నారు గాని నిజం ఏమంటే ఇది అందరి దగ్గరా వుంది.కాని ఇప్పటి వరకూ ఒక అవగాహనతో వినియోగంలోకి తీసుకురాని వివోఐపిని రియలన్స్‌ ఏకపక్షంగా రంగంలోకి తెచ్చింది.ఇది వారి మధ్య ఒక ప్రత్యర్థిని సృష్టించింది. ఇక ఏం జరుగుతుందో చూడాలి
జియో రేట్లు చాలా చౌక అన్నది అవాస్తవం. తమ్ముడు అనిల్‌అంబానీ చేతిలో వున్న రిలయన్స్‌ మొబైల్‌ నెలకు 500 వసూలు చేస్తే జియో 499 చేస్తుంది. జియో అతి తక్కువ టారిఫ్‌ 28 రోజులకు 149. వొడాఫోన్‌ నెల రోజులకు 175. 0.1 గిగాబైట్‌(జిబి) రోజుకు 19 అంటే నెలకు 570 జియో రేటు. ఇది తక్కువేమీ కాదు. కాకుంటే చూపించే తీరు ఆకర్షనీయంగా వుంది.

ఇక ఈ లైసెన్సును రిలయన్స్‌ స్వంతం చేసుకున్న తీరు కూడా డొంకతిరుగుడుగా ఇంకా చెప్పాలంటే టక్కరి తనంతో నడిచింది. ఇన్ఫోటెల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిట 2.5 కోట్ల పెట్టుబడితో దరఖాస్తు చేసి లైసెన్సు పొందింది.మొత్తం 22 సర్కిళ్లలో 20 మెగాహెడ్జ్‌(ఎంహెచ్‌జెడ్‌) స్పెక్ట్రం తీసుకుంది. కాని తన మూల విలువకు 5000 రెట్లు ఎక్కువగా 12,847.77 కోట్టు చెల్లించింది. రావలసిన లైసెన్సులన్నీ వచ్చేశాక నాటకం ముగిసింది. ఇన్ఫోటెల్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ కాస్త రిలయన్స్‌ జియో అవతారమెత్తింది. ఈ విషయంలో ఆ కంపెనీకి 20 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమలబ్డి చేకూర్చారని 2016 మే నెల కాగ్‌ నివేదిక తప్పు పట్టింది. దీనిపై టెలికాం శాఖ అతకని సమర్థనలు చేస్తున్నది.
అసలు 2001 నాటి రేట్లకు 2016లో ఎలా లైసెన్సు ఇచ్చారని కూడా కాగ్‌ నిలదీసింది. ఇదింకా ముగియలేదు.
అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని నేను సరదాగా అంటున్నట్టే రిలయన్స్‌కు గతంలోనూ మోడీ ప్రభుత్వం చాలా మేళ్లు చేసింది. ఇప్పుడు ఏకంగా ఆయన బొమ్మ వేసుకుని అధికార ముద్ర సంతరించుకోవడానికి ప్రధాని కార్యాలయం అనుమతించింది.
దీనిపై ఇంకా వివరణ కావాలా? అవినీతికి ధన రాజకీయాలకు అతీతమని చెప్పుకునే వారి మాటల విలువేమిటో తెలియడం లేదా?
.
బడా మీడియా కావాలని చేసే ప్రచారాల పట్ల విచక్షణ లేకుండా కొట్టుకుపోకుండా విమర్శనాత్మకంగా పరిశీలించడం విద్యావంతుల బాధ్యత.
జియోకు సంబంధించిన మరిన్ని వివరాలు అసలు మొబైల్‌ మార్కెట్‌ మతలబులు మరోసారి చెప్పుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *