కాకినాడకన్నా బెటర్‌గా పవన్ ఇంటర్వ్యూ..

ఆఫీసులో ఏదో పుస్తకానికి ముందుమాట రాస్తుంటే మిత్రులెవరో మెసేజ్ చేశారు పవన్ కళ్యాణ్‌తో రవిప్రకాశ్ ఇంటర్వ్యూ చూడమని. ఈ విషయాలపై వ్యాఖ్యలు విశ్లేషణలు చేస్తున్నా గనక చూశాను. కాకినాడ సభలో కనిపించిన గజిబిజి కూడా లేకుండా వున్న మేరకు ధీమాగా సూటిగా సమాధానాలిచ్చాడు. ఒక్కచోట కూడా తడబడింది లేదు, పొరబడింది లేదు. ఉదయం రాజమండ్రిలో చెప్పినట్టు ఆయనకు విషయాలపై స్పష్టత వుందన్నమాట. రవి ప్రకాశ్ ప్రశ్నలు 99 శాతం తెలుగుదేశం బిజెపిల కోణంలోనే అంటే వారు చేస్తున్న విమర్శల ఉటంకింపుగానే నడిచాయి. ప్రత్యేక హౌదా వల్ల పెద్దలాభమేమిటన్నట్టు, రాదని చెప్పాక ఇంక ఆందోళనతో ఉపయోగమేమిటన్నట్టు అడిగారు. ఏ లాభం లేకపోతే మీరెందుకు అప్పుడు దాని చుట్టూ ప్రచారాలు చేశారని నిలదీయడం తెలివైనపనే. వెంకయ్య నాయుడుపై కేంద్రీకరణ ఎందుకనే ప్రశ్నకు మరింత బాగా చెప్పారు- దీనికంతటికీ సంధాన కర్తగా మింగించిన నమ్మించిన వ్యక్తిగా ఆయననే అడుగుతాను అని. మోడీని వదిలేస్తున్నారన్న వ్యాఖ్కకు కూడా రెండు విధాల సమాధానం చెప్పారు- బిజెపి ప్రభుత్వాన్ని అంటే మోడీని అన్నట్టు కాదా అనీ, రేపు ఏదైనా మాట్లాడేందుకు స్పేస్ అట్టిపెట్టుకున్నాను అని. మామూలుగా చాలా సంయమనంగా మాట్లాడే కెటిఆర్ టివి9 ఇంటర్వ్యూలోనే పవన్ గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినప్పుడు కూడా తన వాదనను ఆయన అర్థంచేసుకోలేదని చెప్పేశారు(దీనిపై నా వ్యాఖ్యలు తర్వాత చేస్తాను) ఇదే నిజమైతే తెలంగాణను ఎందుకు ఆలస్యం చేశారన్నదే తన ప్రశ్న అని కూడా అన్నారు. అదే సమయంలో తనను హైదరాబాదు నుంచి వెళ్లిపొమ్మనడానికి ఎవరికి హక్కు లేదని కూడా ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై కాకినాడ సభలో కన్నా ఈ ఇంటర్య్యూవలో సూటిగా వ్యాఖ్యలు చేశారు. టిడిపి బిజెపి క్షమాపణలు చెప్పాల్సిందేనని కోరారు. ఇంతకూ రవి ప్రకాశ్ ఇంటర్వ్యూ మొత్తంలోనూ టిడిపి బిజెపిల వైరుధ్యాలను వెల్లడించే ఒక్క మాటైనా అడక్కపోవడం ఆశ్చర్యమనిపించింది. మామూలుగా ప్రభుత్వాధికారంలో వున్నవారిపై ఇలాటి ఇంటర్వ్యూలు మీడియా కార్యక్రమాలు కేంద్రీకరిస్తుంటారు గాని ఇక్కడ వారి వాదనల వల్లింపు సరిపోయింది. సిపిఎంకు పవన్ కళ్యాణ్ మరోసారి వ్రశంస చేసినా దానికేమీ ప్రాధాన్యత ఇవ్వలేదు. అనుకూలంగానూ వ్యతిరేకంగానూ కూడా అడిగింది లేదు. అర్ధరాత్రి డిబేట్‌లో వ్యాపాఆలు చూసుకునే ఎంపిల గురించి పదే పదే ప్రస్తావించిన రవి ప్రకాశ్ ఈ ఇంటర్వ్యూలో ఆ మాట పవన్ నుంచి వినాల్సి రావడం విశేషం. మీరు ఫుల్‌టైం రాజకీయ వేత్తగా లేరుకదా అంటే వ్యాపారాలు చేసుకునే వీరిలో ఎవరు ఫుల్‌టైం పనిచేస్తున్నారని చంద్రబాబు పేరుతో సహా ప్రస్తావించడం ఆసక్తికరమే. అలాటి ఎంపిలు రాజీనామా చేస్తారా అంటూ ఆ పిలుపు వ్యర్థమని సూచనగా ప్రశ్నించినపుడు అడుగుతాను, చూద్దాం అని వెనక్కు తగ్గడానికి నిరాకరించారు. ఈవెంట్ మేనేజిమెంట్‌గా సభలు జరుపుతున్నారనే ప్రశ్నకు అదేం తప్పు కాదని తేల్చేశారు.వాస్తవానికి ఈ ప్రశ్న బిజెపి , టిడిపి టిఆర్‌ఎస్ వంటి పార్టీలకు ఎక్కువగా వర్తిస్తుంది. నాయకులు కనిపిస్తున్నా వాటిని ఈవెంట్లుగానే వారు నిర్వహిస్తుంటారు. పవన్ కళ్యాణ్‌కు అంత డబ్బున్నట్టు లేదు గనక చోటా అబిమానులపైనే ఆధారపడ్డారు.
ఇంతకూ మీకేదైనా కార్యాచరణ వుందా అంటే స్పష్టత వుంది అని ఒకటికి రెండుసార్లు ధీమాగా చెప్పిన ఈ కథానాయకుడు ముందు ముందు ఎలాటి అడుగులు వేస్తారో చూద్దాం. ప్రధాన మీడియా సంస్థల్లో పాలక పార్టీల వాదనలతోపాటు ప్రతిపక్షాల ప్రజల వాదనలు వేదనలు కూడా ప్రతిబింబించాలని కోరుకుందాం.