ద గ్రేట్‌ ఎపి మ్యాచ్‌ మిక్సింగ్‌!

jg bu222

మూడో రోజు కూడా వృథాగా ముగిసిపోయిన ఆంధ్ర ప్రదేశ్‌ వర్షాకాల సమావేశాల రభస చూస్తుంటే పాలక ప్రతిపక్షాల ముచ్చట తీరినట్టే కనిపించింది. వర్షాకాల సమావేశాలు మూడు రోజులే నిర్ణయించడం ఒక విడ్డూరమైతే ఆ సమయం కూడా కనీసం ఒక్క వాక్యమైనాచర్చ లేకుండా ముగిసిపోవడం మరింత దారుణం. రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్టు వైసీపీ టీడీపీల మనోగతం ఇదేఅనుకోవాలి. కనీసం నేను కలిసిన ఉభయ పార్టీల శాసనసభ్యులు వెలిబుచ్చిన ఆవేదన అదే. ఎలాటి చర్చ జరగాలన్న సంకల్పమే తమ నాయకులకు లేదని ఏదో విధంగా వాయిదా వేసేస్తే సరిపోతుందని ముందునుంచే అనుకుంటున్నారని వారు స్పష్టంగా చెబుతున్నారు. అలా అనుకోవడానికి ఎవరి కారణాలు వారికి వున్నాయి. అందుకే దీన్ని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనకపోయినా మ్యాచ్‌ మిక్సింగ్‌ అనొచ్చు. ఇద్దరి వ్యూహాలూ ఓకే దగ్గర సమాప్తం కావడం. దీనివల్ల నష్టం రాష్ట్రానికే. సభ వరకూ చూసుకుంటే ప్రధానంగా ప్రతిపక్షానికి. చర్చ దాటేయాలని చూసే ప్రభుత్వ వ్యూహం సఫలం కావడానికి మీ వంతు దోహదం చేశారు.
ఇది చాలనట్టు చివరి రోజున మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ సభ్యులపై శిక్షణా చర్యలు ప్రతిపాదించారు. అది కూడా మిగిలిన సభా కాలమంతటికీ పలువురిని వెలివేయాలని భావిస్తున్నట్టు కనిపించింది. గతంలో రోజాపై తీసుకున్న చర్యకు ఆమె ఇచ్చిన క్షమాపణ లేఖపై చర్చ జరిపి నిర్ణయం తీసుకోవలసి వుండగా కొత్తగా ఈ కుంపటి మొదలవుతున్నది. ఈ సారి హైదరాబాదులో గాక అమరావతిలో సభ సమావేశమైనప్పుడు ఈ సస్పెన్షన్ల ప్రహసనంతో సరిపోతుంది. మనసు గతి ఇంతే అన్నట్టు ఈ శాసనసభ గతి ఇంతేనని సరిపెట్టుకోవలసిందే.
సభా నిర్వహణలో సంయమనం పాటించవలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటే చాకచక్యంగా ఎదుర్కొవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఉభయులూ కావాలని ఉద్రేకాన్ని పెంచి అవతలివారిని దోషులుగా చూపి ప్రజలను మెప్పించాలనే ఆరాటంలో వున్నారు. ఇలాటి పోకడలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని ఎవరనుకున్నా తప్పే. నవ్యాంధ్ర శాసనసభ సవ్యంగా జరగడం మిథ్యేనని తేలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *