పెద్దల కన్నా వారసులే మిన్న?
జనతా గ్యారేజి వందకోట్ల క్లబ్బులో చేరడం తెలుగు చిత్ర పరిశ్రమ ఆనందించే విషయం. ఉన్నంతలో భిన్నంగా తీస్తారనే పేరున్న కొరటాల శివకు కూడా ఇదో నూతనోత్సాహమే. చిత్రాల మంచి చెడ్డలపై భిన్నమైన అంచనాలు ఎలానూ వుంటాయి గాని ముందు పరిశ్రమ బతకాలంటే విజయాలు కావాలి. కాకపోతే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న నాలుగు సినిమాలకు సంబంధించి ఒక విశేషం వుంది. బాహుబలి, జనతా గ్యారేజీ,శ్రీమంతుడు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేదీ, పోకిరీ ఇలా చూస్తే ఈ సినిమాలన్నీ వారసులవే. కాని ఈ వారసులు తమ మూల పురుషులను లేదా పెద్దలను దాటిపోవడం విశేషం. అది కాలం తెచ్చిన మార్పు ప్రదర్శన రంగంలో వచ్చిన మార్పు కూడా. బాహుబలిని ఎవరూ కేవలం ప్రభాస్ ఖాతాలోనే వేయరు గాని ఆయనే హీరో అన్నది నిజం. తన పెదనాన్న కృష్ణం రాజు కూడా హీరోగానే గాక నిర్మాతగానూ ఘన విజయాలు అందుకున్నారు గాని ఈ స్తితికి చేరలేదు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే హీరో కృష్ణ పరిశ్రమలోనే ఎవరికన్నా మిన్నగా కలెక్షన్లు ముందే అంచనా వేయగలరని చెబుతుంటారు. ఆయన కూడా చేరని శిఖరాలు చేరాడు కుమార హీరో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి రేంజిని దాటిపోవడం ఇలాటి విశేషమే. అందరినీ మించిన ఆశ్చర్యం జూనియర్ ఎన్టీఆర్. నటరత్న మనవడిగా పరిశ్రమలోనూ పరివారంలోనూ నిలదొక్కుకోవడానికి తనదైన పోరాటం చేసిన జూనియర్ ఆదితో బాక్సాపీసు హీరో కావడం కూడా ఇంతే తమాషాగా జ
రిగింది. ఇటీవల గొప్ప విజయాలు లేవని చూస్తున్న ఆయనకు ఇదో అద్భుతమే. ఏమైనా తొలితరం పెద్దలు ఒక స్థానం సంపాదించేందుకు ఎంతగానో పెనుగులాడి వుంటారు. వారసులకు వారితో పోలిస్తే చాలా సుఖంగా వుంటుంది. అయితే ఒకసారి తెరపైకెక్కాక ఇక స్వంత సత్తా తప్ప వారసత్వమే ఆదుకోదు. పైగా పెద్దలను గౌరవిస్తూనే వారి విజయాలను దాటిపోవడం యువతకు ఉత్సాహమిస్తుంది. చిరంజీవి, ఎన్టీఆర్ వంటివారు హిందీ పరిశ్రమలో కన్నా అధికంగా పారితోషికం తీసుకుంటారని ఒకప్పుడు కథలు వచ్చేవి. కాగా ఇప్పుడు హిందీ పరిశ్రమ తర్వాత అతి పెద్ద రికార్డులు తెలుగు పరిశ్రమ సృష్టించడం దాని పరిధిని విస్త్రతిని తెల్పుతుంది. నిజానికి భారత దేశంలో అతి పెద్ద చిత్ర పరిశ్రమ హిందీ కాదు, తెలుగు అని ఒకసారి అమితాబ్ బచన్ అనడం గుర్తుచేసుకోవచ్చు.
